'తెలంగాణ బిల్లు' పై చర్చ ప్రారంభమైందా, లేదా..!!

 

 

 

రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లుపై సభలో చర్చ మొదలైందా? లేదా? అనే అంశంపై రచ్చ జరుగుతోంది. దీనిపై ఎవరేమన్నారంటే...

 

"ఈ నెల 11న జరిగిన బీఏసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు శాసనసభలో ముసాయిదా బిల్లు ప్రతులు ప్రవేశ పెట్టినందున చర్చ జరపాలా వద్దా అనే అంశంపై రాజకీయపక్షాల అభిప్రాయాల సేకరణకు సిద్ధమయ్యాను. ఇందులో భాగంగా శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి హోదాలో దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చర్చను ప్రారంభిస్తున్నట్ల్లుగా చెప్పారు. దానిపై ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించాను. ఆయన స్పందించకపోవడంతో... ముసాయిదా బిల్లు చర్చకు వచ్చినట్లుగా భావించాల్సిందే! - ఉపసభాపతి మల్లు భట్టి విక్రమార్క

 

చర్చను ప్రారంభించాలని మాత్రమే శ్రీధర్‌బాబు కోరారు. అందుకు పార్టీల అభిప్రాయం తెలుసుకునేందుకు స్పీకర్ స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టివిక్రమార్క ప్రయత్నించారు. అంతే తప్ప చర్చ ప్రారంభం కాలేదు. చర్చ జరగాలంటే తప్పని సరిగా బీఏసీలో నిర్ణయం తీసుకోవాలి. - మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

"మల్లు భట్టి విక్రమార్క చర్చను ప్రారంభించడంపై రాజకీయ పక్షాల అభిప్రాయాలు కోరినప్పుడు నేను చర్చను ప్రారంభిస్తున్నట్లుగా చెప్పాను. ప్రధాన ప్రతిపక్ష నేత అభిప్రాయాన్ని తీసుకునేందుకు ఉపసభాపతి ప్రయత్నించగా ఆయన స్పందించలేదు. బిల్లుపై చర్చ ప్రారంభమైనట్లేనని. దీనిపై పార్టీల వారీగా ఎవరెన్ని గంటలు మాట్లాడాలో తేలాల్సి ఉంది. - మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

మరోవైపు శాసనసభ వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) సమావేశమై దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.