రేపు తెలంగాణా బంద్

 

రైతుల ఆత్మహత్యలపై తెరాస ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసనగా అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి రేపు (శనివారం) తెలంగాణా రాష్ట్ర బంద్ కి పిలుపునిచ్చాయి. ఎన్నికల ప్రచార సమయంలో పంట రుణాలన్నిటినీ ఒకేసారి మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్, అధికారంలోకి వచ్చిన తరువాత వాయిదాల పద్ధతిలో మాఫీ చేస్తామని చెపుతున్నారు. రుణమాఫీ చేయకపోవడంతో ఆర్ధిక సమస్యలలో చిక్కుకొన్న రైతన్నలు ఆత్మహత్యలు చేసుకొంటున్నారని కనుక తక్షణమే రూ. 8,500 కోట్లు రుణమాఫీ కోసం విడుదల చేయాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి. కానీ అంత మొత్తం ఒకేసారి విడుదల చేయలేమని ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చి చెప్పడంతో ప్రతిపక్షాలు రేపు రాష్ట్ర బంద్ కి పిలుపునిచ్చాయి. తెరాస తప్ప ప్రతిపక్ష పార్టీలన్నీ బంద్ కి మద్దతు ఇస్తున్నందున అది విజయవంతం అయ్యే అవకాశాలే ఎక్కువ. రైతన్నల సమస్య కోసం జరుగుతున్న బంద్ కనుక ప్రజలు కూడా స్వచ్చందంగా సహకరించే అవకాశం ఉంది. సాధారణంగా ఇటువంటి సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎత్తుకిపైయెత్తు వేస్తుంటారు. కనుక ప్రతిపక్షాలు ఊహించని విధంగా ఏదయినా నిర్ణయం తీసుకొనవచ్చును.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu