సింగరేణి బొగ్గు స్మగ్లింగ్
posted on Sep 11, 2012 10:33AM

వరంగల్ జిల్లా భూపాలపల్లి బొగ్గుగనులనుంచి తరలిపోతున్న నాణ్యమైన బొగ్గుని మార్గమధ్యంలో మార్చేస్తున్నారు. రైలు వరంగల్ జిల్లా సరిహద్దులోని బావుపేట దగ్గర ఆగినప్పుడు నల్లబంగారాన్ని దొంగలు దొంగిలించి ఆ స్థానంలో పనికిరాని బొగ్గుని నింపుతున్నారు. లారీ డ్రైవర్లతో కుమ్మక్కైతే చాలు లోడ్లకి వేసి సీళ్లుకూడా కొత్తవి పుట్టుకొచ్చేస్తాయ్. రైలు ఆగీ ఆగగానే చకచకా పనిమొదలుపెట్టేస్తారు.. బొగ్గు దొంగలు.. అంతా పథకం ప్రకారం సాగిపోతుంటుంది. చాలా వేగంగా దొంగిలించిన బొగ్గు స్థానంలో నాసిరకం బొగ్గునికూడా నింపేస్తారు. మళ్లీ రైలు బయలుదేరే సమయానికి అంతా సవ్యంగానే కనిపిస్తుంది. ఈ అక్రమ దందా చాలాకాలంగా సాగుతున్నా పట్టించుకునేవాళ్లే లేకుండా పోయారని కాంట్రాక్టర్లు ఆందోళన చెందుతున్నారు. ఫ్యాక్టరీలకు నాసిరకం బొగ్గు చేరడంవల్ల తాము పెనాల్టీలు చెల్లించాల్సొచ్చి ఆదాయానికి గండిపడుతోందని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.