రాష్ట్రపతి ఎన్నికల తరువాతే వలస ఎమ్మెల్యేల రాజీనామాలు?
posted on Jun 22, 2012 10:19AM
ఉపఎన్నికల ఫలితాలు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి జాతీయస్థాయిలో గుర్తిప్మ్పును తెచ్చిపెట్టాయి. దీనివల్ల వలసలు కూడా ప్రారంభమయ్యాయి. తమ పార్టీలోకి ఎమ్మెల్యేలే రావటం ఖాయమన్న స్థిరమైన నమ్మకంలో ఆ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి ఉన్నారు. అయితే అందరినీ రాష్ట్రపతి ఎన్నికలు పూర్తయ్యేవరకూ ఆగమని ఆయన చెబుతున్నారట. ఈ ఎన్నికల్లో తమకు జాతీయస్థాయిలో ప్రాముఖ్యత లభిస్తుందని, దీని తరువాత తమ సమీకరణాలను మార్పు చేస్తే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కూడా దిగివస్తారని జగన్ భావిస్తున్నారు. ఆమెను లొంగదీసే ఏ అవకాశమూ వదులుకోకూడదని ఆయన తన సన్నిహితులతో అన్నారట. అందుకే చెంచల్ గూడ జైలులో ఉన్న జగన్ తన ములాఖాత్ సమయంలో పార్టీ నాయకుల సెల్ నుంచి కాంగ్రెస్ నుంచి వలస వచ్చేందుకు సిద్ధమైన కాకినాడ ఎమ్మల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ళ నాని తదితరులకు రింగ్ చేసి ఈ ఎన్నికలయ్యే వరకూ ఆగమని తెలిపారు. తన మాటపై వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ రాష్ట్రపతి అభ్యర్థిని ఎన్నుకుంటారని ఎంఐఎం అసదుద్దీన్ ఒవైసీకి తెలిపారు. తనకు ప్రణబ్ ముఖర్జీకి ఓటు వేయించేందుకు ఎటువంటి అభ్యంతరం లేకపోయినా ఈ కేసుల గురించే ఎమ్మెల్యేలు తనను నిలదీస్తున్నారని ఒవైసీకి చెప్పారట. దీని విషయం కూడా కాంగ్రెస్ అధిష్టానానికి చెప్పాలని ఒవైసీని జగన్ కోరారని విశ్వసనీయ సమాచారం. ఒకవేళ తన కేసులకు రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధం లేకపోతే రాష్ట్రంలో మరోసారి అవిశ్వాసం పెడితే తనకు సహకరించాలని ఒవైసీని కోరారట. దీనికి తగ్గట్లుగా ఎంఐఎం రంగారెడ్డి జిల్లాలో విస్తరించేందుకు తనవంతు సహకారాన్ని అందిస్తానని జగన్ హామీ ఇచ్చారని సమాచారం. దీంతో సంతృప్తి చెందిన ఒవైసీ మీడియా ముందు నుంచి వెడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతే తనను నినదించవద్దని జగన్ చెప్పిన మాటలను దాచేస్తూ చిన్న హింట్ ను మాత్రం వదిలేశారు. తెలంగాణలో టి.ఆర్.ఎస్., రంగారెడ్డి జిల్లాలో ఎంఐఎం పార్టీల ఎదుగుదలకు తనకేమీ అభ్యంతరం ఉండదని ఒవైసీకి జగన్ ఇచ్చిన హామీ కూడా బయటకు పొక్కింది. అయితే ఎమ్మెల్యేల రాజీనామాలను రాష్ట్రపతి ఎన్నికలయ్యేంత వరకూ జరగవని జగన్ స్పష్టం చేశారని తెలిసింది.