కర్నూలు జిల్లా ఎన్నికలకే రూ.30కోట్ల ఖర్చా?
posted on Jun 18, 2012 11:18AM
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు, ఆళ్లగడ్డ అసెంబ్లీ ఉపఎన్నికల్లో అభ్యర్థులు రూ.30కోట్ల వరకూ ఖర్చు పెట్టారని అంచనాలు వినిపిస్తున్నాయి. తెలుగుదేశంపార్టీ ఈ రెండు నియోజకవర్గాల్లో గెలుపుకోసం సుమారు 12కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ఎమ్మిగనూరులో ఐదు కోట్ల రూపాయలు, ఆళ్లగడ్డలో ఏడు కోట్ల రూపాయలు ఆ పార్టీ ఖర్చు చేసిందని లెక్క తేలుతున్నాయి. వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో విజయం కోసం ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని తేలింది. ఈ రెండు పార్టీలు ఖర్చు చేసిన 20కోట్ల రూపాయలు పోను మిగిలినది కాంగ్రెస్ పార్టీ ఖర్చు పెట్టింది. కాంగ్రెస్ పార్టీ ఖర్చులో ఎక్కువ భాగం నేతలు వచ్చినప్పుడు చేసినదే. అదీ సిఎం రోడ్డుషో, వాయలార్ రవి, పీసీసీ అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణ, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి వంటివారు వచ్చినప్పుడు అయిన ఖర్చే ఎక్కువని తెలుస్తోంది. ఏమైనా రెండు నియోజకవర్గాల్లోనే 30కోట్ల రూపాయలు ఖర్చు అయితే మొత్తం 18 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మరి ఎంత ఖర్చు అయిఉండవచ్చు అనేది ఇట్టే అంచనా వేయవచ్చు. తెలుగువన్.కామ్ గతంలో చెప్పినట్లు ఆ ఖర్చు సుమారు 200కోట్ల రూపాయలు దాటే ఉంటుందని ఎన్నికల పరిశీలకులు తేల్చేస్తున్నారు.