అవును హరీష్ రావు, నేను పోటీ పడుతున్నాం: కేటీఆర్

ఈ మధ్య తెలంగాణ రాజకీయాలు.. అందునా ముఖ్యంగా తెరాస రాజకీయాలు కేటీఆర్, హరీష్ రావు చుట్టూ తిరుగుతున్నాయి. ఈ ఇద్దరి నేతల మధ్య మనస్పర్థలు ఉన్నాయని.. కేటీఆర్ ని సీఎం చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ కావాలనే హరీష్ రావుని దూరం పెడుతున్నారని.. హరీష్ రావు త్వరలో పార్టీ వీడే అవకాశం ఉందని వార్తలొచ్చాయి. అయితే ఈ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని తాజాగా కేటీఆర్ స్పష్టం చేసారు. అంతేకాదు హరీష్ రావుని పొగడ్తలతో ముంచెత్తారు.

 

 

గురువారం సిరిసిల్లలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన.. అభివృద్ధిలో మేమిద్దరం పోటీ పడుతున్నామని చెప్పుకొచ్చారు. కాలంతో పాటు పోటీపడి హరీష్ కాళేశ్వరం ప్రాజెక్టును పరిగెత్తిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుతోనే మన బతుకులు కూడా ముడిపడి ఉన్నాయన్నారు. సీఎం కేసీఆర్ అప్పజెప్పిన బాధ్యతలను నిర్వర్తిస్తూ బంగారు తెలంగాణలో భాగస్వాములవుతున్నామని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మా ఇద్దరికి ఏవేవో మనస్పర్థలు ఉన్నాయని ఎవరెవరో చెబుతున్నారని.. అవన్నీ ఒట్టి పుకార్లేనని ఆయన కొట్టిపారేశారు. ఎస్ మేమిద్దరం పోటీ పడుతున్నాం. అందరూ అనుకున్నట్లుగా కాదు అభివృద్ధిలో మాత్రమేనని కేటీఆర్ చెప్పుకొచ్చారు. మా మధ్య ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా బ్రహ్మాండంగా కలిసికట్టుగా పనిచేసుకుంటూ ముందుకుపొదామని ఈ సందర్భంగా కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

అదేవిధంగా కేటీఆర్ పనితీరుపై హరీష్ రావు ప్రశంసలు గుప్పించారు. ఆత్మహత్యల సిరిసిల్ల, సిరుల ఖిల్లాగా మారిందంటే పూర్తి క్రెడిట్ కేటీఆర్‌దేనని అన్నారు. సిద్దిపేట రికార్డ్ మెజార్టీ దాటేలా సిరిసిల్లలో మెజార్టీ రావాలని ఆకాంక్షించారు. సిరిసిల్ల కార్యకర్తలు పోటీపడి పని చేయాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు.