జగన్ కేసులో ఈడి విచారణ ప్రారంభం, సిబీఐకు 15 రోజుల రెస్ట్
posted on Jun 21, 2012 10:30AM
దేశంలో సంచలనమైన జగన్ అక్రమాస్తుల కేసులో హవాలా నిధుల రాకను తెలుసుకునేందుకు ఇడి విచారణ ప్రారంభించింది. దీంతో అక్రమాస్తుల కేసు, ఎమ్మార్ కేసు, ఓఎంసి కేసుల విచారణలో సిబీఐకు 15 రోజుల పాటు ఊరట లభించింది. ముందు సమాంతరంగా విచారించాలని ఇడి భావించింది. అయితే కోర్టు నేరుగా ఆదేశాలు ఇవ్వటంతో 15 రోజుల విచారణకు ఇడి రంగం సిద్ధం చేసుకుంది. ఇప్పటివరకూ జగన్ కేసులో నిన్డుతులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులను విచారించేందుకు కోర్టు అనుమతి మంజూరు చేసింది. ఇడి ఈ మూడు కేసులకు సంబంధించి సిబీ దాఖలు చేసిన ఛార్జిషీటు ప్రతులను కూడా కోర్టు నుంచి తీసుకుంది. అక్రమాస్తుల కేసులో న్జిమ్మగడ్డప్రసాద్, బ్రహ్మానందరెడ్డి, ఎమ్మార్ కేసులో సునీల్ రెడ్డి, కోనేరు రాజేంద్రప్రసాద్, బి.పి. ఆచార్య, విజయరాఘవ, ఓఎంసి కేసులో రాజగోపాల్, శ్రీలక్ష్మి, డి.వి. శ్రీనివాస రెడ్డి తదితరులను ఇడి విచారిస్తుంది. కోట్లాది రూపాయల హవాల నిధులు ఎలా జగన్ సంస్థలోకి వచ్చాయన్న విషయాన్ని తెలుసుకునేందుకు ఇడి ఈ మూడు కేసులను విచారిస్తోంది. దాని ప్రధానలక్ష్యం మాత్రం హవాలా నిధులు ఎలా రాబట్టగలిగారు? ఈ నిధులు రాబట్టేందుకు అధికారాన్ని ఎలా దుర్వినియోగం చేశారు? రాష్ట్రప్రభుత్వమేనా ఇంకెవరన్నా జగన్ కు సహకరించారా? ఇప్పటిదాకా సిబీఐ అనుమానించిన వారేనా ఇంకేమైనా కొత్తపాత్రధారులున్నారా? జగన్ కు మాత్రమే ఎందుకు ఈ విధమైన మద్దతు లభిచింది? వంటి పలు అనుమానాలను ఈ నిందితుల ద్వారా తీర్చుకునేందుకు ఇడికి అనుమతి లభించింది. దీంతో ప్రస్తుతం సిబీఐ విచారిస్తున్న జగన్ అక్రమాస్తుల కేసుల్లో 15రోజుల పాటు ఆ సంస్థకు విరామం లభించినట్లే. ఇప్పటిదాకా చేసిన విచారణ తాలూకు ఫైల్స్ క్షుణ్ణంగా పరిశీలించేందుకూ సిబీఐకు ఈ సమయం ఉపయోగపడుతుంది.