ఒకేరోజు మూడు క్లిష్టమయిన కేసులపై హైకోర్టులో విచారణ

 

ఈరోజు హైకోర్టులో ఒకేసారి మూడు ముఖ్యమయిన పిటిషన్లపై విచారణ జరగనుంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు, శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్ల ఎన్కౌంటర్ మరియు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా అసోసియేషన్)కి జరిగిన ఎన్నికలపై దాఖలయిన మూడు పిటిషన్లను కోర్టు ఈరోజు విచారణకు చేప్పట్టనుంది. వాటిలో మా అసోసియేషన్ ఎన్నికలపై పెద్ద వివాదమేమీ లేదు కనుక ఈరోజు దాని ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. కానీ జి.హెచ్.యం.సి. ఎన్నికల నిర్వహణ, ఎర్ర చందనం స్మగ్లర్ల ఎన్కౌంటర్ కేసులలో అనేక చిక్కు ముళ్ళు ఉన్నాయి కనుక వారిపై తీర్పు చెప్పడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.

 

మా అసోషియేషన్ ఎన్నికల ప్రక్రియను విడియో రికార్డింగ్ చేసి హైకోర్టుకి సమర్పించబడింది. దానిని చూసిన తరువాత కోర్టు తన తీర్పు వెలువరించవచ్చును.

 

ఇక జి.హెచ్.యం.సి. ఎన్నికల నిర్వహించేందుకు కనీసం ఈ ఏడాది డిశంబర్ వరకు సమయం అవసరమని తెలంగాణా ప్రభుత్వం కోరుతోంది. కానీ అంత సమయం ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది కనుక ఎన్నికలు ఎప్పుడు నిర్వహించేంది తెలియజేసేందుకు తమకు మరికొంత సమయం కావాలని తెలంగాణా ప్రభుత్వం ఈరోజు కోర్టును కోరవచ్చును.

 

ఇక ఎర్ర చందనం స్మగ్లర్ల ఎన్కౌంటర్ పై ఆంద్రప్రదేశ్ డీ.జి.పి. ఇచ్చిన సంజాయిషీతో హైకోర్టు సంతృప్తి చెందలేదు. ఈ ఎన్కౌంటర్ లో ప్రాణాలు కోల్పోయినవారు హత్యకు గురయినట్లుగా కేసులు నమోదు చేసి, దానిపై సమగ్ర నివేదిక అందజేయవలసిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించడం గమనిస్తే హైకోర్టు ఈ ఎన్కౌంటర్ పై చాలా ఆగ్రహంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇది కూడా పలు క్లిష్టమయిన అంశాలతో కూడిన కేసు కనుక దీనిపై కూడా విచారణ మరికొంత కాలం కొనసాగే అవకాశం ఉందని భావించవచ్చును.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu