చంద్రబాబు ఓటు చెల్లుతుంది.. భన్వర్‌లాల్‌కి భంగపాటు

 

 

 

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బుధవారం నాడు జూబిలీహిల్స్ లోని పోలింగ్ కేంద్రంలో తన కుటుంబ సభ్యులతో కలసి వెళ్ళి ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, పొత్తు ధర్మం ప్రకారం తాను బీజేపీకి ఓటు వేశానని, అటు అసెంబ్లీకి గానీ, ఇటు పార్లమెంట్‌కి గానీ తమ నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థులు రంగంలో లేనందున తమ మిత్ర పక్షమైన బీజేపీ అభ్యర్థులకు ఓటు వేశానని చంద్రబాబు చెప్పారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ చంద్రబాబు ఓటు చెల్లదని ప్రకటించారు. అయితే ఈ విషయంలో తెలుగుదేశం నాయకులు భన్వర్‌లాల్‌ని నిలదీశారు. ఓటు వేసేటప్పుడు ఎవరికి వేస్తున్నదీ చూపిస్తే తప్పు తప్ప, ఆ తర్వాత ఎవరికి ఓటు వేసిందీ చెబితే తప్పు కాదని వాదించారు. అయినా సరే భన్వర్‌లాల్ తన పట్టు వీడలేదు. ఓటును రద్దు చేసే అధికారం భన్వర్‌లాల్‌కి లేదని చెప్పినా ఆయన పట్టించుకోలేదు. దాంతో ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్ళింది. కేంద్ర ఎన్నికల సంఘం చంద్రబాబు మాట్లాడిన దానిలో తప్పేమీ లేదని, ఆయన ఓటు చెల్లుతుందని ప్రకటించింది. దీంతో చంద్రబాబు ఓటు చెల్లదని ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ భంగపడినట్టు అయింది.