పెట్టుబడులకు సాదర స్వాగతం.. బాబు..

ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలని జపాన్ పారిశ్రామికవేత్తలను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోరారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్లో జపాన్ పారిశ్రామికవేత్తలతో ప్రభుత్వ అధికారులు ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ఈ కార్య్రక్రమంలో 30 మందికి పైగా జపాన్ పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. రాజధాని నిర్మాణంతో పాటు అనేక సదుపాయాలు, రవాణా, పెట్టుబడులు, రహదారులు, ఎలక్ట్రానిక్, హార్డ్ వేర్ రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి మంచి అవకాశాలున్నాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో సహజ వనరులు సమృద్ధిగా ఉన్నాయని, 10 లక్షల ఎకరాల ల్యాండ్ బ్యాంకును ఏర్పాటు చేస్తామని తెలిపారు. నిర్ణీత సమయంలో పరిశ్రమలకు అనుమతులు ఇచ్చేందుకు ప్రత్యేకంగా ఏర్పరిచిన సింగిల్ డెస్క్ ద్వారా అనుమతులన్నింటిని నేరుగా ఆ అధికారే ఇచ్చేందుకు వెసులుబాటు కల్పించామన్నారు. ఆంధ్రపదేశ్, జపాన్ ల మధ్య సాంస్కృతికంగా చాలా సారూప్యం ఉందన్నారు. రెండు నెలల్లో తాను జపాన్లో మరోసారి పర్యటించి స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరనున్నట్లు చెప్పారు.