సురాజ్యమవని .. స్వరాజ్యం

 

 

 

.....సాయి లక్ష్మీ మద్దాల

 

నేడు భారతావని అంతటా 67వ స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు జరుపుకుంటోంది. భారతదేశం సస్యశ్యామల దేశం. ఎన్నో సహజ వనరులు పుష్కలంగా ఉన్న దేశం. అభివ్రిద్ది విషయంలో మాత్రం ఇంకా అభివృద్ధి చెందుతూ ఉన్నామనే చెప్పుకుంటున్నాం. 67 వసంతాలు గడిచినా భారత ప్రజలను పట్టి పీడిస్తున్న సమస్యలు అనేకం.  పేదరికం,నిరుద్యోగం,నిరక్షరాస్యత,పౌష్టికాహారలోపం,బాలకార్మికులు, లంచగొండితనం,నానాటికి పతనమవుతున్న దేశ ఆర్ధిక వ్యవస్థ.

 

ఇవే కాదు ఇంకా చాలా సమస్యలు నేడు దేశాన్ని పట్టి పీడిస్తున్నాయి. సహజవనరులను దేశ సంక్షేమానికి వినియోగిచుకోవటం లో విఫలమైన,సహజ వనరుల కుంభ కోణాల్లో మాత్రం ఆరి తేరిపోయారు మన పాలకులు. గత 9ఏళ్ళుగా యు.పి.ఎ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి మన దేశం చూడని కుంభకోణం లేదు. కాని ప్రజా సంక్షేమాన్ని మాత్రం గాలికి వదిలేశారు. ప్రజలను  నానాటికి సోమరిపోతులను చేసే విధంగా ప్రజాకర్షక పధకాలు. దేశంలో ఎక్కడ చూసినా అదుపులో లేని శాంతి భద్రతలు. మెరుగైన విద్యను అందించలేని ప్రభుత్వ వైఫల్యం కారణంగా వీధికోకటిగా పుట్టుకొస్తున్న ప్రైవేటు విద్యా సంస్థలు,ఫలితంగా అందరికి అందుబాటులో లేకుండా పోతున్న విద్య. ఎలాంటి వసతులు లేని,పరికరాలు లేని ప్రభుత్వ ఆసుపత్రులు,దీనికారణంగా వెలుగు చూస్తున్న కార్పోరేట్ ఆసుపత్రులు ఫలితంగా సామాన్యుడికి అడుబాటు లో లేని వైద్యం. తాగటానికి గుక్కెడు నీళ్ళు కావాలంటే మైళ్ళ కొద్ది దూరం వెళ్ళాల్సిన పరిస్థితి.


             
 గ్రామాల పరిస్థితి మరీ దుర్భరం. వ్యవసాయాన్ని ఆదుకొనేవాడు కనబడక రైతు దిగాలుపడిపోతు,ఆత్మహత్యలు చేస్కుంటున్న రైతన్నలు. మగ్గాలు కదలనంటున్న చేనేత రైతుల పరిస్థితి మరీ దారుణం. ఇవన్ని దేశ ప్రజలను పట్టి పీడిస్తున్న సమస్యలు. ఇంక నేతల విషయానికి వస్తే దేశ సమగ్రతను కాపాడాలన్న బలమైన తపన ఏ ఒక్క రాజకీయ నేతకు లేదు. కేవలం దేశం లో ని అంతర్గత సమస్యలెకాదు,దేశ సరిహద్దులో పొంచి ఉన్న సమస్యల నుండైన దేశాన్ని కాపాడే యోచనలో పాలకులు ఉన్నారా అంటే అది సందేహమే. ఒక పక్క నుంచి పాకిస్తాన్ మరోపక్క నుంచి చైనా ఎప్పుడు ఏదో ఒక సమస్యను దేశం మీదికి విసురుతూనే ఉన్నాయి. ఇది మన దేశాన్ని ఏలుతున్న నేతల వైఫల్య ఫలితం కాదా. దేశం పుట్టెడు సమస్యల్లో చిక్కుకొని ఉంది. కాని ఆ సమస్యలపై చర్చించే తీరిక మన నేతలకు లేదు. కనీసం చట్ట సభ్లలోనైన ప్రజా సమస్యలు చర్చకు వస్తాయా అంటే అక్కడ ఉండేది   యుద్ద వాతావరణమే.



               ఇంక ప్రజల విషయానికి వస్తే దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 66 వసంతాలు పూర్తి అయినా,వారు బానిస మనస్తత్వాన్ని వదులుకుంటున్నట్లు లేరు. ఎందుకంటే నెహ్రు తర్వాత ఇందిరాగాంధీ,ఆ తరువాత రాజీవ్ గాంధి,తరువాత సోనియా గాంధి తరువాత రాహుల్ గాంధికి అధికారాన్ని కట్టపెట్టాలని ప్రయతిస్తున్నారే తప్ప,సమర్ధులైన నాయకులను ఎన్నుకోవటం లేదు. ఎంతో అనుభవం సమర్ధత కలిగిన ప్రణబ్ ముఖర్జీ ప్రధాని కాలేక పోయారు. ఇది రాచరికానికి మరో రూపం అవుతుందే తప్ప ప్రజాస్వామ్యం కాజాలదు. ఎన్నాళ్ళి వారసత్వ రాజకీయాలు?ప్రజాస్వామ్యమంటే ప్రజలు వోట్లు వేసి నేతలను ఎన్నుకోవటం మాత్రమే కాదు చేయాల్సింది. వారసత్వ రాజకీయాలను తిప్పికొట్ట గలగాలి. అవినీతి పరులైన నేతలకు బుద్ధి చెప్పగలగాలి,సమర్ధులైన నాయకులను ఎన్నుకోవాలి.