సర్దుకుపోవడం నేర్పితే సమస్యలే వుండవు... పిల్లలంటే అమ్మకి ఎంతో ప్రేమ. వారికి ఏ బాధా కలగకుండా చూసుకోవాలనుకుంటుంది. వారి ప్రతి కోరికా తీర్చాలనుకుంటుంది. పిల్లలు అడిగిందే తడవుగా వారు కోరినవన్నీ కొనివ్వాలనుకుంటుంది. అయితే ఇలా కోరినవన్నీ పొందటానికి అలవాటు పడ్డ పిల్లలు, కోరినది దొరకనపుడు సర్దుకుపోవటం ఎలాగో నేర్చుకోలేరు. మన చేతుల్లో వున్నంతవరకు వాళ్ళకి అన్నీ అందుబాటులో వుంచుతాం. కానీ జీవితంలో కోరినవన్నీ దొరకాలని లేదు కదా! మరప్పుడు దొరికిన దానితో సర్దుకుపోవటం ఎలాగో పిల్లలకు తెలీక ఇబ్బంది పడతారు. అందుకే గెలుపు, ఓటములు, సర్దుకుపోవటం వంటివన్ని మనమే పిల్లలకి రుచి చూపించాలి. ఇందుకు సంబంధించిన ఓ కథ చెప్పుకుందాం. ఒక ఊరిలో ఓ చిన్న కుటుంబం నివసిస్తోంది. తండ్రి ఓ చిన్న ఉద్యోగం చేస్తూ భార్య, ఇద్దరు పిల్లలని పోషిస్తూ వుండేవాడు. సంపాదన తక్కువైనా పిల్లలు ఏది అడిగినా దానిని తీర్చాలని తాపత్రయం పడేవాళ్ళు ఆ దంపతులు. ఒకసారి సెవెంత్ క్లాసు చదువుతున్నపుడు వాళ్ళ పెద్దకొడుకు రాకెట్ కావాలని అడుగుతాడు. తన ఫ్రెండ్స్‌కి వాళ్ళ మావయ్య అమెరికా నుంచి బొమ్మ రాకెట్ తెచ్చాడని, అలాంటిది తనకీ కావాలని పేచీ పెడతాడు. పిల్లల కోరికలన్నీ తీర్చాలని వున్నా, ఈ కోరిక తీర్చటం వాళ్ళ స్థోమతకు మించినది. ఎలా మరి? అని మథన పడతారు అ దంపతులు. రాకెట్ కోసం పిల్లాడి పేచీ రోజురోజుకి పెరుగుతుందే కానీ తగ్గటం లేదు. చివరికి పిల్లాడి తల్లి ఓ నిర్ణయానికొస్తుంది. పిల్లలు సాయంత్రం స్కూల్ నుంచి వచ్చేసరికి బోలెడన్ని రంగు కాగితాలు, జిగురు వంటివి తెచ్చిపెడుతుంది. పిల్లలురాగానే వాళ్ళముందు రంగు కాగితాలు, కత్తెర, జిగురు పెడుతుంది. ఈ రోజు మనమే మంచి ఆట ఆడబోతున్నాం. ఈ రంగురంగు కాగితాలతో మీకు నచ్చినట్టు స్టార్స్‌ని, మూన్‌ని, సన్‌ని ఇలా అంతరిక్షాన్నంతటినీ మన గోడమీదకి తీసుకురావాలి. మీ గదిలోని గోడ పైన మీ ఇద్దరి క్రియేటివిటీతో అంతరిక్షాన్ని రెడీ చేస్తే ఆ అంతరిక్షం పైకి వాళ్ళే రాకెట్‌ని నేను మీకు ఇస్తాను అంటుంది. ఇక పిల్లలిద్దరూ హుషారుగా పని మొదలుపెడతారు గంటలు గడుస్తాయి. అమ్మా అయిపోయింది అని పిలుస్తారు. గోడ నిండా చుక్కలు, గ్రహాలు ఎంతో అందంగా కనిపిస్తాయి. రాకెట్ ఏది అని అడుగుతారు పిల్లలు. ఆ తల్లి చిన్నగా నవ్వి మీ గదిలోని ఈ అంతరిక్షoలోకి వెళ్ళటానికి ఇదిగో ఈ కాగితం రాకెట్ సరిపోతుంది చూడండి అంటూ వివిధ సైజుల్లో చేసిన పేపరు రాకెట్లని చూపిస్తుంది. ఇదిగో ఎవరి రాకెట్ ఎక్కడికి వెళుతుందో విసరండి అంటుంది. పిల్లలిద్దరూ పేపర్ రాకెట్లు విసురుతారు. ఆ ఆట వాళ్ళకి ఎంతో నచ్చుతుంది. మా ఫ్రెండ్ దగ్గరైతే బ్యాటరీలతో కొంతదూరం ఎగిరే రాకెట్ వుంది కానీ మన దగ్గర అంతరిక్షమే వుంది అంటారు. వాళ్ళ ఆనందాన్ని చూసిన తల్లికి అనిపిస్తుంది. పిల్లలు అడిగినవి మన చేతుల్లో లేనపుడు ‘‘లేదు’’ అని చెప్పటం కాదు వాళ్ళని ఎలా మళ్లించాలో తెలిసివుండాలి. ఆ తర్వాత ఆ పిల్లలు ఎప్పుడూ ఏ బొమ్మా కావాలని పేచీ పెట్టలేదు. నచ్చిన బొమ్మ కనిపిస్తే దానిని స్వయంగా ఎలా చేసుకోవచ్చో ఆలోచించేవారు. అమ్మ సాయంతో రకరకాల బొమ్మలు తయారు చేసుకున్నారు. వారి ఆలోచనలకి పదును పెట్టారు, కొన్న బొమ్మలతో కూడా దొరకనంత తృప్తిని పొందారు. అన్నీ తెలుసుకోలేని వయను పిల్లలది. వారికి నిజమైన ఆనందాన్ని రుచి చూపిస్తే తప్పకుండా వారు ఆ దారిలో నడుస్తారు. ఈసారి పిల్లలు అడిగినవన్నీ సమకూర్చాలని అనిపిస్తే ఒక్కసారి ఈ కథ గుర్తుచేసుకుంటారు కదూ! -రమ
పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం పెడుతున్నారా? ఇది చదవాల్సిందే.. పిల్లలను కనడానికి యువతీయువకులు ఎంత సంతోషిస్తారో వారు పెరిగి పెద్దవుతున్నప్పుడు ఒకవైపు సంతోషం ఉన్నా అంతకు మించి ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వారికి పాలు తాగించడం పెద్ద కష్టం కాదు. కానీ పిల్లలు పెరిగే కొద్ది అన్నం తినడానికి చాలా మారాం చేస్తారు. దీనివల్ల పిల్లలకు పోషకాహార లోపం ఏర్పడుతుందని భయపడతారు. ఇందుకే పోషకాలను భర్తీ చేయడానికి హెల్త్ డ్రింకులు తాగించడానికి, అన్నం తినిపించడానికి వారిని ఏమారుస్తారు. ఒకప్పుడు కథలు చెబుతూ, భయపెడుతూ అన్నం పెట్టేవారు. కానీ ఇప్పుడు మొబైల్ లో కార్టూన్స్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారు. అసలు పిల్లలకు మొబైల్ చూపిస్తూ అన్నం తినిపించవచ్చా? అలా చేస్తే ఏమవుతుంది? నేటికాలంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆహారం పెట్టడానికి ఎన్నుకున్న సులువైన మార్గం మొబైల్ చూపిస్తూ అన్నం తినిపించడం. పిల్లలకు ఆహారం పెట్టే విషయంలో జరిపిన కొన్ని అధ్యయనాల ప్రకారం రెండు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలలో 90శాతం మంది మొబైల్ లేనిదే ఆహారం తీసుకోవడం లేదు. ఇలా మొబైల్ చూస్తూ ఆహారం తీసుకోవడం అనేది పిల్లలకు ఒక అలవాటుగా మారి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. పిల్లలు అయినా, పెద్దలు అయినా మొబైల్ చూస్తూ లేదా టీవి చూస్తూ తింటే ఆహారం రుచి ఫీల్ కాలేరు. పిల్లలకు ఆహారం రుచి తెలియడం చాలా ముఖ్యం. మొబైల్ చూస్తూ తినడం వల్ల అది మిస్ అవుతారు. పైగా పరిధికి మించి తినేస్తారు. దీనివల్ల పిల్లలో ఊబకాయం ఏర్పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. పిల్లలు మొబైల్ చూస్తూ తినడం వల్ల వారిలో జీవక్రియ మందగిస్తుంది. ఫిజికల్ యాక్టివిటీకి పిల్లలు దూరం అవుతార. ఎప్పుడూ మొబైల్ చూడటానికే ఇష్టపడతారు. మొబైల్ చూస్తూ అన్నం తినే పిల్లలు కృత్రిమంగా తయారవుతారు. వారికే తెలియకుండా వారిలో ఒక మానసిక శాడిజం అభివృద్ది చెందుతుంది. అదే ఇతరులను తిట్టడం, కొట్టడం, మొండి చేయడం వంటి పనులలో వ్యక్తం అవుతుంది. తల్లిదండ్రుల మాట అస్సలు వినరు. వారి ప్రవర్తన క్రమశిక్షణ లేని జీవితానికి దారితీస్తుంది. చిన్నతనంలోనే పిల్లలు అంత ఘోరంగా మొబైల్ చూస్తే వారి కళ్లు దెబ్బతింటాయి. చిన్నప్పుడే కళ్లజోడు వాడాల్సి రావడానికి అదొక కారణం. *నిశ్శబ్ద.
పిల్లలలో మలబద్దకం సమస్య తగ్గాలంటే ఈ టిప్స్ పాటించండి! పిల్లలలో మలబద్ధకం అనేది సాధారణ సమస్య. పెద్దలు తమ సమస్యను బయటకు చెప్పినంతగా పిల్లలు వ్యక్తం చేయలేరు. ఈ కారణంగా పిల్లలలో మలబద్దకం సమస్య వారికి చాలా ఇబ్బంది కలిగిస్తుంది. ఈ విషయాన్ని తల్లులే గమనించి పిల్లల సమస్య తగ్గే మార్గాలు అన్వేషించాల్సి ఉంటుంది. ప్రేగు కదలికలు తక్కువ ఉండటం, పాస్ చేయడం కష్టంగా అనిపించినప్పుడు మలబద్దకం సమస్య ఎక్కువగా ఉంటుంది. మలబద్ధకం సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు పిల్లల ఆరోగ్య నిపుణులను సంప్రదించడం చాలా అవసరం. అయితే కొన్ని సురక్షితమైన, సమర్థవంతమైన ఇంటి చిట్కాలు పిల్లలలో మలబద్దకం సమస్యకు ఉపశమనాన్ని ఇస్తాయి. వీటిని జాగ్రత్తగా ఫాలో అయితే పిల్లలలో మలబద్దకం సమస్యను ఈజీగా పరిష్కరించవచ్చు. ఫైబర్.. పిల్లలు మలబద్దకంతో ఇబ్బంది పడుతున్నప్పుడు ఆహారంలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఇవ్వాలి. ఫైబర్ ప్రేగుల కదలికను ప్రోత్సహిస్తుంది. పైబర్ రిచ్ ఫుడ్స్ బాగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సజావుగా జరిగి సమస్య తగ్గుతుంది. యాపిల్స్, రేగు పండ్లు,బ్రోకలి, క్యారెట్, బచ్చలికూర. తోటకూర వంటి పండ్లు, కూరగాయలు, ఆకుకూరలను, ఓట్స్, బ్రౌన్ రైస్, పొట్టు తీయని గోధుమలు మొదలైనవి బాగా ఇవ్వాలి. ఫ్రూనే జ్యూస్.. ఎండిన ఫ్లం పండ్లను ఫ్రూనే అంటారు. ఈ ఫ్రూనే లతో జ్యూస్ చేసి ఇవ్వడం వల్ల మలబద్దకం సమస్య తగ్గుతుంది. ఎందుకంటే ఫ్రూనే జ్యూస్ సహజంగానే భేదిమందు స్వభావాన్ని కలిగి ఉంటుంది. కొద్దిమొత్తంలో ఫ్రూనే జ్యూన్ ను నీటిలో కలిపి రోజుకు రెండు పూటలా చాలా కొద్దిమొత్తంలో ఇవ్వాలి. ఇది మోషన్ కావడానికి సహకరిస్తుంది. కాబట్టి మరీ ఎక్కువగా ఇస్తే అతిసారం సమస్యకు దారితీస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా కొద్దిమొత్తంలో ఇవ్వాలి. వెచ్చని నీరు.. వెచ్చనినీరు కడుపులో ప్రేగులను, జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే రోజూ 10 నుండి 15 నిమిషాల పాటూ వెచ్చని నీటిలో పిల్లలను కూర్చోబెట్టడం వల్ల కడుపులో కండరాల కదలిక బాగుంటుంది. ఇది మలబద్దకం సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే గోరువెచ్చని నీటిని పిల్లలకు తాగించాలి. శారీరక శ్రమ.. పిల్లలలో శారీరక శ్రమ లేకపోవడం కూడా మలబద్దకం సమస్యకు దారితీస్తుంది. అందుకే పిల్లలలో శారీరక వ్యాయామం ప్రోత్సహించాలి. ఆటలు ఆడుకోవడానికి పంపాలి. ఎప్పుడూ కూర్చొని చదువుకోవడం, గేమ్స్, టీవి వంటివే కాకుండా పిల్లలలో యోగా, ఆసనాలు వేయిస్తుండాలి. ఇవి మలబద్దకం సమస్యను చెక్ పెట్టడానికే కాదు.. పూర్తీ శరీరం ఆరోగ్యంగా ఉండటానికి కూడా సహాయపడుతాయి. *నిశ్శబ్ద.
పిల్లలు అలగడం నేర్చుకుంటే ఎంత ప్రమాదమో తెలుసా! మీ ఇంట్లో పిల్లలు ప్రతివిషయానికీ అలుగుతున్నారా? తిండి మానేసి మరీ తమ అలకను ప్రదర్శిస్తున్నారా? అలక పోగొట్టడానికి మీరు చేస్తున్న బుజ్జగింపు ప్రయత్నాలు ఫలించడం లేదా? అయితే ఇది చదవడానికి సరైన వ్యక్తి మీరే! 'అసలు 'అలుక' అనే మాట అతి పురాతనమైంది. పురాణకాలం నుంచి వినిపిస్తోంది. సత్యభామ అలిగినప్పుడు శ్రీకృష్ణుడు బుజ్జగించిన విధం పురాణ గాథల్లో చాలా ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. రామాయణ, భారత, భాగవతాల్లో దేవతలు అలిగిన సందర్భాలు మనకు చాలా కనిపిస్తాయి. ఆ తర్వాత కాలంలో అలక ప్రదర్శించే వారికి ప్రత్యేక అలక పాన్పులు ఏర్పాటు చేయడం కూడా మనం విన్నాం. అంతేనా!.... పదవులు రాకపోతే రాజకీయ నాయకులు , అత్తగారు కోర్కెలు తీర్చలేదని అల్లుళ్ళు, అవసరాలు తీరకపోతే భార్య, భర్త మీద.. ఇలా అలకలు చాలానే ఉన్నాయి. అసలెవరైనా ఎందుకు అలుగుతారు? అని ఆలోచిస్తే వారి అలక తీరాలంటే వారు కోరే గొంతెమ్మ కోర్కెలు తీరడమే మార్గమా అన్న ఆలోచన కూడా రాకమానదు. తమకు ఇవ్వవలసిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని చెప్పడానికే మాటలు లేకుండానే 'అలక'ను వ్యక్తీకరిస్తారు. వీరు అలిగారు అని ఎవరైనా గుర్తించేలా ఉంటుంది వారి ప్రవర్తన. ఈ ప్రవర్తన ద్వారా అవతలి వారు, అసంకల్పితంగానే అలిగిన వారికి అనుగుణంగా నడుచుకోవాలన్నది అలిగిన వారి ప్రధాన ఉద్దేశం. నిజం చెప్పాలంటే ఈ అలుకకు వయస్సు, స్థాయి, స్థానం, కులం, మతాలతో సంబంధమే లేదు. సమయాన్ని, సందర్భాన్ని, అనుకూలతను బట్టి ఎవరైనా అలగవచ్చు. మన జీవన విధానాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఎదుటి వారి దృష్టిని ఆకర్షించడానికి 'అలకనే ఎందుకు ఆయుధంగా ఉపయోగించుకుంటారన్నది బోధపడుతుంది. కైకేయి అలకే శ్రీరాముణ్ణి నిర్దాక్షిణ్యంగా అడవులకు పంపేలా దశరథుణ్ణి ప్రోత్సహించింది. దక్షయజ్ఞంలో పార్వతి తన తండ్రిపై అలిగి వెళ్ళిన తరువాత జరిగిన సంఘటనలు అందరికీ తెలిసినవే. తమ పిల్లలు, ఇంకా పసిపిల్లలుగా ఉన్నప్పుడే ఏదైనా విషయానికి అలిగితే ప్రతి తల్లీ నంబరపడి, మురిసిపోతుంది. "అబ్బో వేలెడంత లేదు ఇప్పుడే అలక చూశారా!.. చూశారా! ఎంత చక్కగా అలుగుతున్నాడో” అని ముద్దు చేస్తుంది. కోరింది ఇస్తుంది. అంతే అది చాలు తమకేం కావాలన్నా ఎలా సాధించాలో తెలుసుకోవడానికి కాస్త పెద్దవగానే అలిగి అన్నం మానేస్తారు. అంతే తల్లి మనసు గిలగిల్లాడుతుంది. ఓ పదిసార్లు అలక గురించి వాకబు చేస్తుంది. అన్నం మీద అలగొద్దు. నీకేం కావాలో అదిస్తానే... అని బుజ్జగిస్తుంది. పిల్లవానికి కావాల్సింది అందుతుంది. అప్పటి నుంచి అది జీవితంలో నిరూపించబడిన సత్యంలా గోచరించి ఎప్పుడు అవసరమైతే అప్పుడు అలగొచ్చు అన్న సిద్ధాంతాన్ని పాటించడం మొదలెడతారు. ఈ అలక కూడా వారితో పాటు పెరిగి పెద్దదై కేవలం ఇంట్లో వాళ్లతోనే కాకుండా ఆఫీసులో, అత్తవారింట్లో, స్నేహితుల వద్ద, దగ్గరివాళ్ల వద్ద ఇలా తమ అలకను ప్రదర్శిస్తుంటారు. ఈ అలక వల్ల కొంత వరకూ తమ కోరికలు నెరవేరినా, కాస్త చులకన అయ్యే ప్రమాదం కూడా ఉంది. ప్రతీ విషయానికీ అలిగే వారి లక్షణాలు ఈ కింది విధంగా ఉంటాయి. ఆత్మ విశ్వాసం తక్కువ ఉంటుంది. ఇతరులపై ఆధారపడే మనస్తత్త్వం. తమ నైపుణ్యంతో కాకుండా, ఇతర మార్గాల ద్వారా ఎదుటి వారి దృష్టిని ఆకట్టుకునే ప్రయత్నం చేయడం. అనువుగాని చోట అధికులుగా గుర్తింపబడాలనే తపన. ఎదుటివారి స్థానంలో ఉండి ఆలోచించగలిగే పరిజ్ఞానం లేకపోవడం. స్వయం శక్తి మీద అపనమ్మకం. జరుగుబాటు లేకపోతే అసంతృప్తితో జీవించడం. మార్పును ఆహ్వానించే హృదయం లేకపోవడం. తన మాట, ప్రవర్తనే సరైనదన్న మొండి నమ్మకం. ప్రతి విషయానికీ అలిగే వారు 'తుమ్మితే - ఊడిపోయే...! ముక్కు చందాన ఎదుటివాళ్ళను భయపెట్టే అలవాటు కూడా నేర్చుకుంటారు. కాబట్టి పిల్లలు అలిగితే మురిసిపోకుండా వారి ప్రవర్తన తప్పుదారిలో వెళ్లకుండా తల్లిదండ్రులే జాగ్రత్త పడాలి. ◆నిశ్శబ్ద.
తల్లులూ తస్మాత్ జాగ్రత్త..మీ పిల్లలకు ఈ ఆహారం ఇవ్వకండి! మెదడుశరీరంలోని మిగిలిన భాగాల మాదిరిగానే మనం తినే ఆహారం నుంచి పోషకాలను గ్రహిస్తుంది. సరైన ఆహారం మెదడు పనితీరును మెరుగ్గా ఉంచుతుంది. అందుకే చిన్నతనంలో పిల్లల అధిక పోషకాలున్న ఆహారాన్ని అందించడం చాలా ముఖ్యం. అయితే కొన్ని ఆహారపదార్థాల పిల్లల మెదడుపై ప్రభావం చూపుతాయి. వారి ఎదుగుదలను దెబ్బతీస్తాయి. పిల్లల జ్ఞాపకశక్తిని ఏయే ఆహారాలు దెబ్బతీస్తాయో తెలుసుకుందాం. చిప్స్, పిజ్జా, బర్గర్లు: ప్యాక్ చేసిన చిప్స్, పిజ్జా, బర్గర్లు, నూడుల్స్ ఇలాంటివి ఆరోగ్యానికి చాలా హానికరమైనవి. ఇవి మూడ్ స్వింగ్స్, ప్రవర్తనా మార్పులతో పాటు పిల్లల్లో తలనొప్పి, హైపర్ యాక్టివిటీకి సంబంధించిన సమస్యలను పెంచుతాయి. నిత్యం వీటిని ఆహారంలో చేర్చినట్లయితే శ్రద్ధ, అభిజ్ఞా సామర్థ్యాలు క్రమంగా తగ్గుతాయి. కెఫిన్: కెఫీన్ కాఫీలో మాత్రమే ఉండదు. బదులుగా ఇది చాక్లెట్, టీ, కాఫీలలో లభిస్తుంది. నిజానికి, ఇది చాలా ప్రమాదకరమైనది. పిల్లలు రోజుకు 45 మిల్లీగ్రాముల వరకు కెఫిన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవచ్చు. అధిక కెఫిన్ ఉన్న పానీయాలు తాగడం వల్ల వణుకు, భయము, నిద్రలేమి, హైపర్యాక్టివిటీ, తలనొప్పి లేదా కడుపు నొప్పులు వస్తాయి. ఇవన్నీ వారి మానసిక అభివృద్ధిని ప్రభావితం చేస్తాయి. ట్రాన్స్ ఫ్యాట్స్ ఫుడ్స్: ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉండే ఆహారం మెదడు ఆరోగ్యం, అభివృద్ధిపై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. ఎక్కువగా వేయించిన ఆహారాలు, ప్యాక్ చేసిన స్నాక్స్, హైడ్రోజనేటెడ్ నూనెలతో ప్రాసెస్ చేయబడిన ఆహారాలలో కనిపిస్తాయి. ఇటువంటి ఆహారాలు శిశువు మెదడులో వాపును పెంచుతాయి. అదనంగా, ఇది రసాయన సెరోటోనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. దీని ప్రభావం డిప్రెషన్, మెమరీ లాస్ కు దారితీస్తుంది. స్వీట్లు: పిల్లలు స్వీట్స్ ను ఎక్కువగా ఇష్టపడతారు. కానీ ఈ స్వీట్ పిల్లల మెదడు అభివృద్ధిని దెబ్బతీస్తాయి. స్వీట్లు, ఐస్ క్రీం, కేకులు వంటి బేబీ ఫుడ్స్‌లో స్వీటెయినర్ ఉంటుంది. ఇది హైపర్యాక్టివిటీకి కారణమవుతుంది. పిల్లల ఆకలిని ప్రభావితం చేస్తుంది. రంగురంగుల ఆహారపదార్థాలు: మార్కెట్లో లభించే రంగురంగుల స్వీట్లు, జిలేబీలు పిల్లలను ఆకర్షిస్తుంటాయి.వీటిలో కృత్రిమ రంగులు ఉంటాయి. పిల్లలలో శ్రద్ధ లోటు హైపర్యాక్టివిటీ డిజార్డర్, ఆందోళన, హైపర్యాక్టివిటీ, తలనొప్పికి దారితీస్తాయి. తల్లిదండ్రులు ఈ ఆహారపదార్ధాలకు పిల్లలను దూరంగా ఉంచడం మంచిది. వీటికి బదులుగా గుడ్లు, రంగురంగుల కూరగాయలు, చేపలు, ఓట్ మీల్, పాలు, పెరుగు, జున్ను, బీన్స్, చేపలు ఇవన్నీ కూడా పిల్లలు తరచుగా అందిస్తుండాలి. ఈ ఆహార పదార్ధాలు పిల్లల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.
పిల్లలు ఎత్తు పెరగట్లేదా? ఈ టిప్స్ ట్రై చేస్తే సరి..! నేటికాలంలో పిల్లలను గమనిస్తే వారి వయసును కనుక్కోవడం చాలా కష్టంగా ఉంటుంది. కొందరు పిల్లలు ఎంత వయసొచ్చినా స్కూల్ పిల్లల్లానే పొట్టిగా ఉంటారు. నిజానికి పిల్లల ఎత్తు అనేది జన్యువులపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా పెరిగే వయసు అని పెద్దవాళ్లు అంటుంటారు. అలాంటి దశలో కూడా పిల్లలో ఎత్తు పెరుగుదల సరిగా లేకపోతే తల్లిదండ్రులు మాత్రమే కాదు.. పిల్లలు కూడా ఆందోళన పడుతూ ఉంటారు. అయితే పిల్లలు ఎత్తు పెరగాలంటే తల్లిదండ్రులు కొన్ని టిప్స్ ఫాలో కావాలి. ఈ టిప్స్ ఫాలో అయితే పిల్లలు ఏదైనా కారణాల వల్ల ఎత్తు పెరగడంలో ఆటంకాలు ఉన్నా అవన్నీ తొలగిపోతాయి. వేలాడటం.. పిల్లల ఎత్తు పెరగాలంటే రోజూ కాసేపు వేలాడే వ్యాయామాలు చేయాలి. దీంతో వెన్నెముక ఫ్లెక్సిబుల్‌గా మారడంతో పాటు ఎత్తు కూడా పెరుగుతుంది. పిల్లలను ఒక పార్కులో లేదా ఇంట్లో ఏదైనా ప్రదేశంలో ఈ వ్యాయామాలు చేసేందుకు తగిన వాతావరణం ఏర్పాటు చేయడం మంచిది. జంప్ రోప్.. పెరుగుతున్న పిల్లలకు జంప్ రోప్ నేర్పాలి. ఇది వారి ఎముకలు దృఢంగా ఉంచడంతోపాటు ఎత్తు కూడా పెరుగడంలో సహాయపడుతుంది. జంప్ రోప్ వల్ల శరీరం ఫిట్‌గా, దృఢంగా మారుతుంది. నిద్ర.. ఆరోగ్యకరమైన శరీరం కోసం మంచి నిద్ర చాలా ముఖ్యం. ఇది పిల్లల శరీరం మొత్తం పెరుగుదలకు సహాయపడుతుంది. యుక్తవయస్సులో పిల్లలు 8-10 గంటలు నిద్రపోవాలి. ఇది హార్మోన్లను సమతుల్యంగా ఉంచుతుంది, ఎత్తు పెరుగడంలో సహాయపడుతుంది. యోగా.. పిల్లలను రోజూ యోగా చేసేలా ప్రోత్సహించాలి. దీంతో శరీరం ఆరోగ్యంగా ఉండడంతోపాటు ఎత్తు కూడా పెరుగుతుంది. తాడాసానం, పశ్చిమోత్తనాసనం, భుజంగాసనం వంటి యోగా భంగిమలు పిల్లలతో చేయించాలి. ఇలా చేయడం వల్ల ఎత్తు పెరుగుతారు. ఆహారం.. పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం ఇవ్వడం ముఖ్యం. చిన్నతనం నుండి వారికి పండ్లు, కూరగాయలు పుష్కలంగా ఇవ్వాలి. ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని ఇవ్వాలి. కాల్షియం అధికంగా ఉండే ఆహారం పిల్లల శారీరక ఎదుగుదలలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇది శరీరానికి అవసరమైన పోషకాలను అందించి ఎముకల ఎదుగుదలను ప్రోత్సహిస్తుంది. *రూపశ్రీ.
బిడ్డలకు తల్లిపాలే అమృతమని ఇందుకే అన్నారు.. సరైన పోషకాహారం పిల్లల మొత్తం ఆరోగ్యానికి ఎంతో దోహదం చేస్తుంది. నవజాత శిశువుకు శరీరానికి అవసరమైన అన్ని పోషకాల కోసం ఎక్కడెక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఆ పోషకాలన్నీ తల్లిపాలలో పుష్కలంగా ఉంటాయి. అందుకే బిడ్డకు తల్లిపాలు అమృతసమానమన్నారు పెద్దల నుండి వైద్యుల వరకు. ప్రసవం తర్వాత వచ్చే మొదటి చిక్కటి పసుపు పాలు పిల్లల ఆరోగ్యానికి అమృతంలానే పనిచేస్తాయి. వీటిని ముర్రుపాలు అని అంటారు. ప్రసవించిన తరువాత గంటలోపు పిల్లలకు ముర్రుపాలు పడితే అవి పిల్లల శారీరక, మానసిక వికాసానికి దోహదం చేస్తాయి. కేవలం ముర్రుపాలు మాత్రమేకాదు. పిల్లలకు రోజువారీ తల్లిపాలు ఇవ్వడమే శ్రేష్టం. తగినంత పరిమాణంలో తల్లిపాలు ఉండేలా చూసుకోవడం ప్రసవించిన ప్రతి మహిళకూ అవసరమని వైద్యులు, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తల్లిపాలివ్వడం గురించి పక్కన పెడితే బిడ్డను మోసి కనడంతో తమ అందం చెదిరిపోతుందనే అపోహలో చాలామంది మహిళలున్నారు. కానీ బిడ్డను మోసి కనడంలో ఉన్న అనుభూతి మాటల్లో వర్ణించలేనిది. ప్రసవం తరువాత కూడా తల్లి పాలివ్వడంలో ఆలోచించే మహిళలు చాలామంది ఉంటున్నారు. అందుకే తల్లిపాలివ్వడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించి, బిడ్డలకు తల్లిపాలు ఇచ్చేలా ప్రోత్సహించే లక్ష్యంతో ప్రతి సంవత్సరం ఆగస్టు 1 నుండి 7 వరకు వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ జరుపుకుంటారు. పుట్టిన ఆరు నెలల వరకు నవజాత శిశువుకు రోజూ తల్లిపాలు అందేలా చూడాలని నిపుణులు చెబుతున్నారు. తల్లి పాలలో ఉండే సూక్ష్మపోషకాలు నవజాత శిశువుల మెదడు అభివృద్ధిపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయని పరిశోధనలు కూడా వెల్లడించాయి. శిశువు ఆరోగ్యంపై తల్లిపాలు వల్ల కలిగే ప్రభావాలు.. శిశువు ఆరోగ్యంపై తల్లిపాలు వల్ల కలిగే ప్రభావాలను అర్థం చేసుకోవడానికి కొన్ని పరిశోధనల్లో ప్రయత్నించారు. బాల్యంలో తల్లి పాలివ్వడం ద్వారా పొందిన సూక్ష్మపోషకాలు వృద్ధాప్యంతో మెదడు సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయని పరిశోధనల్లో తేలింది. క్రమం తప్పకుండా తల్లిపాలు తాగే పిల్లలు తల్లిపాలు లేని పిల్లల కంటే ఎక్కువ మేధో అభివృద్ధి, పనితీరును కలిగి ఉంటారు. బ్రెయిన్ డెవలప్‌మెంట్‌లో ప్రయోజనాలు.. పిల్లలకు తల్లిపాలివ్వడం ప్రారంభించిన మొదటి నెలలలో మైయో-ఇనోసిటాల్ అనే సూక్ష్మపోషకం తల్లిపాలలో ఉంటుంది. అభివృద్ధి చెందుతున్న శిశువు మెదడుకు ఇది ఎంతగానో సహాయపడుతుంది, ఇది మెదడులోని న్యూరాన్ల మధ్య సినాప్సెస్ లేదా కనెక్షన్‌లను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఫలితంగా, భవిష్యత్తులో నరాల సంబంధిత సమస్యల ప్రమాదాలను తగ్గించడంలో మెరుగ్గా ఉంటుంది. శాస్త్రవేత్తలు ఏం చెబుతారంటే.. మొదటి నెలల్లో పిల్లల మెదడు ముఖ్యంగా ఆహార లక్షణాలపై ఆధారపడి ఉంటుంది. సూక్ష్మపోషకాలు మెదడుపై ఎలా తీవ్ర ప్రభావాన్ని చూపుతాయనేది విషయం పట్ల న్యూరో సైంటిస్ట్ లు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తల్లిపాలలో ఇంత గొప్ప పోషకాలు ఎలా ఉంటున్నాయనేదాని మీద కూడా వీరు ఏ నిర్ణయాన్నిస్పష్టంగా చెప్పలేకున్నారు. కానీ తల్లిపాలు బిడ్డ మెదడు అభివృద్ధిలో వివిధ దశలకు కూడా సహాయం చేయడం మరింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఏది ఏమైనప్పటికీ 6నెలల లోపు పిల్లలకు తల్లిపాలకు మించిన గొప్పఆహారం దొరకదనేది అందరూ ఒప్పుకోవాల్సిన సత్యం. ప్రసవించిన స్త్రీకి సహజంగా శరీరంలో ఉత్పత్తి అయ్యే పాలు బిడ్డల ఆరోగ్య భవిష్యత్తుకు వరం. *నిశ్శబ్ద.
చిన్నపిల్లలకు ఏ వయసులో ఏ ఆహారం పెట్టాలో తెలుసా! ఆహారం అందరికీ అవసరమే. మొక్కలు కూడా వాటి ఆహారాన్ని నేలలో ఉన్న ఖనిజాల రూపంలో తీసుకుంటాయి. ఇక జంతువులు, మనుషుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏముంది? అయితే పెద్దలు తీసుకునే ఆహారానికి పిల్లలు తీసుకునే ఆహారానికి చాలా తేడా ఉంటుంది. పిల్లలు పుట్టినప్పుడు తల్లిపాలు లేదా వైద్యులు సూచించిన పాలే ఆహారం. దాదాపు 6నెలల వరకు పిల్లలకు పాలే ఇవ్వాలి. ఆ తరువాత నుండి పిల్లలకు క్రమంగా ఇతర ఆహారాలు అలవాటు చేస్తుంటారు. అయితే కొంతమంది తల్లులకు తమ పిల్లలకు ఏ వయసులో ఏ ఆహారం ఇవ్వాలో సరిగ్గా తెలియదు. అలాంటి వారికి అవగాహన కల్పించడం కోసం పిల్లల వయసును బట్టి ఇవ్వాల్సిన ఆహారం గురించి చిన్న పిల్లల వైద్యులు, పోషకాహార నిపుణులు చెప్పిన విషయాలు వివరంగా తెలుసుకుంటే.. పిల్లలు పెరిగే కొద్దీ ఆహార క్రమం మారుతుంది. ద్రవాల నుండి మెల్లిగా వారు నమిలి తినే ఘనాహారాల వైపుగా వారి ఆహారపు అలవాట్లు మారుతాయి. ఐదు సంవత్సరాలు దాటిన పిల్లల ఆహారంలో పిండి పదార్థాలు, పండ్లు, కూరగాయలు, ప్రోటీన్స్, పాలు, పాల ఉత్పత్తులు మొదలైనవి తప్పనిసరిగా ఉండాలి. అలాగే పిల్లలలో జ్ఞాపకశక్తిని ప్రోత్సహించడానికి బ్రెయిన్ ఫుడ్, పిల్లలకు కావసిన ఆరోగ్యకరమైన కొవ్వులను భర్తీ చేసే ఆహారం, కాల్షియం లోపం ఉండకుండా, విటమిన్లు, ఖనిజాలు అందేలా ఆహారం ఇవ్వాలి. గుడ్లు ఇవ్వాలి.. ఏడాది దాటిన తరువాత పిల్లలకు గుడ్లు ఇవ్వాలి. గుడ్లలో విటమిన్-డి, విటమిన్-బి12, కాల్షియం, ఐరన్, ఒమెగా-3 యాసిడ్లు ఉంటాయి. ఇవి పిల్లలకు శారీరక బలాన్ని ఇవ్వడంతో పాటు మెదడు ఎదుగుదలకు కూడా సహాయపడుతాయి. చిలగడ దుంపలు.. ఆరు నెలలు దాటిన తరువాత చిన్నపిల్లల ఆహారంలో చిలగడ దుంపలు చేర్చవచ్చు. చిలగడ దుంపలో విటమిన్-ఎ, పొటాషియం, ఫైబర్ ఉంటాయి. బీటా కెరోటిన్ తయారీకి పొటాషియం చాలా అవసరం. చిలగడ దుంపను మెత్తగా ఉడికించి పెట్టడం మంచిది. పాలు.. తల్లిపాల తరువాత పిల్లలకు సాధారణ పాలు కూడా ఇస్తుంటారు. అయితే ఏడాది వయసు లోపు పిల్లలకు ఆవు పాలు ఇవ్వడం నిషేదం. ఆవు పాలు తొందరగా జీర్ణం కావు. ఈ కారణంగా ఆవు పాలు ఇవ్వకూడదు. ఇక ఫార్ములా పాలు లేదా గేదె పాలు ఇవ్వవచ్చు. 2 సంవత్సరాల లోపు పిల్లలకు రోజుకు 200 మి.లీ కంటే ఎక్కువ పాలు ఇవ్వకూడదు. పాలుకూడా విటమిన్-సి, విటమిన్-డి, కాల్షియం వంటివి అందిస్తాయి. కాబట్టి పిల్లలకు పాలు మంచి ఆహారం. *నిశ్శబ్ద.
ఏడాదిలోపు పిల్లలకు ఈ ఆహారాలు ఇవ్వకూడదు..!! 12 నెలల లోపు శిశువు కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. ఈ విషయంలో తల్లిదండ్రులు మరింత శ్రద్ధ వహించాలి. ఇది పిల్లల ఎదుగుదల లేదా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. బాల్యంలో పిల్లలు ఈ 5 ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది. వాటిలో ఎక్కువ కేలరీలు ఉండవచ్చు. అయితే ఆ ఆహారాలు ఏమిటో ఇక్కడ తెలుసుకోండి. చక్కెర: 24 నెలల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు చక్కెర జోడించిన ఆహారాన్ని నివారించాలని శిశువైద్యులు సిఫార్సు చేస్తున్నారు. పిల్లలు చక్కెర రుచిని ఇష్టపడతారు. అదనంగా, ఇది అదనపు కేలరీలను జోడిస్తుంది. ఇది కాలక్రమేణా దంత క్షయానికి దారితీస్తుంది. చాలా మంది తల్లులు తమ బిడ్డ పాలలో శుద్ధి చేసిన చక్కెరను కలుపుతారు. అలాగే పిల్లలు పంచదారతో చేసిన ఆహారాన్ని తినడానికి ఇష్టపడతారు. తేనె: ఆయుర్వేదంలో తనదైన స్థానాన్ని పొందిన తేనె అద్భుతమైన తీపి పదార్థం మాత్రమే కాదు అద్భుత ఔషధం కూడా. ఇందులో ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. అందుకే చక్కెరకు తేనె ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా పరిగణిస్తారు. అయితే, శిశువులు అంటే 12 నెలల లోపు పిల్లలు తేనె తినకూడదు. తేనె యొక్క అధిక వినియోగం శుద్ధి చేసిన చక్కెరతో సమానమైన ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తుంది. అందువల్ల, 12 నెలల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు తల్లిదండ్రులు తేనె ఇవ్వకూడదు. ఉప్పు: 7 నుంచి 12 నెలల మధ్య పిల్లలకు రోజుకు 0.37 గ్రాముల సోడియం అవసరం. మీరు మీ బిడ్డకు ఎక్కువ ఉప్పు ఇవ్వకూడదు.అవసరమైన దానికంటే ఎక్కువ ఉప్పు ఇచ్చినప్పుడు పిల్లవాడు సోడియంకు గురవుతాడు. ఇది వారి అపరిపక్వ మూత్రపిండాలపై అనవసరమైన ఒత్తిడిని కలిగిస్తుంది. కాబట్టి ఉప్పు, చక్కెరను మితంగా ఉపయోగించడం చాలా ముఖ్యం. ఆవు పాలు: తల్లులు తమ బిడ్డలకు తమ తల్లి పాలకు బదులుగా ఆవు పాలను ఇస్తారు . దీనికి కొన్ని కారణాలు ఉండవచ్చు.ఆవు పాలు అనేక పోషకాలను అందిస్తుంది. కానీ 12 నెలల లోపు పిల్లలకు ఇది పనికిరాదని చెబుతున్నారు. శిశువు యొక్క ఆరోగ్యకరమైన ఎదుగుదలకు, అభివృద్ధికి అవసరమైన విటమిన్ E, ఐరన్, జింక్ వంటి ముఖ్యమైన పోషకాలను ఆవు పాలలో ఉండవు. పిల్లలకి అలెర్జీలు ఉండవచ్చు. ఆవు పాలలో భారీ ప్రోటీన్లు, మినరల్స్ ఉంటాయి. ఇది శిశువు యొక్క ఇంకా అభివృద్ధి చెందుతున్న మూత్రపిండాలపై అనవసరమైన ఒత్తిడిని కలిగిస్తుంది. పండ్ల రసాలు: 12 నెలల లోపు పిల్లలకు పండ్ల రసాలు ఇవ్వకూడదని మీకు తెలుసా ? అవును, పండ్ల రసాలు ఒక సంవత్సరం కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఎటువంటి పోషక విలువలను అందించవు. ఎటువంటి పోషకాహార ప్రయోజనం లేకుండా పిల్లల ఆహారంలో చక్కెర ఉంటుంది. ఇది పిల్లల దంతాల అభివృద్ధిని ప్రభావితం చేస్తుంది. బదులుగా, తాజా పండ్లను కట్ చేసి తినిపించండి.
పిల్లలు ఎత్తు పెరగాలన్నా.. దృఢంగా ఉన్నాలన్నా ఈ ఆసనాలు వేస్తే చాలు! వేసవి సెలవులు ప్రారంభమయ్యాక పిల్లలను కంట్రోల్ చెయ్యడం పెద్దలకు కాస్త కష్టమే. మండిపోతున్న ఎండల్లో పిల్లలను బయటకు పంపాలంటే భయం. అలాగై వాళ్ళు ఇంట్లో ఉండాలంటే చాలా చిరాకు పడతారు. ఈ కారణంగా పిల్లలకు టీవీ, మొబైల్, వీడియో గేమ్ వంటివి చేతిలో పెట్టి వారిని కంట్రోల్ చేస్తుంటారు. దీనికి తోడు ఫుడ్ విషయంలో కూడా బోలెడు రకాలు చేయించుకుని తింటూ, ఆయిల్ ఫుడ్ ఆస్వాదిస్తూ ఉంటారు. ఏ కారణాల వల్ల పిల్లల్లో బద్దకం, బరువు పెరగడం, చురుకుదనం తగ్గిపోవడం వంటివి జరుగుతాయి. ఇలాంటి పిల్లల్ని తిరిగి స్కూల్స్ ఓపెన్ చేసే సమయానికి ఆక్టివ్ గా చేయడానికి కొన్ని యోగాసనాలు రోజూ ప్రాక్టీస్ చేయించడం మంచిది. దీనివల్ల పిల్లల శరీరం దృఢంగా మరడమే కాదు, చాలా చురుగ్గా ఆలోచనా తీరులో మరింత ముందుంటారు. ఆ ఆసనాలు ఏమిటంటే. తాడాసనం.. పిల్లల ఏకాగ్రతను పెంచడానికి, వారు క్రమం తప్పకుండా తాడాసనం సాధన చేయాలి. తాడాసన సాధనతో పిల్లల శ్వాస సామర్థ్యం పెరుగుతుంది. ఈ ఆసనం చేయడం వల్ల శక్తి స్థాయి పెరుగుతుంది. మానసిక స్థితి బాగానే ఉంటుంది. పిల్లలు ఎత్తు కూడా పెరుగుతారు. వృక్షాసనం.. వేసవి సెలవుల్లో పిల్లలు ఇంటి నుంచి బయటకు రాలేనప్పుడు రోజంతా ఇంట్లోనే కంప్యూటర్, మొబైల్, టీవీ చూస్తూ గడిపేస్తే బాడీ పెయిన్ పోగొట్టుకోవడానికి వృక్షాసనం మంచి ఎంపిక. రోజంతా ఒకే భంగిమలో కూర్చోవడం, పడుకోవడం వల్ల వారి శరీరం నొప్పులు మొదలవుతాయి. ఇది కాకుండా, ఒత్తిడి కూడా పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో, పిల్లలలో వృక్షాసనాన్ని అభ్యసించే అలవాటును పెంచాలి. వృక్షాసన అభ్యాసం మనస్సుకు ప్రశాంతతను ఇస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది. వెన్ను, మెడ నొప్పి నుండి ఉపశమనం ఇస్తుంది. ధనురాసనం.. పిల్లల శరీరం దృఢంగా మారడానికి, కండరాల బలం కోసం ధనురాసనాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఈ ఆసనం పిల్లల వెన్ను భాగాన్ని బలపరుస్తుంది. వెన్ను, చేయి నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. శారీరక శ్రమను ఓర్చుకునే సామర్థ్యం పెరుగుతుంది. శరీరం దృఢంగా మారుతుంది. ◆నిశ్శబ్ద.
పిల్లలు పుస్తకాలు చదవట్లేదా... అయితే ఇలా చేయండి! ఏ ఇద్దరు వ్యక్తుల చేతివేలి ముద్రలు ఒకేలా ఎలా ఉండవో.. ఏ ఇద్దరు వ్యక్తుల రుచి మొగ్గలు ఓకేవిధంగా ఎలా ఉండవో.. అలాగే ఏ ఇద్దరు పిల్లల ఆలోచనలు ఒకేలా ఉండవు. పిల్లలు జీవితంలో గొప్పవాళ్లుగా మారడానికి పెద్దవాళ్ళు ఎన్నో మార్గాలు ఫాలో అవుతారు. అయితే ఒకరికి పని చేసేది మరొకరికి పని చేయకపోవచ్చు. ఇలాంటప్పుడు ఓపికపట్టాలి. ముందు మీ పిల్లలకు ఏది ఉత్తమంగా పని చేస్తుందో కనుగొనే వరకు విభిన్న విధానాలను ప్రయత్నిస్తూ ఉండాలి. పుస్తకాలు చదవడం చాలా ఆరోగ్యకరమైన అలవాటు. ఇది పిల్లల్లో విభిన్న కోణాలను బయటకు తెస్తుంది, ఆత్మను సుసంపన్నం చేస్తుంది జ్ఞానాన్ని నింపుతుంది. చిన్నప్పటి నుంచే పిల్లల్లో పుస్తకపఠనం అలవాటు చెయ్యాలి అందుకోసం కొన్ని చిట్కాలు ఇవిగో.. వయస్సుకి తగిన పుస్తకాలతో ప్రారంభించండి: మీ పిల్లల వయస్సు మరియు పఠన స్థాయికి తగిన పుస్తకాలను ఎంచుకోండి. మీరు చిన్న పిల్లల కోసం బొమ్మల పుస్తకాలతో ప్రారంభించవచ్చు వారు పెద్దయ్యాక చాప్టర్స్ ఉన్న పుస్తకాలకు వెళ్లవచ్చు. వారి దృష్టిని ఆకర్షించే ప్రకాశవంతమైన, రంగురంగుల దృష్టాంతాలతో పుస్తకాలను ఎంచుకోండి. పఠనాన్ని రొటీన్‌గా చేసుకోండి: నిద్రవేళకు ముందు లేదా రాత్రి భోజనం తర్వాత పుస్తక పఠనం కోసం ప్రతిరోజూ ఒక నిర్దిష్ట సమయాన్ని కేటాయించండి. ఇది వారి దినచర్యలో పఠనాన్ని ఒక క్రమమైన భాగంగా చేయడానికి వారిలో పఠనాభిమానాన్ని కలిగించడంలో సహాయపడుతుంది. ఆసక్తి కలిగించే విషయాలపై పుస్తకాలను ఎంచుకోండి: పిల్లలు ఆసక్తిని కలిగించే అంశంగా ఉన్నప్పుడు చదవడానికి ఇష్టపడతారు. మీ పిల్లలు డైనోసార్‌లను ఇష్టపడితే, వాటి గురించిన పుస్తకాలను కనుగొనండి. వారు క్రీడలను ఇష్టపడితే, వారికి ఇష్టమైన క్రీడ లేదా అథ్లెట్ గురించి పుస్తకాలను వెతికి తెచ్చివ్వండి. ఇలాగే వారికి ఏది ఇష్టమైతే ఆ మార్గంలోనే పుస్తకపఠనం అలవాటు చెయ్యాలి. కలిసి చదవండి: నన్ను చదవమని చెబుతూ నువ్వు మొబైల్ చూసుకుంటావా?? టీవీ చూస్తావా?? ఇలా పిల్లలు ముక్కుసూటిగా ప్రశ్నలు వేస్తారు. వాటికి సమాధానం చెప్పలేక వారిని పెద్దరికం అనే ట్యాగ్ తో మందలిస్తారు పెద్దలు. కాబట్టి కుటుంబంలో ఎవరో ఒకరు పిల్లలతో కలిసి చదవడానికి సమయాన్ని వెచ్చించండి. కథను బిగ్గరగా చదవడం, కథ గురించి చర్చించడం వంటివి చేయండి. ఇది వారి పఠన నైపుణ్యాలను పెంపొందించడంలో సహాయపడటమే కాకుండా మీకు మరియు మీ పిల్లల మధ్య బంధాన్ని ఏర్పరుస్తుంది. బహుమతులు ఇవ్వండి: పిల్లలు చదువుతున్నప్పుడు వారిని ప్రోత్సహిస్తే మరింత ఉత్సాహం తెచ్చుకుంటారు. వారు చదివే పుస్తకంలో ఒక చాప్టర్ పూర్తి చేసినప్పుడు, దానిగురించి మీతో సమర్థవంతంగా చర్చించినప్పుడు, పుస్తకాన్ని విజవంతంగా పూర్తి చేసినప్పుడు వారికి బహుమతులు ఇవ్వడం. వారికి ఇష్టమైన ప్రదేశాలకు వారిని తీసుకెళ్లడం. మరొక అద్భుతమైన పుస్తకాన్ని వారికి ఇవ్వడం చేస్తే.. వారు ఎంతో సంతోషిస్తారు. ◆నిశ్శబ్ద.
బొజ్జలో బుజ్జాయికి బోలెడు కబుర్లు చెప్పండి! ప్రహ్లాదుడు అమ్మ కడుపులో ఉన్నప్పుడే నారదుడు చెప్పినవన్నీ విన్నాడంటే, అభిమన్యుడు పద్మవ్యూహం మెళకువలు అమ్మ కడుపులో ఉన్నప్పుడే విని నేర్చుకున్నాడంటే అవి పురాణ కథలు అనుకుంటాం. కానీ, బొజ్జలో పాపాయి కదలికల్ని కంప్యూటర్ స్క్రీన్ మీద చూస్తుంటే, మన అనుభూతులకి, మాటలకి పాపాయి స్పందనని చూస్తుంటే అవన్నీ నిజమని నమ్మక తప్పదు. బుజ్జి పాపాయి పుట్టాక మాత్రమే భయం, ఆనందం వంటివి తెలుస్తాయని అనుకుంటాం కదా మనం. కానీ, అమ్మ బొజ్జలో ఉన్న పాపాయి పెద్ద పెద్ద శబ్దాలు వినిపిస్తే ఉలిక్కిపడుతుందట. భయంతో అటూ ఇటూ తిరుగుతుందట. ఈమధ్యకాలంలో శిశువు గర్భంలో వున్నప్పుడు తన స్పందన తీరుని పరిశీలించే ప్రయోగాలు ఎన్నో జరుగుతున్నాయి. అమ్మ భావావేశాలు కడుపులో బిడ్డకి ఎంచక్కా అర్థమవుతాయిట. అమ్మ కోపంగా వున్నా, బాధగా వున్నా ఇట్టే తెలిసిపోతుందట. అందుకేనేమో మన పెద్దవాళ్ళు కడుపుతో వున్నవాళ్ళు ఎప్పుడూ సంతోషంగా వుండాలని చెప్తారు. సరే, కేవలం ఆ ఎమోషన్స్.ని అర్థం చేసుకోవడమే కాదు, వాటి ప్రభావం ఆ బిడ్డపై వుండటం కూడా గమనించారు శాస్త్రవేత్తలు. బిడ్డ ఎదుగుదల, తన ఎమోషన్స్ కూడా ప్రభావితమవడం గుర్తించారు. ఓ విషయం తెలుసా? కడుపుతో వున్న తల్లి ఇష్టాయిష్టాలు బిడ్డపై ఎంతో ప్రభావం చూపిస్తాయి. ఓ వ్యక్తిని ఆమె ఎక్కువగా ద్వేషించినా, కోపగించుకున్నా, భయపడినా కడుపులో వున్న బిడ్డ ఆ వ్యక్తి గొంతు గుర్తుపెట్టుకుంటాడట. పుట్టాక తిరిగి ఆ వ్యక్తి గొంతు విన్నప్పుడు గుర్తించి ఏడుస్తాడట. ఇది ప్రయోగాత్మకంగా నిపుణులు గుర్తించిన సత్యం. ఇష్టమైన మ్యూజిక్ వినడం, మంచి పుస్తకాలు చదవడం, ఇష్టమైన ప్రదేశాలలో గడపటం, ఎప్పుడూ ఆనందంగా వుండటం ఇవన్నీ కడుపుతో వున్నవారికి అందరూ సాధారణంగా చెప్పే విషయాలు. దీనివెనుక కారణం, అమ్మ సంతోషంగా వుంటే ఆరోగ్యవంతమైన బిడ్డ పుడతాడని. ఈ విషయంలో ఎందుకు? ఎలా? అన్న అనుమానాలతో కొందరు శాస్త్రవేత్తలు కొందరు గర్భిణులని తొమ్మిది నెలలపాటు గమనించినప్పుడు తల్లి ఆనందంగా వున్నప్పుడు గర్భసంచి చుట్టూ రక్త ప్రసరణ చక్కగా జరగడం గమనించారు. తల్లి ఆనందం ఆమె శరీరంలోని హార్మోన్లపై ప్రభావం చూపిస్తే అవి బిడ్డ ఎదుగుదలకి తోడ్పడే హార్మోన్లని ప్రేరేపించడం గుర్తించారు. దాంతో ఎప్పుడూ సంతోషంగా వుండే తల్లి ఆరోగ్యవంతమైన బిడ్డకి జన్మనిస్తుంది అని నిరూపించబడినట్టే. పిల్లలకి కథలంటే ఇష్టం కదా. ఓ మూడు నాలుగేళ్ళు వచ్చినప్పటి నుంచి పిల్లలకి కథలు చెబుతాం.. అవునా? కానీ, అమ్మకి మూడో నెల దాటిన దగ్గర్నుంచి బొజ్జలో పాపాయికి కమ్మని కథలు చెప్పాలట. రోజూ ఓ నిర్దిష్ట సమయం పెట్టుకుని బిడ్డతో మాట్లాడ్డం, కథలు చెప్పడం, లాలిపాటలు పాడటం చెయ్యాలిట. కొన్ని రోజులకి ఆ సమయానికల్లా బిడ్డ మన కబుర్ల కోసం ఎదురుచూస్తాడట. బిడ్డ కదలికలతో అమ్మ ఈ విషయాన్ని గుర్తించవచ్చు అంటున్నారు ఈ విషయంపై అధ్యయనం చేసినవారు. అంతేకాదు ఏ కథలు, పాటలు అయితే వీరు కడుపులో వున్న బిడ్డకి వినిపించారో, బిడ్డ పుట్టాక వాటిని విన్నప్పుడు అవేవో తనకి ముందే తెలిసినవి అన్నట్టు ఆనందంతో స్పందించడం గుర్తించారు ఆ అధ్యయనంలో. చూశారా పాపాయి పారాడే వయసు దాకా అక్కరలేదు. కడుపులో పడినప్పటి నుంచి తనతో అనుబంధానికి దారులు వేయొచ్చు అమ్మ. కడుపులో బిడ్డ ఊపిరి పోసుకున్న క్షణం నుంచి అమ్మ తనతో అనుబంధానికి ప్రయత్నించవచ్చు అని చెప్పుకున్నాం కదా! ఇక్కడో విషయం చెప్పాలి. ఆరోగ్యవంతమైన బిడ్డ కావాలన్నా, ఆ తర్వాత పెరిగి పెద్దయి మంచి వ్యక్తిత్వంతో మెలగాలన్నా అందుకు పునాది అమ్మ కడుపులో వున్నప్పుడే పడుతుంది అని గట్టిగా చెబుతున్నారు శాస్త్రవేత్తలు. మరి ఈ విషయంలో కాబోయే అమ్మలు గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టాల్సిందే. చిట్టిపొట్టి కథలు, లాలిపాటలు, కమ్మటి కబుర్లు కడుపులోని పాపాయితో పంచుకోవాల్సిందే.. ఏమంటారు? - రమ ఇరగవరపు
పొరపాటున కూడా పిల్లలను ఈ మాటలు అనకూడదు.. పిల్లల పెంపకం చాలా కష్టమైన పని. పిల్లలను బుజ్జగించడం, వారికి క్రమశిక్షణ నేర్పడం వంటి ఎన్నో సందర్బాలలో చాలా విషయాలను గుర్తుపెట్టుకోవాలి. తమ చుట్టూ ఉన్న వాతావరణం పిల్లలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపకుండా తల్లిదండ్రులు పూర్తి జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, చాలాసార్లు వారే ఇలాంటి తప్పులకు పాల్పడి పిల్లలు గాడి తప్పడానికి కారణం అవుతారు. వాస్తవానికి తల్లిదండ్రులు పిల్లలను అనే కొన్ని మాటలు వారి మానసిక ఆరోగ్యంపై లోతైన ప్రభావం చూపుతాయి. అందుకే కోపం వచ్చినా, విసుగు చెందినా.. పొరపాటున కూడా పిల్లలను కొన్ని మాటలు అనకూడదు. పొరపాటున అన్నారంటే అవి పిల్లల హృదయాలలో లోతైన గాయాలను మిగులుస్తాయి. వారు పెరిగే కొద్దీ ఆ విషయాలు కూడా వారిలో బలంగా తయారవుతూ వస్తాయి. అవే పిల్లలు గాడి తప్పేలానూ, పిల్లల దృష్టిలో పెద్దలు విలువ కోల్పోయేలానూ చేస్తాయి. ఏ తల్లిదండ్రులు తమ పిల్లలను అనకూడని విషయాలు ఇక్కడ ఉన్నాయి. వాటిని తెలుసుకంటే.. నీకేమీ తెలియదు అని అనకండి.. తల్లిదండ్రులు పిల్లలకు తాము ఏ విషయం గురించి మాట్లాడుతున్నామో తెలియదని చెప్పినప్పుడల్లా వారికేమీ తెలియడం లేదనే ఆత్మన్యూనతలో పడిపోతారు. నీకేమీ తెలీదు నువ్వు సరైన నిర్ణయం తీసుకోలేవు అని పెద్దలు అంటూ ఉంటారు. దీని వల్ల జరిగేది ఏంటంటే పిల్లలు నా అభిప్రాయం ఎవరికీ పట్టదు, అంతా వారికి నచ్చినట్టే జరగాలా అని ఒకానొక వ్యతిరేక భావన పిల్లల మనసులో నాటుకుపోతుంది. ఎప్పుడూ ఏడుస్తావెందుకు అనకూడదు.. తరచుగా ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ తరహా మాట అంటూ ఉంటారు. ఎప్పుడూ ఏడుస్తావెందుకు అని విసుక్కోవడం, కోప్పడటం చేస్తారు. పిల్లలు బాధలో ఉన్నప్పుడు, ఏదైనా కష్టం అనిపించినప్పుడు ఏడుస్తూనే తమ బాధను చెప్పుకోవడానికి ప్రయత్నిస్తారు. అలాంటి సందర్బాలలో పిల్లలను విసుక్కోవడం వల్ల వారు తమ బాధను తల్లిదండ్రులతో పంచుకునే విషయంలో వెనకడుగు వేస్తారు. పిల్లలు ఏదైనా చెప్పగలిగే వాతావరణం తల్లితండ్రులే కల్పించాలి. తోబుట్టువులతోనూ, ఇతరులతోనూ పోల్చకండిి.. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి మెదడు, ప్రతి వ్యక్తి ఆలోచనలు వేరువేరుగా ఉంటాయి. అలాంటప్పడు పిల్లలను తొబుట్టువులతోనూ, ఇరుగు పొరుగు పిల్లలతోనూ, క్లాస్ మేట్స్ తోనూ పోల్చకూడదు. ఇది పిల్లలను ఎక్కువగా బాధించే విషయం. ఈ విషయంలో పిల్లలు కుంగుబాటుకు లోనై ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతాడు. పదే పదే పెద్దరికాన్ని ప్రదర్శించవద్దు.. పెద్దలు కొన్నేళ్లు జీవించేశామని, తమకు అనుభవాలు ఉన్నాయని, మంచేదో, చెడు ఏదో తమకు బాగా తెలుసని పెద్దలు తమ అభిప్రాయాలు, ఆలోచనలు పిల్లల మీద రుద్దడం, పిల్లల విషయంలో నిర్ణయాలు తామే తీసుకోవడం మానేయాలి. పిల్లలకు ఆలోచించుకునే అవకాశం ఇవ్వాలి. అవసరమైతేనే పెద్దల సలహాలు ఇవ్వాలి. పెద్దరికాన్ని పదే పదే పిల్లల మీద చూపిస్తే పెద్దలు ఏం చేసినా కరెక్ట్ అని, పిల్లలు ఏదీ చేయకూడదు అనే ఆలోచన వారిలో నాటుకుపోతుంది. దీని కారణంగా జీవితంలో చాలా లాస్ అవుతారు. అమ్మాయిల విషయంలో ఇలా వద్దు.. ప్రపంచం అభివృద్ది చెందుతోంది కానీ నేటికీ చాలా మంది తల్లిదండ్రులు తమ అబ్బాయిలు, అమ్మాయిల మధ్య వివక్ష చూపుతున్నారు. బిడ్డ మగపిల్లాడా లేక ఆడపిల్లా అన్నది ముఖ్యం కాదు. వారి లింగాన్ని బట్టి వారి సామర్థ్యాలను అంచనా వేయకూడదు. అమ్మాయిలు ఇలా చేయకూడదు, మగపిల్లలు ఇలాగే ఉండాలి, అబ్బాయిలతో నీకు కంపేర్ ఏంటి? వాడు నువ్వూ ఒకటేనా లాంటి మాటలు అంటూ ఉంటారు. ఎప్పుడైనా అమ్మాయిలు కాస్త ఎదురు మాట్లాడినా 'అబ్బాయిలంటే గోచి పెట్టుకుని బయటకు వెళ్లగలరు, నువ్వు అలా వెళతావా ఏంటి?' లాంటి జెండర్ డామినేషన్ మాటలు మాట్లడుతుంటారు. ఇలాంటి మాటతీరు మార్చుకోవాలి. ముఖ్యంగా ఆడపిల్లలను తల్లులు అర్థం చేసుకోవాలి. ఆహారం.. అధిక బరువు.. సహజంగానే పిల్లలకు జంక్ ఫుడ్ అంటే బాగా ఇష్టం. తల్లిదండ్రులుగాబిడ్డకు ఆరోగ్యం, ఫిట్నెస్ గురించి ఆలోచించాల్సిందే. కానీ ఎలా పిల్లలు జంక్ ఫుడ్ తిన్నప్పుడు జంక్ ఫుడ్ తినవద్దు లావైపోతావ్ అని, బరువు పెరుగుతున్నావు చూడు అని నేరుగా పిల్లల ముందు అనడం పూర్తీగా తప్పు. జంక్ ఫుడ్ గూర్చి, బరువు గూర్చి మాట్లాడటానికి బదులు, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినమని వారికి చెప్పడం మంచిది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంకరేజ్ చేయాలి. ఇవన్నీ చాలా సింపుల్ గా అనిపిస్తాయి కానీ పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తాయి. *నిశ్శబ్ద
పిల్లల కోసం ఇలాంటి ఫోటోషూట్ సూపర్! ఫొటో షూట్...ఫొటో షూట్...పసి పిల్లల మీద కెమెరా ఫోకస్ పడకూడదని కొందరు అంటుంటారు. అలాంటిదేం లేదంటూ కొందరు పుట్టిన కొన్ని గంటల్లోనే చంటి పిల్లల ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టేస్తుంటారు. జీవితంలో కొన్ని మధురక్షణాలను కెమెరాల్లో బంధించి...ఆ మధుర జ్ఞాపకాల్ని గుర్తు చేసుకోవడం గొప్ప అనుభూతిని ఇస్తుంది. అలాగే ప్రెగ్నెన్సీ సమయంలోనూ, బిడ్డ పుట్టిన తర్వాత ఫొటోషూట్‌లు చేయడం కూడా ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్‌గా మారింది. మీరు మీ పిల్లల చిన్ననాటి జ్ఞాపకార్థం ఫోటోను సేవ్ చేయాలనుకుంటున్నారా?.ఇంట్లో స్మార్ట్‌ఫోన్‌ని ఉపయోగించి సాధారణ ఫోటోషూట్ చేయండి. అవుట్‌డోర్ ఫోటోషూట్: మీరు రిసార్ట్ లేదా ఏదైనా పార్కుకు వెళ్లినప్పుడు మీరు ఫోటోను సులభంగా క్లిక్ చేయవచ్చు. స్టైలిష్ హెయిర్ స్టైల్, కలర్ ఫుల్ డ్రెస్, అందమైన బూట్లు ధరించండి. మీ బాబును కానీ పాపను కానీ సురక్షితమైన ప్రదేశంలో కూర్చోబెట్టి ఫొటోను క్లిక్ చేయండి. ఫాంటసీ ఫోటోషూట్: నెలల బిడ్డ అయితే, పిల్లల పక్కన సంగీత వస్తువులు లేదా ఇతర అలంకరణ వస్తువులను ఉంచవచ్చు. ఫాంటసీ ఫోటోను క్లిక్ చేయండి. ఇది ఇటీవల బాగా ప్రాచుర్యం పొందింది.ఈ ఫొటో చాలా ఫన్నీగా ఉంటుంది. థీమ్ ఫోటోషూట్: ఇప్పటికే చెప్పినట్లుగా.. కూర్చోలేని పిల్లల ఫోటోషూట్‌ను కూడా క్లిక్ చేయవచ్చు. ఒక థీమ్‌ను సృష్టించండి. తదనుగుణంగా దుస్తులు ధరించండి. వివిధ ఫోటోలను క్లిక్ చేయండి. బొమ్మ ఫోటో షూట్: బహుశా ఈ ఫోటోలు పిల్లలు, తల్లిదండ్రులు ఇద్దరూ ఇష్టపడతారు. తనకిష్టమైన బొమ్మలతో ఆడుకుంటూ, నవ్వుతూ, అమాయకంగా కనిపిస్తూ ఫోటో క్లిక్ చేయడం ఎవరికి ఇష్టం ఉండదు? అందమైన బట్టలు ధరించండి. పిల్లవాడు ముందు ఇష్టపడే బొమ్మలు ఉంచండి. వారి ఆనందాన్ని క్లిక్ చేస్తూ ఉండండి. శ్రీ కృష్ణుడి ఫోటో షూట్: భారతీయులమైన మనకు ఆల్ టైమ్ ఫేవరెట్ ఫోటోషూట్‌లలో శ్రీకృష్ణుడు ఒకటి. మగబిడ్డ అయినా, ఆడపిల్ల అయినా తల్లిదండ్రులు తమ బిడ్డలో శ్రీకృష్ణుడు, రాధల అందాలను చూడాలని కోరుకుంటారు. అందుకే శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు పిల్లలందరూ శ్రీకృష్ణుడిగా వెలిగిపోతారు. ఆడపిల్ల ఫోటో షూట్: మీ ఆడబిడ్డ ఫోటోషూట్‌ను ఇలా సులభంగా తీసుకోండి. రంగురంగుల ఫ్రాక్ ధరించి పైనుండి క్లిక్ చేసిన ఈ ఫోటో నిజంగా అందంగా ఉంది. ఫీల్డ్‌లో ఫోటోషూట్: పల్లెటూరి అందం వర్ణించలేనిది. అక్కడి నిర్మలమైన వాతావరణం, పచ్చని చెట్ల అందాలు నిజంగానే అబ్బురపరుస్తాయి. ఫీల్డ్ దగ్గర మీ చిన్నారితో ఈ ఫోటోను క్లిక్ చేయండి.
ఏడాదిలోపు పిల్లలకు పొరపాటున కూడా ఈ పండు ఇవ్వకండి.. ఎందుకంటే! పండ్లు పిల్లలకు, పెద్దలకు కూడా చక్కని ఆరోగ్యం చేకూరుస్తాయి. రోజువారి ఆహారంలో పండ్ల ప్రాముఖ్యత గురించి ఎంత చెప్పినా తక్కువే. పిల్లలకి చిన్నప్పటి నుండి ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇస్తుంటే పిల్లలు పెరిగేకొద్ది బాగుంటారు. అయితే ఆరోగ్యం అనే అపోహలో కొందరు పిల్లలకు ఇవ్వకూడని ఆహారం ఇస్తుంటారు. పండ్లన్నీ ఆరోగ్యకరమైనవని, వాటివల్ల నష్టం ఉండదని అనుకునే అమాయకులు ఉన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరూ పిల్లలకు ఇవ్వకూడని ఆహారాల గురించి తెలుసుకోవాలి. ఇంగ్లీష్ లో గ్రేప్ ఫ్రూట్ అని, తెలుగులో పంపరపనస అని అంటారు. బత్తాయిపండులాగా పెద్దగానూ, పనసపండులా లోపన తొనల్లానూ ఉండే ఈ పండు తెలుపు, పింక్ రంగులలో ఉంటుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. కానీ ఈ పిల్లలకు ఇవ్వడంలో చాలా జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. అసలు పిల్లలకు ఈ పండును ఎప్పుడు, ఎంత ఇవ్వాలనే విషయాన్ని తెలుసుకుంటే.. పంపరపనస ఒక నిమ్మజాతికి చెందిన పండు. సాధారణంగా సిట్రస్ పండ్లను 12 నెలల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు తినిపించవద్దని సలహా ఇస్తారు. ఎందుకంటే అవి ఆమ్లంగా ఉంటాయి. పిల్లల చర్మం సున్నితంగా ఉంటుంది కాబట్టి వారి చర్మం పై దద్దుర్లు కలిగిస్తాయి. అయితే, 6 నెలల తర్వాత శిశువైద్యుని సలహా మేరకు పిల్లల ఆహారంలో పంపరపనసను చేర్చవచ్చు. పిల్లల వైద్యుల ప్రకారం పిల్లలు కాల్షియం తీసుకోవడానికి ఇబ్బంది పెడతారు. దీనికారణంగా పిల్లలకు కాల్షియం కోసం సిసాప్రైడ్, సైక్లోస్పోరిన్ వంటి కొన్ని మందులు ఇస్తుంటారు. ఈ మందులు పిల్లలకు వాడుతుంటే మాత్రం పంపరపనస పండు ఇవ్వకూడదు. దీన్ని తినడం వల్ల ఔషధం శరీరంలో ఇమిడిపోవడం, జీర్ణక్రియ, దానివల్ల కలగాల్సిన ఫలితాలు ప్రభావితం అవుతాయి.పిల్లలకు ఏ మందు వాడుతున్నా ఈ పండు ఇచ్చేముందు శిశువైద్యుల సలహా తీసుకోవాలి. పంపరపనస గుజ్జులో విటమిన్లు ఎ, సి, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. అదనంగా ఇది లైకోపీన్, నరింగిన్ వంటి అనేక ఫైటోకెమికల్స్‌ను కూడా కలిగి ఉంటుంది. తగినంత పోషకాహారం కోసం పిల్లల సమతుల్య ఆహారంలో ఈ పండును కొద్దిమొత్తంలో వైద్యుల సలహాతో చేర్చవచ్చు. ఇందులో అధిక మొత్తంలో నీరు, పొటాషియం వంటి ఎలక్ట్రోలైట్లు ఉంటాయి, ఇవి చిన్నపిల్లలను డీహైడ్రేషన్ నుండి రక్షించడంలో సహాయపడతాయి. ఈ పండులో గణనీయమైన మొత్తంలో నీరు, డైటరీ ఫైబర్ ఉంటుంది, ఇది పిల్లల ప్రేగులను చురుకుగా ఉంచడానికి, జీర్ణక్రియకు సహాయపడుతుంది. అంతేకాదు ఇందులో ఫాలిఫినాల్స్, ఫ్లేవనోన్స్ వంటి బయోయాక్టివ్ సమ్మేళనాలను కూడా ఉంటాయి. ఇవి గట్ మైక్రోబయోటాను ప్రోత్సహించడంలో సహాయపడతాయి. కానీ శిశువైద్యుల ప్రకారం ఒక సంవత్సరం కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు పండ్ల రసం కూడా ఇవ్వడం మంచిది కాదు. పంపరపనస పండు రసంతో ఇతర పండ్ల రసాలు ఇవ్వకూడదు. రసం కంటే పండ్లు ఎక్కువ పోషకాహారాన్ని అందిస్తాయి. అంతే కాకుండా జ్యూస్ లో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల పళ్లలో క్యావిటీ వచ్చే అవకాశం కూడా ఉంది. కార్బోహైడ్రేట్లు ఎక్కువ మొత్తంలో ఇస్తే విరేచనాలు కావచ్చు. కాబట్టి ఒక సంవత్సరం లోపు పిల్లలకు పండ్ల రసాన్ని, పంపరపనసను అస్సలు ఇవ్వకూడదు. *నిశ్శబ్ద.
పిల్లల్లో సెరిబ్రల్ పాల్సీ అంటే ఏంటి? మస్తిష్క పక్షవాతాన్ని సెరిబ్రల్ పాల్సీ అని అంటారు. మస్తిష్క పక్షవాతం పిల్లలలో నయం చేయలేని వ్యాధి. దీనిలో పిల్లల ఎదుగుదల ఆగిపోతుంది. పిల్లలలో శారీరక సమస్యలు ఉండవచ్చు. సెరిబ్రల్ పాల్సీ పిల్లలలో బ్యాలెన్స్ లేకపోవడం, వారు ఉండే భంగిమలో మార్పు.. నడవగల సామర్థ్యాన్ని ప్రభావితం చేయడం.. ఇవన్నీ మస్కిష్క పక్షవాతంలో సంభవిస్తాయి. మస్తిష్క పక్షవాతం పిల్లలలో అత్యంత సాధారణంగా వచ్చే మోటారు వ్యాధి. సెరిబ్రల్ అంటే మెదడుకు సంబంధించినది. పక్షవాతం అంటే కండరాలను ఉపయోగించడంలో ఇబ్బంది లేదా బలహీనత. మస్తిష్క పక్షవాతం మెదడు అసాధారణంగా అభివృద్ధి చెందడం వల్ల లేదా మెదడు అభివృద్ధిలో అవరోధం కారణంగా సంభవిస్తుంది. దీని కారణంగా పిల్లలు తమ కండరాలను నియంత్రించుకోలేరు. సెరిబ్రల్ పాల్సీ లక్షణాలు.. సెరిబ్రల్ పాల్సీ లక్షణాలు పిల్లలలో భిన్నంగా ఉంటాయి. తీవ్రమైన మస్తిష్క పక్షవాతం ఉన్న పిల్లలకు నడవడానికి ప్రత్యేక పరికరాల సహాయం అవసరం కావచ్చు లేదా అస్సలు నడవలేకపోవచ్చు. జీవితకాల సంరక్షణ అవసరం కావచ్చు. మరోవైపు తేలికపాటి సెరిబ్రల్ పాల్సీతో బాధపడుతున్న పిల్లలు కొంచెం ఇబ్బందికరంగా నడుస్తారు. వారికి ప్రత్యేక సహాయం అవసరం అవుతుంది. మస్తిష్క పక్షవాతం లక్షణాలు కాలక్రమేణా అధ్వాన్నంగా మారకపోయినప్పటికీ పిల్లల జీవితంలో లక్షణాలలో మార్పులు జరగవచ్చు. మస్తిష్క పక్షవాతంతో బాధపడుతున్న వారందరికీ నడకలోనూ, వారు కూర్చునే నిలుచునే భంగిమలోనూ సమస్యలు ఉంటాయి. చాలా మంది పిల్లలు బుద్దిమాంద్యంతో కూడా బాధపడవచ్చు. మూర్ఛలు, దృష్టి, మాట్లాడటం, వినికిడి సమస్యలు వంటివి ఉంటాయి. వెన్నెముకలో మార్పులు (పార్శ్వగూని వంటివి) మరిన్ని శారీరక సమస్యలు ఉంటాయి. సెరెబ్రల్ పాల్సీ రకాలు.. కండరాల దృఢత్వం (స్పాస్టిసిటీ) అనియంత్రిత కదలికలు (డిస్కినియా) సంతులనం, సమన్వయం కోల్పోవడం (అటాక్సియా) పై లక్షణాలు అన్నీ కలిపి అయినా ఉండొచ్చు. సెరిబ్రల్ పాల్సీ ప్రారంభ లక్షణాలు.. పిల్లలు విశ్రాంతి స్థితి నుండి పైకి లేచినప్పుడల్లా, తల కదలికలు ఆలస్యం అవుతాయి. శరీరం బిగుసుకుపోతుంది. పిల్లలు కుంటుతూ నడుస్తారు. ఇలాంటి పిల్లవాడిని చేతుల్లో పట్టుకున్నప్పడు, పట్టుకున్నవారిని నెట్టినట్లుగా తన వెనుక భాగాన్ని, మెడను సాగదీస్తారు. కాళ్ళు ఎత్తినప్పుడు గట్టిపడతాయి, తరచుగా కాళ్ళు కత్తెర ఆకారంలో తిరుగుతాయి. ఇలాంటి పిల్లలకు నడవడం చాలా కష్టం. ఇక చేతులు కూడా కలిపి ఉంచుకోలేరు. చేతులతో నోట్లో ఏదీ పెట్టుకోలేరు. ఒక చేతిని చాచి, మరొకటి గట్టిగా ఉంచుతారు. ఒకే దిశలో తిరగడం వారికి సవాలుగా ఉంటుంది. మస్తిష్క పక్షవాతం చికిత్స.. సెరిబ్రల్ పాల్సీకి ఎటువంటి నివారణ లేదు కానీ తగిన జాగ్రత్తలతో రోగుల జీవితాలను మెరుగుపరచవచ్చు. సమస్య ఉన్నట్టు తేలిన తరువాత వీలైనంత త్వరగా చికిత్స ప్రారంభించడం ముఖ్యం. మస్తిష్క పక్షవాతం నిర్ధారణ అయిన తర్వాత, వైద్యుల బృందం పిల్లలతో మరియు వారి కుటుంబంతో కలిసి పని చేస్తుంది. పిల్లవాడు తన పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడానికి ప్రణాళికను రూపొందిస్తారు. సాధారణంగా మందులు, శస్త్రచికిత్స, శారీరక, వృత్తి, ప్రసంగ చికిత్స మొదలైనవి చికిత్సలో ఉపయోగిస్తారు. సెరిబ్రల్ పాల్సీకి కారణాలు తక్కువ బరువుతో పుట్టిన బిడ్డ పుట్టడం. ప్రసవ సమయానికి ముందే బిడ్డ పుట్టడం. గర్భధారణ సమయంలో ఇన్ఫెక్షన్లు, కామెర్లు, కెర్నిక్టెరస్ జన్యు లోపం. మొదలైనవి కారణాలు. *నిశ్శబ్ద.
చలికాలంలో చిన్నపిల్లల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి! చిన్నపిల్లలు చాలా సున్నితంగా ఉంటారు. వారిఆరోగ్యం విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాతావరణ మార్పులకు వారి ఆరోగ్యం చాలా తొందరగా ప్రభావితం అవుతుంది. మరీ ముఖ్యంగా ఇప్పుడు చలికాలం కొనసాగుతున్న కారణంగా పిల్లల విషయంలో తల్లిదండ్రులు తీసుకోవలసిన జాగ్రత్తలు మరింత ఎక్కువగా ఉండాలి. చిన్న పిల్లలున్న ప్రతి ఇంట్లో కొన్ని జాగ్రత్తలుతప్పనిసరిగా తీసుకోవాలని చిన్న పిల్లల వైద్యులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుంటే.. చల్లని వాతావరణం కొనసాగుతున్న కారణంగా చిన్న పిల్లల శరీర ఉష్ణోగ్రతను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తుండాలి. దీనివల్ల పిల్లలలో సీజనల్ సమస్యలు ఎప్పటికప్పుడు చెక్ చేసినట్టు అవుతుంది. పిల్లలు ఎక్కువగా నిద్రపోతుంటారు కాబట్టి అప్పుడప్పుడు వారిని తాకి ఉష్ణోగ్రత చెక్ చేసుకోవాలి. చలికాలంలో పిల్లల శరీర ఉష్ణోగ్రతలు చాలా తొందరగా పెరగడం, అంతే తొందరగా పడిపోవడం జరుగుతుంది. చలిని భరించే క్రమంలో పిల్లలలో వేడి ఎక్కువగా, వేగంగా ఉత్పత్తి కావడం వల్ల పిల్లలో అల్పోష్ణస్థితి ఏర్పడే ప్రమాదం ఉంటుంది. ఉష్ణోగ్రత స్థితినుండి పిల్లలను కాపాడుకోవాలి అంటే పిల్లలకు వెచ్చని దుస్తులు వేయాలి. అలగే పిల్లల పాదాలు, చేతులు, తలను కూడా వెచ్చగా ఉండేలా కవర్ చేయాలి. ఒట్టి ఒళ్లుతో పిల్లలను అస్సలు ఉంచకూడదు. పిల్లలకు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం స్నానం చేయించడం . వారిని శుభ్రంగా ఉంచడం, అందంగా తయారుచేయడం తల్లుల అలవాటు. అయితే చలి దృష్ట్యా పిల్లలకు స్నానం చేయించడం తగ్గించాలి. వీలైనంత వరకు పిల్లలను వెచ్చని నీళ్లలో ముంచిన మెత్తని టవల్ లేదా నూలు బట్టతో ఒళ్లంతా తుడవాలి. చలికాలంలో ఇలా చేస్తే సరిపోతుంది. పిల్లలకు స్నానం చేయిస్తే వారిని చల్లని వాతావరణం లేదా చలి గాలులకు శరీరం తగిలేలా ఉంచకూడదు. ఇంటి కిటికీలు. తలుపులు మూసి ఉన్న గదిలో పిల్లలను ఉంచాలి. లేకపోతే చాలా సులువుగా జలుబు, దగ్గు సమస్యలు వస్తాయి. చలికాలంలో లేత సూర్యకాంతిలో పిల్లలకు ఆవనూనెతో శరీరమంతా బాగా మసాజ్ చేయడం వల్ల పిల్లలలో రక్తప్రసరణ మెరుగవుతుంది. ఇది పిల్లలు చురుగ్గా ఉండేలానూ, రోగనిరోధక శక్తిని పెంచేలానూ చేస్తుంది. పేగా పిల్లలలో కండరాలు బలపడతాయి. బాగా నిద్రపోతారు. పిల్లల శరీరం పొరపాటున కూడా పొడిగా ఉండనివ్వకూడదు. స్నానం చేయించడం లేదా తడిబట్టతో ఒళ్లు తుడిచిన తరువాత తప్పనిసరిగా పిల్లలకు లోషన్ రాయాలి. ఇది చర్మాన్ని మృదువుగా ఆరోగ్యంగా ఉంచుతుంది. చలికి చర్మం ఎఫెక్ట్ కాకుండా చేస్తుంది. చిన్న పిల్లలు సీజనల్ వ్యాధులను ఎదుర్కోవడానికి వారికి లభించే గొప్ప ఆహారం తల్లిపాలు. ఇది పిల్లలకు గొప్ప ఔషదంగా పనిచేస్తుంది. రోగనిరోధక శక్తని పెంచుతుంది. అనారోగ్యం బారిన పడకుండా చేస్తుంది. *నిశ్శబ్ద.
మీ పిల్లలు బాగా ఒత్తిడిగా ఫీలవుతున్నారా? ఈ పనులు చేయండి! ఒత్తిడి అనేది కేవలం పెద్దవారిలో మాత్రమే కాదు.. పిల్లలలో కూడా ఉంటోంది. నేటికాలంలో పరీక్షలు, ర్యాంకులు, పెద్ద స్కూళ్లలో సీట్లు, ప్రాజెక్ట్ లు, ఇంకా చిన్న వయసులోనే పెద్ద టార్గెట్లు. ట్యూషన్లు, కోచింగ్ సెంటర్లు.. ఇలా ఒకటనేమిటి చిన్న బుర్రలకు ఉరుకులు పరుగులే సరిపోతున్నాయి. ఇవన్నీ పిల్లల మానసిక ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తాయి. పిల్లలో ఈ ఒత్తిడిని తగ్గించడానికి కొన్ని చిట్కాలు ఫాలో అవ్వాలి. పిల్లలతో ఏ విషయాన్ని అయినా ఎలాంటి సందేహం లేకుండా మాట్లాడాలి. దీని వల్ల పిల్లలకు కూడా వారి మనసులో ఉన్న విషయాలను స్పష్టంగా చెప్పడం సాధ్యమవుతుంది. పిల్లలలో భయాలు, ఆందోళనలు, మనసులో ఉన్న దిగులు ఇలా అన్నీ పిల్లలు చెప్పగలుగుతారు. కాబట్టి పిల్లలతో ఏదైనా ఓపెన్ గా మాట్లాడటం అలవాటు చేసుకోవాలి. పెద్దవాళ్లకు ఉన్నట్టుగా పిల్లలు కూడా తమ పనులు చేసుకోవడానికి టైం టేబుల్ ఏర్పాటు చేయాలి. దీన్ని పిల్లల అభిరుచికి తగ్గట్టు వాళ్లతోనే చేయించాలి. భోజనం, హోం వర్క్, ఆడుకునే సమయం, అభిరుచుల కోసం సమయం ఇలా అన్నింటికి సమయం కేటాయించాలి. ఇది పిల్లలకు పనులు సులువుగా సమయానికి పూర్తీ చేసి ఒత్తిడి తగ్గిస్తుంది. పెద్దవాళ్లకు పిల్లలకు అందరికీ ఆరోగ్యకరమైన జీవనశైల్ అవసరం అవుతుంది. పిల్లు తగినంత నిద్ర, సమతుల్య ఆహారం, శారీరక వ్యాయామం వంటివి పాటిస్తుంటే వారిలో భావోద్వేగాలు కూడా నిలకడగా ఉంటాయి. పెద్దలు చాలామంది మానసికంగా నిలకడగా లేకపోతే కోపం చేసుకోవడం, అరవడం, చికాకు ప్రదర్శించడం వంటివి చేస్తుంటారు. అయితే మరికొందరు మాత్రం ఈ మానసిక నిలకడ కోసం రిలాక్సేషన్ టెక్నిక్స్ ఫాలో అవుతారు. లోతైన శ్వాస వ్యాయామాలు, ధ్యానం, గైడెడ్ ఇమేజరీ వంటి మానసికి రిలాక్సేషన్ పద్దతులను పిల్లలతో సాధన చేయించాలి. పిల్లలకు ఆడుకోవడం ఇష్టం. పిల్లలను ఆడుకోవద్దని తిడితే వారు కోప్పడతారు. అయితే వారు ఆడుకుంటూ ఉంటే సరిగ్గా చదవరని తల్లిదండ్రుల భయం. అందుకే పిల్లల ఆటలకు సమయం కేటాయించాలి. పిల్లలలో ఆటల పట్ల ప్రతిభ కనిపించినట్లైతే ఆ ఆటలలో కూడా పిల్లలను ప్రోత్సహించాలి. ఆటలు పిల్లల మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపస్తుంది. గెలుపు ఓటమిలను సమానంగా తీసుకునే మెంటాలిటీ అలవాటు అవుతుంది. పిల్లలు మొబైల్ ఫోన్, టీవి, కంప్యూటర్ వంటివి చూడటానికి వారికి ఓ నిర్ణీత సమయాన్ని కేటాయించాలి. దీనివల్ల వారు ఫోన్ కు అడిక్ట్ అవ్వకుండా ఉంటారు. ఇది వారి కంటి ఆరోగ్యానికి కూడా మంచిది. పిల్లలు చాలావరకు పెద్దలను చూసి తాము కూడా పనులు చేస్తుంటారు. ఈ అనుకరణ వల్ల పిల్లల విషయంలో ఎలాంటి తప్పులు జరగకూడదు అంటే తల్లిదండ్రుల ప్రవర్తన సరిగా ఉండాలి. తల్లిదండ్రులు ఎప్పుడూ పిల్లలకు రోల్ మోడల్స్ లా ఉండాలి. ఏ సమస్య వచ్చినా సరే పిల్లలకు తల్లిదండ్రులు ఉన్నారనే భరోసా ఇవ్వాలి. ఇలా ఉంటే పిల్లలు ఒత్తిడి ఫీల్ కారు. ఇంట్లో కూడా పిల్లలకు అనువైన వాతావరణం ఉంచాలి. పిల్లల భవిష్యత్తు ముఖ్యం కాబట్టి వారి గురించే ఆలోచించాలి. ఏ విషయాన్ని అయినా ఓపికతో పరిష్కరించాలి. *నిశ్శబ్ద.