వేసవికాలంలో చెమట పట్టకుండా ఉండాలంటే ఇలా చెయ్యండి!
 


ప్రతి సీజన్ ప్రజలకు ఇష్టమైనవి, ఇష్టం లేనివి అంటూ కొన్ని మార్పులను వెంటబెట్టుకొస్తుంది. వేసవిలో మామిడిపండ్లు, తాటిముంజలు, ఆవకాయ వంటి రుచులే కాకుండా భగభగ మండే ఎండలు, ఈ ఎండల ధాటికి ఎదురయ్యే చెమట, చెమట వెంట చెమటకాయలు, నలుగురిలో అసౌకర్యం వంటి చికాకు పెట్టే సంఘటనలు కూడా ఉంటాయి. సాధారణంగా అబ్బాయిలను మాత్రమే వేధించే అతి చెమట సమస్య వేసవి కాలంలో అమ్మాయిలను కూడా ఇబ్బంది పెడుతుంది. ముఖ్యంగా చెమట కారణంగా అమ్మాయిల ముఖం కాంతిని కోల్పోవడమే కాదు.. మొటిమలకు, దురదలకు, చర్మం కందిపోవడానికి కారణం అవుతుంది.  అయితే కింది ఫేస్ ప్యాక్ లు వేసుకుంటే వేసవి కాలంలో చర్మం తాజాగా ఉండటమే కాదు..  చెమట పట్టకుండా కూడా ఉంటుంది.  వేసవిలో అమ్మాయిలు ట్రై చెయ్యాల్సిన ఫేస్ ప్యాక్ లు ఏంటో ఓ లుక్కేస్తే..

పెరుగు, అలోవెరా ప్యాక్..

సూర్యరశ్మికి గురికావడం వల్ల  ముఖం కాంతిని కోల్పోయి  నిర్జీవంగా ఉంటుంది. దీనికి పెరుగు, కలబంద ప్యాక్ బెస్ట్ ట్రీట్మెంట్.   ఈ ప్యాక్ ముఖాన్ని  చల్లగా తాజాగా ఉంచడంలో సహాయపడతుంది. ఒక గిన్నెలో ఒక చెంచా పెరుగు,  మూడు చెంచాల అలోవెరా జెల్ వేసి బాగా కలపాలి. ఈ  మిశ్రమాన్ని  ముఖానికి అప్లై చేసిన తర్వాత 15 నుండి 20 నిమిషాలు అలాగే వదిలేయాలి. తరువాత ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకోవాలి.


ముల్తానీ మట్టి,  పుదీనా ఫేస్ మాస్క్..


పుదీనా శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది.   ముల్తానీ మట్టి అదనపు నూనెను క్లియర్ చేస్తుంది.  ఈ మాస్క్ వేసుకుంటే ముఖ చర్మం మంటను తగ్గించుకోవచ్చు.  ఎండవేడి నుండి  ముఖాన్ని చల్లగా ఉంచుకోవచ్చు. ఒక గిన్నెలో 1 టీస్పూన్  పుదీనా పొడి లేదా పుదీనా పేస్ట్..  2 టేబుల్ స్పూన్ల ముల్తానీ మట్టిని కలపాలి. అవసరమైతే దీనికి  కొన్ని చుక్కల నీటిని జోడించవచ్చు,  ఈ పేస్ట్ ను ముఖం,  మెడకు  అప్లై చేసిన తర్వాత అది ఆరిపోయే వరకు వెయిట్ చెయ్యాలి. అనంతరం సాధారణ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

టమోటా, తేనె ఫేస్ మాస్క్..

ఒక గిన్నెలో ఒక మీడియం సైజ్ టొమాటో  గుజ్జు..  ఒక చెంచా తేనె కలపాలి.  ముఖానికి అప్లై చేసిన తర్వాత  20 నిమిషాలు అలాగే ఉంచాలి.  తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. జిడ్డుగల లేదా మోటిమలు వచ్చే చర్మానికి తేనెలోని యాంటీ బాక్టీరియల్   లక్షణాలు అద్భుతంగా పనిచేస్తాయి. మరోవైపు టొమాటోలు టానింగ్‌ను నిరోధించే లక్షణాలను కలిగి ఉంటాయి. వేసవిలో ఈ రెండింటి కలయిక మంచి ఫలితాలు ఇస్తుంది.  


రోజ్ వాటర్, చందనం ఫేస్ మాస్క్..

వేసవికాలంలో వచ్చే మొటిమలు,  ముఖ చర్మంలో  అసౌకర్యానికి గంధం  ఎప్పటినుండో అందుబాటులో ఉన్న చిట్కా. ఇది చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. రోజ్ వాటర్ చర్మాన్ని తేమగా ఉంచుతుంది.  అదనపు నూనెను, చర్మంలో ఉండే డస్ట్ ను తొలగిస్తుంది.   చర్మం  మెరుపును మెరుగుపరుస్తుంది.  2 టీస్పూన్ల స్వచ్ఛమైన గంధపు పొడిని రోజ్ వాటర్‌తో కలపాలి. ఈ పేస్ట్ ను  ముఖంపై  అప్లై చెయ్యాలి.  ఆరిన తరువాత సాధారణ నీటితో ముఖం కడుక్కోవాలి.


పుచ్చకాయ, పెరుగు ఫేస్ మాస్క్..

ముఖానికి అవసరమైన  విటమిన్ ఎ,  సి పుచ్చకాయలో లభిస్తాయి. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేసి మెరుపును ఇస్తుంది. జిడ్డుగల చర్మానికి ఇది మంచి ఎంపిక. ఒక గిన్నెలో 1 టీస్పూన్ పెరుగు,   పుచ్చకాయ గుజ్జు వేసి బాగా కలపాలి. దీన్ని ముఖానికి ప్యాక్ లాగా అప్లై చేయాలి. టాన్ ఉన్న  ప్రాంతాలలో కాస్త మందం పొర వేసుకోవాలి.  పది నుండి పదిహేను నిమిషాల తర్వాత  ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ మాస్క్‌ని ఉపయోగించిన తర్వాత సన్‌బర్న్ అయిన ప్రాంతాలు ఉపశమనం పొందుతాయి.


                                           *రూపశ్రీ.