ప్రేమతో  కథలు చెపుదామా


 

 

కథలు వినటం వల్ల పిల్లల్లో ఊహాశక్తి పెరుగుతుందంటే మీరు నమ్ముతారా? నమ్మి తీరాలి.  ఎందుకంటే అదే నిజమని తేల్చి చెప్పాయి ఎన్నో రకాల పరిశోధనలు. అనగనగా...  అని మనం కథ  చెప్పటం మొదలుపెట్టగానే నోరు వెళ్లబుచ్చుకుని వినటం మొదలుపెడతారు పిల్లలు. వాళ్ళకి నచ్చిన కథ అయితే మనం మద్యలో ఆపినా ఊరుకోరు. ఇలా వినే కథల వల్ల వాళ్ళ ఆలోచనా పరిధి పెరుగుతుందట. మనం చెప్పే కథకి అనుగుణంగా వాళ్ళు వాళ్ళ బుర్రలో దానికి తగ్గ వాతావరణాన్ని ఊహించుకుంటారట. ఇలా వినేటప్పుడు మనకి కనిపించే ఆ అమాయకపు కళ్ళ వెనక ఎన్నో అద్భుత చిత్రాలు కదులుతూ ఉండేసరికి వాళ్ళ మెదడు చురుకుగా పనిచెయ్యటం మొదలుపెడుతుంది.

మధ్యమధ్యలో వాళ్ళు అడిగే ప్రశ్నలు ఒకొక్కసారి మనకే అంతు  చిక్కనివిగా ఉంటాయి. వాటికి సమాదానం ఇచ్చే ముందు దానికి తగ్గ సొల్యూషన్ ఎలా ఉంటె బాగుంటుంది అని మీరు మరో ప్రశ్న వాళ్ళకి తిరిగి వేస్తె చాలు వాళ్ళ చిన్న బుర్రలో ఎన్నెన్ని ఆలోచనలు పరుగులు తీస్తాయో చెప్పలేం. అలాంటి ఆలోచనలే వాళ్ళ మెదడుకి ఓ హేల్తి ఫుడ్ లా పనిచేస్తాయి.

 

 

 

 ఒక కథ విని దాని గురించి ఆలోచనలో పడటం వల్ల మెదడులో నరాలు బాగా పని చేసి మైండ్ షార్ప్ అవుతుందని చెపుతున్నారు పిల్లల మానసిక నిపుణులు. ఇటీవల  జపాన్ లో జరిపిన ఒక సర్వే లో ఇంట్లో ఖాళీ సమయంలో టీవీ చూస్తూ లేదా వీడియో గేమ్స్ ఆడే పిల్లల మెదడు కన్నా,కథలు చెప్పించుకుని వినే పిల్లల మెదడు చురుకుగా పనిచేస్తోందని తేల్చి చెప్పారు.

కాల్పనిక కథలు,జానపద కథలు ఇలా ఎన్నో రకాల కథలు పిలల్ని ఎంతో ఆలోచింపచేస్తాయి. పిల్లలకి గిఫ్ట్స్ రూపంలో కథల పుస్తకాలు కొని ఇస్తూ ఉంటే వాళ్ళు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ కి అలా పుస్తకాలు కొనివ్వటం అలవాటు చేసుకుంటారు. కథల పుస్తకాలు చదవటం వల్ల గ్రహింపుశక్తి పెరగటమే కాదు కళ్ళకి కూడా ఒక ఎక్సర్సైజ్ లా   పనిచేస్తుందిట.

  

 రాత్రిళ్ళు పడుకునే ముందు పిల్లలు అడిగి చెప్పించుకునే కథల ప్రభావం వాళ్ళ  నిద్ర మీద పడుతుందిట. అందుకేనేమో అమ్మమ్మలు తాతయ్యలు దేముడి కథలు,రాజకుమారుడి కథలు చెప్పి నిద్రపుచ్చుతూ ఉంటారు. పిల్లలకు  దగ్గరగా  కూర్చుని కథలు  చెప్పటం వల్ల ఇంకో లాభం కూడా ఉందిట. పిల్లల్లో అభద్రతాభావం దూరమయి వాళ్ళల్లో మానసిక బలం పెరుగుతుందిట. అమ్మ ఒడిలో పడుకుని హాయిగా కథలు వింటుంటే భయం మన పిల్లల దరిదాపులకి రావటానికి కూడా భయపడుతుంది కదా. అందుకే ప్రేమతో కథలు చెప్పటం మొదలుపెట్టెదాం.


...కళ్యాణి