కొత్తగా కొన్న షూ సరిపోవడం లేదా.. ఈ టిప్స్ ఫాలో అయితే..


అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిల షాపింగ్ విస్తారమైనది. అమ్మాయిలకు ఏదీ ఒక పట్టాన నచ్చదు. చాలామంది అమ్మాయిలు తమకు సెట్ అవుతుందా కాదా అనే విషయాన్ని పక్కన పెట్టి డ్రస్సు అయినా, చెప్పులు అయినా, షూస్ అయినా, గాజులు అయినా కంటికి నచ్చితే చాలు కొనేస్తారు. కానీ తీరా కొనేసి  ఇంటికి తెచ్చుకున్నాక అవిసరిపోవడం లేదని బాధపడతారు. ఇప్పటి అమ్మాయిలు బయటకు వెళ్లేటప్పుడు ఎక్కువగా షూ ధరించడానికే ఇష్టపడుతుంటారు. కాబట్టి షూ నచ్చిందని కొనేసి ఆ తరువాత సరిపోవడం లేదని ఇబ్బంది పడుతున్నా, కొత్తగా కొన్నవాటిని వేసుకోవడంలో ఇబ్బంది ఎదురవుతున్నా ఈ కింది టిప్స్ ఫాలో అయితే చాలు.. సమస్య పరిష్కారం అవుతుంది.

కొత్త షూస్ కొన్న తరువాత వాటిని వేసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. వాటిని వేసుకోవాలన్నా, కొత్త షూ తో నడవాలన్నా కాస్త ఇబ్బందిగా ఉంటుంది.

బూట్లు వేసుకునేటప్పుడు చాలా మందికి ఎదురయ్యే సమస్య అవి వేసుకున్నప్పుడు కాలి చిటికెన వేలుమీద చాలా ఒత్తిడి కలుగుతూ ఉంటుంది. దీని కారణంగా షూ వేసుకున్నంతసేపు ఇబ్బంది పడుతూనే ఉంటారు.  కొన్నిసార్లు ఇలా ఒత్తిడి కలగడం వల్ల వేలి కందిపోయి చర్మం తొలగిపోతుంది కూడా. ఇది చాలా నరకంగా ఉంటుంది. కానీ ఈ సమస్య పరిష్కారం కావాలంటే చిటికెన వేలిపై బ్యాండ్రాయిడ్ ను అప్లై చేయవచ్చు.

చాలామంది షూస్ కొనేటప్పుడు కరెక్ట్ గా కాలుకు సరిపడేలా తీసుకుంటారు. అయితే కొన్ని రోజులుకాగానే అవి బాగా లూజుగా అయిపోతాయి. ఈ విషయం గమనించిన వారు షూస్ ను కొనుగోలు చేసేటప్పుడు కాస్త టైట్ గా ఉన్నవే కొనుగోలు చేస్తారు.  దీని వల్ల షూస్ మెల్లిగా అలవాటు పడ్డాక సెట్ అవుతాయని అనుకుంటారు. కానీ షూస్ కొన్న కొత్తలో వాటి కారణంగా నరకం కనబడుతుంది. దీన్ని అవాయిడ్ చేయడానికి కొత్త షూ కొనుగోలు చేశాక న్యూస్ పేపర్ లేదా వేస్ట్ పేపర్స్ ను రోల్ చేసి షూస్ లో కొన్నిరోజుల పాటు ఉంచాలి. వీటి వల్ల షూస్ మెల్లిగా పాదానికి సెట్ అవుతాయి.

షూస్ వేసుకున్నప్పుడు మడమ భాగం ఎత్తుగా ఉన్నట్టైతే అది ఇబ్బంది కలిగిస్తుంది. ఈ ఇబ్బంది అధిగమించడానికి  కాటన్ ప్యాడ్ లేదా శానిటరీ ప్యాడ్ ను షూ లోపల పాదాలకింద పెట్టుకోవచ్చు. దీనివల్ల మడమలకు సౌకర్యంగా ఉండటమే కాదు, చెమట, షూ నుండి వచ్చే దుర్వాసన మొదలైన వాటికి కూడా చెక్ పెట్టచ్చు.

షూ వేసుకున్నప్పుడు కొన్నిసార్లు పాదాలు జారినట్టు అవుతుంటుంది. ఇలా పాదాలు జారినట్టు ఉన్నా లేదా షూ వదులుగా ఉన్నా వాటిని వేసుకునే ముందు షూ లోపల హెయిర్ స్ప్రే ను స్ప్రే చేయాలి.  ఇలా చేస్తే ఇబ్బంది తొలగిపోతుంది.

                       *నిశ్శబ్ద.