తన జీవితాన్ని తనే మలుచుకున్న తెలుగు శక్తి పెరంబుదూరు సుభద్రమ్మ!

కొంతమంది జీవితాలు సాఫీగా ఒక పద్ధతిలో గడిచిపోతాయి. మరి కొందరి జీవితాలు ఏ క్షణాన ఏ మలుపు తిరుగుతాయో తెలియకుండ వింతనడకలు నడుస్తుంటాయి. అందుకు చక్కని ఉదాహరణ శ్రీ పెరంబుదూరు సుభద్రమ్మ గారి జీవితం. 

వైష్ణవ సాంప్రదాయానికి చెందిన మామిళ్లపల్లి రామానుజాచార్యులు తాయారమ్మగార్ల కుమార్తెగా ఆమె 1904 లో జన్మించారు. తూర్పు గోదావరిజిల్లా, కాకినాడ ఆమె స్వస్థలం. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు వున్నారు. చాలా చిన్నతనంలోనే ఆమెకు శ్రీ పెరంబుదూరు బుచ్చయాచార్యులుగారితో వివాహం జరిగింది. మరి కొద్దికాలానికే విధి వక్రించింది. నందనవనం అవుతుందనుకున్న ఆమె జీవితం తల్లిదండ్రులకొక విషమ సమస్యగా తయారయింది. 4-5 తరగతులవరకు చదివించటం తప్ప యేమి చేయటానికి వారికి తోచలేదు. ఆమె చిన్నన్నగారయిన గోపాలాచారిగారికి చెల్లిలిపైన ఎంతో అభిమానం, జాలి ఉండేవి. ఆయన ఉద్యోగరీత్యా మెసపొటేమియాలో ఉంటున్నా..  ఆయన చెల్లెలిని క్రమవిధానంలో చదివించమని తల్లితండ్రులకు ధైర్యం కలిగించి, తగిన ధనసహాయం చేశారు. 15 సంవత్సరాల వయసు వచ్చిన అమ్మాయి వున్న పూళ్లో చిన్న క్లాసులు చదవటం బాగుండదని చాలా సాహసంచేసి ఆమె తల్లిదండ్రులు ఆమెను విశాఖపట్నంలో క్వీన్ మేరీ గర్ల్స్  హైస్కూల్లో 5వ తరగతిలో చేర్పించారు. ఆమెకి హాస్టలులో వసతి ఏర్పాటు చేయించారు. ఇలా ఆమె 1927 లో స్కూలు ఫైనలు ముగించారు.

కాకినాడ పిఠాపురం రాజావారి కాలేజీలో ఇంటరు ముగిసింది. ఆమెకొక స్వతంత్ర జీవనోపాధి మార్గం చూపించి, స్థిరమైన భవిష్యత్తు కల్పించాలనుకున్న చిన్నన్నగారికి విశాఖపట్నంలో వుద్యోగమయింది. ఇక చెల్లెలి చదువు నిరాఘాటంగా సాగుతుందన్న తలంపుతో ఆమెను విశాఖపట్నం రప్పించి అక్కడ బి. ఏ. ఆనర్సులో చేర్పించాడు. కాని అప్పటికే ఆమెకు ఇంగ్లీషు చదువులమీద మోజుపూర్తిగా నశించి, జాతీయావేశం దృఢ పడింది. జాతీయోద్యమంలో చేరి, స్వరాజ్య సంపాదనకు పాటుపడితీరాలని నిశ్చయించుకుంది. ఆనర్సు చదువు ముగియకుండానే బహిరంగ సభల్లో వుపన్యసించటం, సత్యాగ్రహం చేయడం ప్రారంభించింది. ఆ సమయంలో పాదర్తి సుందరమ్మ గారితో ఈమెకు సాన్నిత్యం పెరిగింది. 

1980 ఉప్పు సత్యాగ్రహంలో నాయకులందరు అరెస్టయిన తరువాత పుద్యమం చల్లారి పోకుండ యీమె, సుందరమ్మగారు బందరు కోనకు వెళ్లి వుప్పువండేవారు. కల్లుసారా దుకాణాల దగ్గర పికెటింగు చేసేవారు. చివరకు 1980 లో అరెస్టు అయినారు. 8 నెలల కఠినశిక్ష అనుభవించటానికి రాయవేలూరు జైలుకు వెళ్లారు. తోడుగా వెళ్లి జైలులో దింపివచ్చిన సుందరమ్మగారు 27-8-1980న అరెస్టయి ఆ జైలుకే వెళ్లారు. 1980 సత్యాగ్రహ సందర్భంలో పశ్చిమ కృష్ణాజిల్లాలో అరెస్టయిన 188 మందిలోను స్త్రీలు వీరిద్దరే. శాసనోల్లోంఘన ఉద్యమం కోసం ఆంధ్రరాష్ట్రం తరపున సుభద్రమ్మగారు కర్రసాము, గస్తీ తిరగటం, నగర సంకీర్తనం వంటి విద్యలనభ్యసించారు. 

1981 డిశంబరు 31న దేశ వ్యాప్తంగ శాసనోల్లంఘనం చేయటానికి గాంధీజీ అనుమతించారు. దాంతో వుద్యమంలో కొత్త కెరటం ఉవ్వెత్తున లేచింది. ఆంధ్రులు, స్త్రీలు పురుషులు అమితమైన సాహసంతో పట్టుదలతో పాల్గొన్నారు. ఆ కార్యకలాపాలను ఆపకుండానే శ్రీమతి సుభద్రమ్మ తీవ్రకృషిని సాగించారు. ఆంధ్ర రాష్ట్ర నియంతగా వ్యక్తిగత సత్యాగ్రహంలో పాల్గొన్నారు. 1992 ఏప్రిల్ 2న గుంటూరు జిల్లా పెనుమాకలో అరెస్టయినారు.

అప్పుడు జైలులో వుండగానే ఆమెకు మళ్లీ చదువుపైన ధ్యాన కలిగి పరిక్ష వ్రాసి బి. ఏ పాసయినారు.

జైలు నుండి విడుదలయివచ్చిన తరవాత బ్రిటిష్ ప్రభుత్వం కింద వుద్యోగం చేయరాదని నిశ్చయించుకున్నారు. ఆరోజుల్లో విజయవాడలో తంగిరాల రాఘవయ్యగారు నేషనల్ ఇండియన్ లైఫ్ ఇన్సూరెన్సు కంపెనీ నిర్వహిస్తూ దానిలో స్త్రీలకు ప్రత్యేక విభాగం ఏర్పరచారు. ఆ కంపెనీ ఏజెంటుగా ఆమె అతిసమర్థవంతంగా పనిచేశారు. అప్పట్లో ఇన్సూరెన్సు రంగంలో అంత పేరు తెచ్చుకున్న మహిళలు లేరు. ఆమె ఆ పనిమీద తరుచు మద్రాసు వెళ్లవలసి వస్తుండేది. చివరకు మద్రాసుకే మకాం మార్చారు. ఆమెకు చిన్ననాటి నుంచి తనది, తనకోసం అనేమమత తక్కువ, ఉన్నదానిని అవసరమైన నలుగురికీ వుపయోగపరచాలనే తత్వం, దాంతో ఆమె సహాయం పొందేవారితో ఇల్లు నిండుగా వుండేది. కులమత భేదాల పట్టింపు ఆమెకు బొత్తిగాలేదు. నిరాధారులు సహాయము అడిగితే ఆశ్రయమిచ్చి ఏదో ఒక చేతి పనివృత్తి నేర్చుకోవటానికి సహకరించేవారు. చదువుపట్ల అభిరుచి వున్నవారికి పరీక్షలకు కట్టటానికి తోడ్పడేవారు.

ఆమె విద్యావంతురాలు, సమర్ధురాలు. ఏ రంగంలోను శృంఖలాలను భరించలేని స్వేచ్ఛావాది. తన భవిష్యజీవనానికి బంగారుబాట అయిన ఆనర్సు చదువును కాలదన్ని దేశ సేవచేసి జైలు నరకం అనుభవించారు. పరప్రభుత్వం కింద బానిసగా వుండనంటు స్వతంత్ర జీవితాన్ని ఎన్నుకొన్నారు. ఆంధ్ర బాలలకు, మహిళలకు సేవచేశారు. ఆర్తులకు, నిస్సహాయులకు, అనాధలకు ఆఖరు పైసా వరకు సహాయం అందించారు. 1974లో హైదరాబాదులో శాశ్వతంగా కన్నుమూశారు.

                               ◆నిశ్శబ్ద.