మీది ఏ స్టైలో చూసుకోండి

1) పిల్లలతో మనం ప్రేమగా ఉన్నామా లేదా ? మన పేరెంటింగ్ స్టైల్ ఏంటి ? ఈ ప్రశ్నలకి ఎవరైనా సమాధానం చెబితే బావుంటుంది అనిపిస్తోంది కదా ! పోస్టర్ క్లైన్, జిమ్ఫే అనే ఇద్దరు చైల్డ్ సైకాలజిస్టులు ఈ విషయంపై పరిశోధన చేసి తల్లిదండ్రులు పిల్లలతో వ్యవహరించే తీరు బట్టి వారి పెరెంటింగ్ స్టైల్ నిర్ణయించటం ఎలాగో చెప్పారు. సో మన పేరెంటింగ్ స్టైల్ ఏంటో తెలుసుకుని, దాని పర్యవసానం ఏలా వుంటుందో గుర్తించి తీసుకోవాల్సిన జాగ్రతలు గురించి అలోచించి తీరాలట. అలా పోస్టర్ క్లైన్, జిమ్ఫే ఇద్దరూ, 3 రకాల పేరెంటింగ్ స్టైల్స్ ని  గురించి చెబుతున్నారు అవే డ్రిల్ సార్జంట్ పేరెంట్, హెలికాఫ్టర్ పేరంట్స్ , కోచింగ్ పేరంట్స్ పేర్లు వెరైటీగా ఉన్నాయి కదా !

2)  డ్రిల్ సార్జంట్ పేరెంట్స్ పేరు వింటుంటే అర్ధమయి పోతోంది కదా! ఈ పేరంట్స్ పిల్లలతో కమాండింగ్ గా వ్యవహరిస్తారు. ఏం చెప్పినా అర్డర్ లా వుంటుంది. పిల్లల అల్లరి, వాళ్ళు చేసే చిన్న చిన్న పొరపాట్లుని వీళ్ళు సహించరు. చిన్నతనంలో కంట్రోల్ లో పెట్టకపొతే పిల్లలు పెద్దయ్యాక కంట్రోల్ కారని నమ్ముతారు వీళ్ళు. పిల్లలు చిన్న పొరపాటు చేసినా, పెద్ద పొరపాటు చేసినంత హంగామా చేస్తారు. పనిష్మెంట్లు, బెదిరింపులు, సహజంగా ఉంటాయి. ఈ పేరంట్స్ పెంపకంలో పిల్లలను బెదిరించో, బహుమతుల ఆశా చూపో దారిలో పెట్టాలని ప్రయత్నిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే డ్రిల్ మాస్టర్లులా ఎప్పుడూ బెదిరించిన చూపులతో కఠినంగా వ్యవహరిస్తారు. నిజానికి ఈ పేరంట్స్ కి పిల్లలంటే  ప్రేమ లేక కాదు, కాని క్రమశిక్షణ పేరుతొ వీళ్ళు కాస్త కఠినంగా వ్యవహరిస్తారు. మరి ఇలాంటి తల్లిదండ్రుల పెంపకంలో పెరిగిన పిల్లలు ఎలా వుంటారు అంటే నిపుణల సమాధానం ఏంటో తెలుసా ? తిరగాబాడటానికి అలవాటు పడతారట పిల్లలు, ఎదురు చెప్పటం, అబద్ధాలు చెప్పటం, అతిగా భయపడటం, తనపై తనకి నమ్మకం లేకపోవటం వంటి లక్షణాలు పిల్లల్లో కనిపిస్తే పేరెంట్స్ తన ప్రవర్తన తీరు ఎలావుందో చెక్ చేసుకోవాలి.

3)   డ్రిల్ సార్జంట్ పేరంట్స్ ప్రవర్తన తీరు, పిల్లలపై దాని ప్రభావం గురించి చెప్పుకున్నం కదా,  రెండో రకం పేరంట్స్ ' హెలికాఫ్టర్ పేరంట్స్ '. వీళ్ళకి పిల్లలే లోకం, పిల్లల ప్రతీ అవసరాన్ని ముందుగా గుర్తించి తీర్చటానికి ప్రయత్నిస్తారు.  అంతే కాదు పిల్లలకి ఏం ఇబ్బంది కలగకూడదని భావించి ప్రతీ విషయంలో సలహాలు, సూచనలు ఇస్తుంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే పిల్లల్ని ప్రతినిమిషం వేలుపెట్టుకుని నడిపించటానికి ప్రయత్నిస్తారని చెప్పచ్చు.  ఈ హెలికాఫ్టర్ పేరెంట్స్ పిల్లలని అతిగా ప్రేమించటం, వాళ్ళే లోకంగా భావించటం, వాళ్ళని కళ్ళలో పెట్టుకుని చూడటం వీరి లక్షణాలు. ఈ తరహ పేరంట్స్ పెంపకంలో పెరిగిన పిల్లల్లో ఆత్మవిశ్వాసం పాళ్ళు కాస్త తక్కువే వుంటాయి అని చెప్పచ్చు. పైగా  ప్రతి విషయానికి ఆధారపడటం అలవాటయి పోతుంది వీళ్ళకి. కొత్త చాలెంజ్లని ధైర్యంగా ఎదుర్కోలేరు. సరైన నిర్ణయాలు తీసుకోవటం ఇబ్బందిగా వుంటుంది ఈ పిల్లలకి.

4)   పిల్లలని అతి క్రమశిక్షణతో పెంచటం, లేదా అతి గారాబం చేసి అన్ని తానై చూసుకోవటం ఈ రెండింటికి మధ్యస్థంగా పిల్లలతో వ్యవహరించే తీరులో ప్రేమ, గౌరవం, నమ్మకం చూపిస్తూ వారి వ్యక్తిత్వాన్ని గౌరవిస్తూ నేర్చుకుంటూ ఎదిగేలా పిల్లల్ని ప్రోత్సహించే పేరంట్స్ ని " కోచింగ్ పేరంట్స్" అంటారు. ఈ పేరంట్స్ పిల్లల నిర్ణయాన్ని గౌరవిస్తారు. పిల్లలకి ఆప్షన్స్ ,చాయిస్ ఇచ్చి నిర్ణయం పిల్లల మీదే  వదిలేస్తారు. పిల్లలు తీసుకునే నిర్ణయం ఏదైనా దాని నుంచి వచ్చే ఫలితాలకి పిల్లలు బాధ్యత వహించటం నేర్పుతారు. పిల్లలు ఎదుగుతూ నేర్చుకుంటారు, నేర్చుకుంటూ ఎదుగుతారు. వీరి పెంపకంలో పెరిగిన పిల్లలు  అత్మవిశ్వాసంతో, నిండైన వక్తిత్వంతో కనిపిస్తారు. ఆ పిల్లలని చూడగానే వాళ్ళ తల్లిదండ్రుల పెరంటింగ్ స్టైల్ ఏంటో ఇట్టే చెప్పెయ్యచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే చరిత్ర సృష్టించే విజయాలు సాధించటం ఈ తరహా పేరంట్స్ పెంపకంలో పెరిగిన పిల్లలకి ఎంతో సులువు.

5)   మన పెరెంటిగ్ స్టైల్ ఎలా వుండాలో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర లేదు కదా ! మన పిల్లలు ఎలా పెరగాలో కోరుకునేటప్పుడు అందుకు మన ప్రవర్తన తీరు ఎలావుండాలో చూసుకోవాలి. అంటే ' ఫలితం' ఒకటి కోరుకుని ప్రయత్నం ఇంకోటి చేయకూడదు. మనం కమాండింగ్ గా వుంటూ పిల్లలు మనతో ప్రేమగా ఉండాలని కోరుకోవటం కరెక్టు కాదు. మన పిల్లలు మనపై ప్రతి విషయానికి ఆధారపడేలా చేస్తూ వారు అత్మవిశ్వాసంతో ఉండాలని కోరుకోకూడదు. అంటే పిల్లలు ఎలా ఎదగాలో వారి వ్యక్తిత్వం ఎలా వుండాలో కోరుకునేటప్పుడు మనల్ని మనం చెక్ చేసుకు తీరాలి, మనం నాటే విత్తు బట్టే మొక్క కాదంటారా !

-రమ