కడుపు నిండా తింటూనే బరువు తగ్గవచ్చు!


స్థూలకాయం... ఈ సమస్య ఈ రోజుల్లో సర్వసాధారణమై పోయింది. కొన్నాళ్ళ క్రితం నాజూకుగా అందంగా ఉన్నవారు కాస్త, బరువు పెరిగిపోయి, కనీసం నడవడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. అసలే అధిక బరువుతో బాధపడుతున్నారంటే ఇంకోవైపు ఎవరు పడితే వారి ఇచ్చే సలహాలు.... వ్యాయామం చేయండి, తిండి తగ్గించండి, స్వీట్స్ తినకూడదు, నాన్ వెజ్ తినకూడదు... ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. బరువు తగ్గడానికి తిండి తగ్గించాలనుకోవడం బాగానే ఉంది, వ్యాయామం చేయాలనుకోవడం  కూడా బాగానే ఉంది, కానీ తిండి తగ్గించి వ్యాయామం చేయడం సాధ్యమా...? వ్యాయామం చేయడానికైనా శక్తి కావాలి కదా..? మరలాంటప్పుడు కడుపు నిండా తిండి లేకపోతే శక్తి ఎక్కడి నుండి వస్తుంది... ? ఒక్క పూట కాస్త ఆలస్యమైతేనే తట్టుకోలేం.. అందునా స్థూలకాయులు మరీను. అలాగని ఎట్లాగూ బరువు పెరిగాం చేయగలిగేదేముంది అని ఊరుకోవడానికి లేదు, అధిక బరువు ప్రాణాంతకమని హెచ్చరిస్తున్నారు వైద్యులు.

బరువు పెరగడానికి మూల కారణం శరీరంలోని హార్మోన్ ల ఇంబాలెన్స్, అధిక మోతాదులో తినేయడం, ఆల్కహాల్ సేవించడం, స్వీట్స్, చాక్లెట్స్ తినేయడం. ఇవి బరువు పెరిగిపోవడానికి ముఖ్య కారణాలు. ఒక్కోసారి అధిక ఒత్తిడి కూడా బరువు పెరగడానికి కారణమేనంటున్నారు నిపుణులు. అధిక ఒత్తిడి వల్ల వెలువడే కోర్టిసోల్ అనే హార్మోన్ పొట్టలో, ముఖ్యంగా నడుం భాగంలో కొవ్వు చేరడానికి కారణమవుతుంది.

గుడ్లు : గుడ్లు చాలా బలవత్తరమైన ఆహారం. గుడ్లలో ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉండటం చేత ఆకలి తొందరగా వేయదు.

బీన్స్ : ప్రోటీన్లు, ఫైబర్ అధికంగా ఉన్న కొవ్వు రహిత ఆహారం. వీటిని తినడం వల్ల కండరాలు బలంగా తయారవుతాయి.

ఓట్ మీల్ : అధిక బరువుతో బాధపడేవారికి ఓట్ మీల్ ని మించిన మంచి ఆహారం లేదు. ఓట్ మీల్ లో కొవ్వును కరిగించే లక్షణాలతో పాటు ఇందులో శరీరానికి కావలసిన అతి ముఖ్య పోషకాలు ఫైబర్, ప్రోటీన్లు , విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి రోజూ పొద్దున్నే బ్రేక్ ఫాస్ట్ లో ఓట్ మీల్ ని కడుపు నిండా తినండి. రోజంతా చలాకీగా ఉండగలుగుతారు.

కూరగాయలు : విటమిన్స్, మినెరల్స్, మరియు యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ పుష్కలంగా ఉన్న ఆహారం. రాత్రిపూట పడుకోబోయే ముందు కేవలం కూరగాయలు తినడం మీ పొట్ట సైజును తగ్గించడంలో బాగా ఉపకరిస్తుంది.

బార్లీ : బార్లీ లో ఉన్న ఫైబర్, విటమిన్లు, మినెరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైటో కెమికల్స్ మీకు రోజంతా కావలసినంత శక్తినిస్తాయి, పైగా కొవ్వు రహిత ఆహారం, మీరు నిరభ్యంతరంగా తినవచ్చు.

గ్రీన్ టీ : ఇందులో విటమిన్ సి, బి, మరియు విటమిన్ ఈ మరియు మెగ్నీషియం, జింక్, క్రోమియం, మరియు సెలీనియం పుష్కలంగా ఉంటాయి. దీన్ని మీరు రోజుకు ఎన్ని సార్లైనా తాగవచ్చు.

ఆలివ్ ఆయిల్ : చాలా మంది కూరగాయలు తినడమంటే అంతగా  ఇష్టపడరు, అందుకే  వండేటప్పుడు మనం సాధారణంగా వాడే నూనె తో పాటు విటమిన్ కె, విటమిన్ ఈ, సమృద్ధిగా ఉండే ఈ ఆలివ్ ఆయిల్ వేస్తే ఆహారం ఇంకా రుచిగా తయారవుతుంది. అంతే కాదు ఆలివ్ ఆయిల్ లో మీ పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వును కరిగించగలిగే విశిష్ట గుణాలున్నాయి.

బరువును తగ్గించుకోవాలని మీరు అనుకుంటున్నారంటే మీకు మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్త పెరిగినట్టే. అలాగని ఒకేసారిగా బరువు తగ్గడానికి మాత్రం ప్రయత్నించకూడదు. ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూనే, ఎక్స్ పర్ట్ సలహాలు తీసుకుంటూ, ఎప్పటికప్పుడు హెల్త్ చెకప్ చేసుకుంటూ ఉండాలి.