పిల్లల్లో మంచి ప్రవర్తనకై రూల్స్ పెట్టకండి

Don't impose rules to instill good manners in kids

            సమాజంలో మనం చాలా మందిని చూస్తుంటాం, వారిని చూసినా, వారి గురించి తెలుసుకున్నా, వారిని ఇన్స్ పిరేషన్ గా తీసుకుంటాం. మనం అంతటి వాళ్ళం కాలేకపోయినా మన పిల్లలైనా అంతటి వాళ్ళు కావాలని కోరుకుంటాం, అందుకే లక్షలు డొనేషన్ లు కట్టి చదవించడానికి కూడా వెనకాడం, పిల్లలు ఎలిమెంటరీ స్కూల్ లోనే ఉంటారు, వాళ్ళ కాలేజీ చదువులకని ఇప్పటి నుండే ప్లాన్స్ చేస్తుంటాం, వారి చదువు విషయంలోనే కాదు, వారి ఆరోగ్యం విషయంలో కానీ వారి వస్త్ర ధారణ విషయంలో కానీ ఏ లోటు రాకుండా చూసుకుంటాం, కానీ వీటన్నింటితో బాటు కొన్ని విషయాలు, మనం చూసి చూడనట్టుగా , సింపుల్ గా వదిలేస్తుంటాం. ఆ విషయాలే వారు ఎదిగాక వారి వ్యక్తిత్వాన్ని శాసిస్తాయనడంలో అతిశయోక్తి లేదు.

మన ఆహారపు అలవాట్లు, మన కుటుంబ పద్ధతులతో పాటు, కుటుంబంలోని మనుషుల మధ్య ఉండే అనుబంధాలతో పాటు స్కూల్ కి వెళ్తున్న పిల్లల్లో తన తోటి పిల్లల ప్రభావం కూడా పడుతూ ఉంటుంది, కొన్ని సార్లు మనం వాటిని చూసి చూడకుండా వదిలేసిన విషయాలే భవిష్యత్తులో చాలా కీలక పాత్ర పోషిస్తాయి. వారు ఎదిగాక వాటిని మార్చాలన్నా, సున్నితంగా చెప్పగానే వినే స్థాయిలో పిల్లలు ఉండరు. అందుకే పిల్లల్లో మంచి గుణాలు అలవర్చడానికి వారి పసితనం నుండే వారిలో మంచి లక్షణాలు అలవడేలా జాగ్రత్త పడాలి, అందుకని కఠినంగా వ్యవహరిస్తూ, ఇది ఇలాగే చేయాలి అని రూల్స్ పెట్టాల్సిన అవసరం లేదు,

ప్లీజ్ మరియు థాంక్స్ :

పిల్లలకు ఏదైనా పని చెప్పాలనుకున్నప్పుడు ప్లీజ్ అనడం, ఆ పని చేశాక థాంక్స్ చెప్పడం మరిచిపోకండి. ఆటోమేటిక్ గా వాళ్ళకూ అలవాటు అవుతుంది. వాళ్ళు కూడా థాంక్స్ గానీ ప్లీజ్ గానీ చెప్పినప్పుడు మీరు హ్యాప్పీగా ఫీల్ అవుతారన్న విషయం వారికి అర్థమయ్యేలా ప్రవర్తించండి.

భోజనం చేసేటప్పుడు :

భోజనం చేసేటప్పుడు ఎలా మసలుకోవాలో పిల్లలకు వారు స్వంతంగా తినడం మొదలు పెట్టినప్పటినుండే చెప్పడం మొదలుపెట్టండి. కొందరు పిల్లలు నోరు తెరిచి పెట్టి తింటుంటారు. తిన్న ప్రతీసారి ప్లేట్ చుట్టూరా అన్నం పడేయడం, అన్నం తింటున్న చేతితోనే గ్లాసుల్ని పట్టుకోవడం లాంటివి చేస్తుంటారు. అలాగని అంత చిన్న వయసు నుండే వాళ్ళు అన్ని పద్ధతులు నేర్చుకోవడం కుదరదు, కానీ అలా చేయడం కరెక్ట్ కాదన్న విషయాన్ని మాత్రం వారికి తెలియజేయాలి.

ప్లే డేట్స్

పిల్లలు ఏదైనా బర్త్ డే పార్టీ కి అటెండ్ అయినప్పుడు అక్కడ ఎలా మసలుకోవాలో చెప్పి పంపించండి. ఫ్రెండ్స్ తో ఎలా ఉండాలి, వారి పేరెంట్స్ తో ఎలా ఉండాలి, తినేటప్పుడు తోటివారితో ఎలా మసలుకోవాలి ఒకటికి , రెండు సార్లు చెప్పండి. ముఖ్యంగా పిల్లలు, స్వీట్స్, చాక్లెట్స్ విషయంలో అలావాటుగా మ్యానర్స్ లేకుండా ప్రవర్తిస్తుంటారు. వాళ్ళు వెళ్ళేది ఫ్రెండ్ పార్టీ కి కాబట్టి అలా ప్రవర్తించకూడదని చెప్పి పంపించండి.

ఎదుటి వారిని చులకన చేయడం

ఈ అలవాటు పిల్లల్లో సర్వ సాధారణంగా ఉంటుంది. తోటివారిని వారి పేర్లతో కాకుండా ఫన్నీగా ఉండే పేర్లతో పిలుస్తుంటారు. క్లాస్ మేట్స్ , ఫ్రెండ్స్ నే కాడు ఒక్కోసారి టీచర్స్ ని కూడా చులకన చేస్తుంటారు. ఇలాంటి అలవాట్లను మొగ్గలోనే తుంచేయాలి, వీలయితే ఎవరినైతే వారు కించపరుస్తున్నారో వారిలో ఉన్న గొప్పను పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి, ఎదుటి వారిని కించపరిస్తే మనం లోకువైపోతామన్న విషయం వారికి తెలియజేయాలి.

ప్రామిస్ చేయడం

ఏదైనా విషయం చెప్పి ప్రామిస్ చేయడం, బలవంతంగా నైనా సరే ఎదుటి వారికి తమపై నమ్మకం కలిగేలా చేయడానికి చేసే ప్రయత్నం, ఈ ధోరణి పిల్లల్లో కనిపిస్తూ ఉంటుంది. ఏదైనా స్కూల్ లో జరిగిన విషయం చెప్పడం, ఇమ్మీడియట్ గా గాడ్ ప్రామిస్ లేదా మదర్ ప్రామిస్ అనడం ఈ రోజుల్లో సర్వ సాధారణం. మీకు తనపై చాలా నమ్మకముందని చెప్పండి, నమ్మకమనేది ప్రామిస్ చేస్తేనే రాదనీ వారికి అర్థమయ్యేలా చెప్పండి.

ఫ్రెండ్స్ ఇంటికి వచ్చినపుడు

మీ ఇంట్లో మీ చిన్నారి బర్త్ డే పార్టీకి కానీ, లేదా ఏ ఇతర ఒకేషన్ లలో నైనా తన ఫ్రెండ్స్ ని కూడా ఇన్వైట్ చేస్తూ ఉండండి, తద్వారా ఇంటికి వచ్చిన గెస్ట్ తో ఎలా ప్రవర్తించాలో చిన్నతనంలోనే అలవాటు అవుతుంది.

ఎక్స్ క్యూజ్ మీ

చాలా మంది పిల్లలు, పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే మధ్యలో వచ్చి మాట్లాడేస్తుంటారు , మనం కూడా 'పెద్ద వాళ్ళు మాట్లాడేటప్పుడు మధ్యలో మాట్లాడకూడదు' అని చెప్తూనే ఉంటాం, దానికి బదులు ఏదైనా అడగడానికి ముందు 'ఎక్స్ క్యూజ్ మీ' అని అనాలని చెప్పడం మరీ మంచిది.

ఎక్కడ పడితే అక్కడ గోక్కోవడం

ఇవి పిల్లల్లో సర్వ సాధారణం. ముక్కుల్లో వేళ్ళు పెట్టుకోవడం, గోక్కోవడం, స్కూల్ నుండి రాగానే బ్యాగ్ ఎక్కడ పడితే అక్కడ పడేయడం.. ఇవన్నీ సున్నితంగా చెప్తూ మాన్పించాలి, పిల్లల్లో మార్పు ఒక్కసారిగా రాదు, కాస్త టైం పడుతుంది.అందుకే ఓపికగా, సున్నితంగా చెప్తూనే వారిలో మంచి చెడుకి మధ్య అవగాహన కలిగించాలి.