హ్యాప్పీ స్కూల్ డేస్

 

ఎప్పటి నుండో ఎదురు చూసిన వేసవి సెలవులు...

చుట్టాలింటికి వెళ్ళవచ్చు, వాళ్ళు ఇక్కడికి రావచ్చు, హోమ్ వర్క్ గొడవ ఉండదు, పొద్దున్నే లేవాల్సిన అవసరం అంతకన్నా ఉండదు, ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఉండవు. ఎంచక్కా ఏ టెన్షన్స్ లేకుండా ఫ్రెండ్స్ తో ఆడుకోవచ్చు..

ఇవన్నీ ఒక నెల మాత్రమే.. ఈ సంతోషాలన్నింటికీ అడ్డు కట్టలు వేస్తున్నట్టు జూన్ రానే వస్తుంది. ఇంకేముంటుంది చెప్పండి. పిల్లల్లో ఇన్నాళ్ళుగా ఉన్న ఆనందం కాస్త నీరుకారిపోతుంది. ఇన్నాళ్ళు జాలీగా ఉన్న ఆ పసిహృదయాలు మళ్ళీ ఆ రొటీన్ స్కూల్ టైం టేబుల్ కి, కొత్త పుస్తకాలకి తిరిగి అలవాటు పడాలంటే కష్టమే మరీ.

  ఇలాంటప్పుడు చొరవ తీసుకుని పిల్లలు ఇబ్బంది పడకుండా ఆటపాటల నుండి వాళ్ళ మనసు మళ్ళించి వాళ్ళు స్కూల్ కి సంతోషంగా వెళ్ళేలా మోటివేట్ చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. ఇది మరీ అంత తేలికైన విషయం కాకపోయినా మొదటినెల వారిపై కాస్త ఎక్కువ కాన్సంట్రేషన్ చేస్తే పిల్లలకు స్కూల్ అలవాటు అవుతుంది... మీకు టెన్షన్ తప్పుతుంది.

 

కనీసం వారం రోజులు ముందుగా...

స్కూల్ రేపటి నుండి తెరుస్తున్నారనగా వారికి స్టిట్టు గా వార్నింగ్ స్ ఇస్తూ, రేపటి నుండి ఇలా ఉంటే కుదరదనో, హోం వర్కు, ర్యాంకులు గుర్తు చేసి వారి సంతోషాన్ని హరించవద్దు. చాలా ప్లాన్డ్ గా ఉండండి. వారం రోజుల ముందుగానే.... 'ఇంకా వారం రోజులైతే స్కూల్ స్టార్ట్ అయిపోతుంది. కొత్త బుక్స్, కొత్త క్లాస్, కొత్త యూనిఫాం...' ఇలాంటి విషయాలను గుర్తు చేసి వాళ్ళను ఎగ్జైట్ చేయండి. లాస్ట్ ఇయర్ లో వాళ్ళు ఎక్కువగా మార్కులు తెచ్చుకున్న సందర్భాల్ని, క్లాస్ లో టీచర్ మెచ్చుకున్న సందర్భాల్ని గుర్తు చేసి వారిని అభినందించండి.. వారం రోజులు ముందునుండే వారిని ఉదయాన్నే కాస్త త్వరగా లేచే అలవాటు చేయండి.

 

మొదటి వారంలో ...

స్కూల్ మొదలవగానే హడావిడిగా మీరు నిద్రలేచి, వారిని నిద్రలేపి, గబగబా బ్రేక్ ఫాస్ట్ ప్రిపేర్ చేసి, వారిని గాబరా పెడుతూనే తినిపించి, ఒకవైపు బస్సు వచ్చేస్తుందన్న టెన్షన్, మరోవైపు బాక్స్ పెట్టాలన్న టెన్షన్.. ఇలా మీరు ఫీల్ అయ్యే ఒత్తిడి పిల్లలపై ఎక్కువ ప్రభావాన్ని చూపెడుతుంది. గుర్తుపెట్టుకోండి ఈ టైం లో పిల్లలకు కావాల్సింది మీ సపోర్ట్, అందుకే వీలైనంత ఎక్కువ సమయాన్ని వారితో గడపగలిగేలా ప్లానింగ్ ఉండాలి, అందుకు మీరు అనుకున్న సమయానికంటే కాస్త తొందరగా నిద్రలేస్తే సరిపోతుంది.

పిల్లలు బయటపడకపోయినా మనసులో స్కూల్ తాలూకు భయం, చిరాకు ఉంటాయి. దానిని కనిపెట్టాల్సింది మీరే. బ్రష్ చేస్తున్నప్పుడు, స్నానం చేయిస్తున్నప్పుడు వారి క్లాస్ మేట్స్ గురించి మాట్లాడాలి, తొందరగా రెడీ అయి వెళ్తే, ఎంచక్కా ఫ్రెండ్స్ అందరినీ కలవచ్చని మోటివేట్ చేయాలి.

 

ఆహారం విషయంలో...

పిల్లలు నిద్రలేవక ముందే వారి బ్రేక్ ఫాస్ట్, లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మంచిది. వాళ్ళు నిద్ర లేచాక హడావిడి పడకుండా ముందే ప్రిపేర్ చేసుకోవడం వల్ల పిల్లలు నిద్రలేవగానే ఎంచక్కా వాళ్ళతో కబుర్లాడుతూనే వాళ్ళను స్కూల్ కి రెడీ చేయొచ్చు, వాళ్ళు టెన్షన్ మరిచిపోయి రిలాక్స్డ్ గా కూడా ఉంటారు.

బ్రేక్ ఫాస్ట్ విషయంలోనూ, లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకునే విషయంలోనూ వారికి పూర్తి ఫ్రీడంని ఇవ్వాలి. బ్రేక్ ఫాస్ట్ లో వారికి నచ్చిన ఐటమ్స్ ఉంటే మారాం చేయకుండా తొందరగా తినేస్తారు. దీనివల్ల మీక్కూడా టైం సేవ్ అవుతుంది. లంచ్ బాక్స్ మరీ చిన్న బాక్స్ లను ఎంచుకునే కంటే కాస్త పెద్దగా ఉండి, స్పూన్ తో తినేలా ఉంటే వాళ్ళు తినడానికి అనువుగా ఉంటుంది.

 

యూనిఫారం వేసుకునే విషయంలో …

మరీ ఎలిమెంటరీ స్కూల్ పిల్లలైతే ఇది చాలా కష్టమైన ఘట్టం, అందునా మొదటిరోజు. పిల్లలు ఓ పట్టాన కోఆపరేట్ చేయరు. మీరు ఒకవైపు డ్రెస్ వేస్తుంటే వాళ్ళు ఇంకో వైపు పరుగెడుతుంటారు. అలాంటప్పుడు విసుక్కోవడం, కసురుకోవడం లాంటివి కాకుండా వారి దృష్టిని ప్రేమగా మీవైపుకు తిప్పుకోవాలి. వారిని మాటల్లో పెట్టి వారిచ్చే సమాధానాలకు రియాక్ట్ అవుతూ టై, బెల్ట్, షూ వేసి నీట్ గా రెడీ చేయాలి. రెడీ అయ్యాక అద్దం ముందు నిలబెట్టి వాళ్ళు నీట్ గా ఉంటే ఎంత బావుంటారో వారికి అర్థమయ్యేలా చెప్పాలి. ఇలా చెప్పడం వల పిల్లల్లో చిన్నతనం నుండే పరిశుభ్రత పట్ల ఆసక్తి పెరుగుతుంది.

పుస్తకాలు సర్దిపెట్టడం

కొందరు పిల్లలకు హై స్కూల్ స్థాయికి వచ్చాక కూడా స్కూల్ బ్యాగ్ సర్దుకోవడం చేతకాదు. ఎన్నిసార్లు సర్దినా సాయంత్రం స్కూల్ నుండి తిరిగి వచ్చేసరికి మళ్ళీ పుస్తకాల పరిస్థితి గజిబిజీగానే ఉంటుంది. అలాంటప్పుడు కసురుకోకుండా, అలాగని మీరే సర్దిపెట్టడం లాంటివి చేయకుండా ప్రేమగా దగ్గర కూచోబెట్టుకుని మీరు అడ్వైజ్ చేస్తూ, లాంగ్ నోట్ బుక్స్ ని ఎలా సర్దాలి, ప్రయారిటీ వైజ్ గా , కావాలనుకున్నప్పుడు వెదుక్కోకుండా ఎలా సర్డుకోవాలో వారికి అర్థమయ్యేలా చెప్పాలి. దీనివల్ల వారి పుస్తకాలను ఎలా సర్డుకోవాలో అర్థమవుతుంది. మీకూ ఒక పనిభారం తగ్గుతుంది. బస్సు వచ్చేసమయానికి టెన్షన్ లేకుండా పిల్లలను స్కూల్ కి సిద్ధం చేయవచ్చు.

 

బస్సులో ఉన్నప్పుడు నియమాలు :

వీటిని మాత్రం పిల్లలకు రోజుకి ఒకసారైనా గుర్తు చేయాలి. సాధారణంగా స్కూల్ బస్సుల్లో పిల్లలు గొడవపడుతుంటారు. ఒక్కోసారి బస్సు కిటికీల్లోంచి చేతులు బయటికి పెట్టి ఆటలాడుతుంటారు. అలా చేయడం వల్ల జరిగే ప్రమాదాల్ని చెప్పి చిన్నగా హెచ్చరించాలి.

 

శుభ్రతా నియమాలు :

పిల్లల్లో పరిశుభ్రత గురించి అవగాహన చాలా అవసరం. బయట దొరికే వస్తువులను తినేస్తుంటారు, అలా కాకుండా స్కూల్ లో ఆకలేసినప్పుడు తినడానికి బిస్కెట్ ప్యాకెట్ ల లాంటివి పెట్టాలి, ఇంటి దగ్గరనుండి తీసుకెళ్ళిన తిండి పదార్థాలు మాత్రమే తినేలా వారిని ప్రోత్సహించాలి. కర్చీఫ్ వాడటం అలవాటు చేయాలి. టాయిలెట్ కి వెళ్ళిన తరవాత ఎలా ఫ్రెష్ అప్ అవ్వాలో వారికి అవగాహన కలిగించాలి.

 

టీచర్స్ , క్లాస్ మేట్స్ తో రిలేషన్ ..

పిల్లలు మానసికంగా ఎదగడానికి దోహదపడే అంశాల్లో ఇది చాలా ముఖ్యమైనది. పొద్దున్నే స్కూల్ కి పంపించాం, సమయానికి ఫీజులు కట్టాం లాంటివే కాకుండా పిల్లలు స్కూల్ లో తమ క్లాస్ మేట్స్ తో ఎలా మెలుగుతున్నారో కనుక్కుంటూ ఉండాలి,

                                           ఎవరితోనైనా శత్రుభావం పెంచుకుంటున్నారా..?, టీచర్స్ తో ఎలా మెలుగుతున్నారు , అన్న విషయాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. బర్త్ డే పార్టీలు సెలెబ్రేట్ చేసి తన ఫ్రెండ్స్ ని ఇన్వైట్ చేయడం లాంటివి చేస్తే పిల్లల్లో తోటివాళ్ళతో కలివిడిగా ఉండే అలవాటు అవుతుంది.

స్కూల్ నుండి తిరిగి వచ్చాక పడుకునేంత వరకు..

స్కూల్ నుండి తిరిగి రాగానే పిల్లలను గమనించాలి, ఇదివరకటి లాగే ఉత్సాహంగా ఉంటున్నారా..? లేక స్కూల్ పట్ల భయం లాంటివి పెట్టుకుని ఒత్తిడికి గురవుతున్నారా..? కొందరు పిల్లల్ని అడిగినా చెప్పకపోవచ్చు. మనమే కనిపెట్టాలి. హోం వర్క్ చేసేటప్పుడు వారి దగ్గరగా కూచుని వారికి వచ్చే డౌట్స్ తీరిస్తూ, హోం వర్క్ ఎక్కువగా ఉంటే స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా వారితో కబుర్లాడుతూ , మధ్యలో బ్రేక్ తీసుకునేటట్లు చేస్తూ, మొత్తానికి చదువు విషయంలో వాళ్ళు ఒంటరిగా ఫీల్ అవ్వకుండా, యు ఆర్ ద బెస్ట్ అని ప్రోత్సహించాలి.

పిల్లల్ని మంచి పౌరులుగా తీర్చిదిద్ది, వారిని ఉన్నత శిఖరాలకు చేర్చగలిగే విద్య, బాల్యం పట్ల శాపం కాకూడదు. స్కూల్, క్లాస్ మేట్స్ , టీచర్స్, హోమ్ వర్క్ పిల్లల రొటీన్ జీవితంలో కీలక అంశాలు, పిల్లలకు వీటితో సత్సంబంధాలు ఉండేలా జాగ్రత్తపడాలి. అవే వారి బంగారు భవిష్యత్తుకు నాంది.