నార్మల్ మెహందీనే అదిరిపోయే రంగులో పండాలంటే ఇలా చేస్తే చాలు..

 

గోరింటాకు భారతీయ మహిళలు ఎంతో ఇష్టంగా పెట్టుకుంటారు. పండుగకు, శుభకార్యాలకు, ఆషాడం వచ్చినప్పుడు ఇలా గోరింటాకు పెట్టుకోవడం కామన్.  ఒకప్పుడు చెట్టునుండి ఆకు కోసి, దాన్ని రుబ్బి  చందమామలు అంటూ చేతిలో చిన్న చిన్న ముద్దలు, చుక్కలు పెట్టుకునేవారు. గోరింటాకు ఎంత ఎర్రగా పండితే అంత మంచి మొగుడు వస్తాడంటూ అమ్మాయిల్ని ఆటపట్టించేవారు కూడా.  అయితే ఇప్పుడు మెహందీ కోన్ లు అందుబాటులోకి వచ్చాయి. కొందరు వీటిని వాడటానికి భయపడతారు. మరికొందరు గోరింటాకు పొడి తీసుకుని వారి క్రియేటివిటీ ఉపయోగించి సొంతంగా మెహందీ కోన్ లు తయారుచేస్తారు. మెహందీ కోన్ లు సొంతంగా తయారుచేసినా , బయట కొన్నవి  అయినా గోరింటాకు ముదురు రంగులో బాగా పండాలి అంటే కొన్ని సింపుల్ చిట్కాలు ఫాలో అవ్వాలి.

టీ నీరు..

గోరింటాకు ఇంట్లోనే తయారుచేస్తున్నట్టైతే దాన్ని కలిపేముందు సాధారణ నీటిని కాకుండా టీ నీటిని కలిపితే చక్కని ఫలితం ఉంటుంది.  టీ నీటినే టీ డికాక్షన్ అనికూడా అంటారు.  టీ పొడి నీళ్ళలో వేసి బాగా ఉడికించి ఈ నీటితో గోరింట పొడికలిపితే గోరింటాకు ముదురు రంగులో పండుతుంది.

నిమ్మరసం..

ఇంట్లోనే గోరింటాకు కోన్ తయారుచేసుకునేముందు గోరింట పొడిలో నిమ్మరసం కలపాలి. నిమ్మరసం గోరింట పొడితో చర్య జరిపి గోరింట ఎర్రగా పండేలా చేస్తుంది.

విక్స్..

గోరింటాకు పండిన తరువాత దాన్ని తొలగించిన తరువాత చేతులు వెంటనే నీటితో కడిగేయకుండా విక్స్ రాయడం వల్ల మంచి రంగు వస్తుంది.  

లవంగం..

లవంగాలతో చేతిరంగు ముదురుగా మార్చడం చాలా మందికి తెలిసిన ట్రిక్కే. చేతికి గోరింటాకు తొలగించాక  నీటితో కడిగేయకూడదు. రెండుమూడు లవంగాలను పెనం మీద వేసి వేడి చేయాలి. ఆ లవంగాలు పొగ విడుదల చేసినప్పుడు ఆ పొగను చేతులకు తగిలేలా చూడాలి. ఇలా చేస్తే చేతి రంగు బాగా ముదురుగా మారుతుంది.

ఆవాల నూనె..

చేతికి గోరింటాకు తొలగించిన తరువాత ఒక కాటన్ బాల్ తీసుకుని దాన్ని ఆవనూనెలో ముంచి ఆ నూనెను చేతికి రాసుకోవాలి. ఇలా చేస్తే గోరింట రంగు దట్టంగా ముదురుగా మారుతుంది.

                                                            *నిశ్శబ్ద.