పిల్లలు దుడుకుతనంగా తయారవ్వకూడదంటే...

పిల్లలలో దుడుకుతనం సహజమేకాక, స్వాభావికం కూడా. తన భద్రతకు, తన సంతోషానికి, తన వ్యక్తిత్వానికి ముప్పు వాటిల్లుతోందని అనిపించినప్పుడు పిల్లలు దుడుకుతనాన్ని ఆశ్రయిస్తుంటారు.

కారణాలు

పిల్లలు దుడుకుతనాన్ని ప్రదర్శించడానికి మనస్తత్వ శాస్త్రవేత్తలు రకరకాల కారణాల్ని వివరిస్తుంటారు. ప్రతి మనిషిలోనూ స్వతహాగా పోరాడేతత్వం వుంటుందనీ అది బాల్యంలో దుడుకుతనం ద్వారా ప్రదర్శితమవుతుంటుందనీ అంటారు కొందరు.

తల్లిదండ్రులు, సహోదరులు, సాటి పిల్లల నుంచి దుడుకుతనపు అలవాట్లు పిల్లలకు వంటపడతాయని అంటారు మరికొందరు. అలాగే పిల్లవాడు దుడుకుతనాన్ని ప్రదర్శించినప్పుడు పెద్దవాళ్లు మెచ్చుకోలు ద్వారా ప్రోత్సహాన్ని అందించుతోంటే కూడా అతనిలో ఆ స్వభావం జీర్ణించుకుపోతుంది.

దుడుకు చేష్టలపట్ల సమాజపు దృక్పథం కూడా మనుషుల్లో దుడుకు స్వభావాల్ని ప్రవేశపెడుతుంది. ఈ రోజుల్లో వెలువడుతున్న పాపులర్ సినిమాలు, నవలల్లో వయొలెన్స్ చూపించడం జరుగుతోంది. ఇలాంటి వాటివల్ల ఇతరులతో  దెబ్బలాడడం దుడుకు చేష్టలకు దారి చూపుతుంది. 

ఈ పై చెప్పిన కారణాలలో ఒక్కోటి ఒక్కో పిల్లాడిమీద తన ప్రభావాన్ని చూపి అతడిలో దుడుకు స్వభావానికి మూలకంగా పనిచేస్తుంది. పిల్లల్ని అతి గారాబంగా పెంచడం, అతి క్రమశిక్షణలో పెంచడం లాంటివి కూడా వాళ్లలో దుడుకు స్వభావానికి పునాదుల్ని వేస్తాయి. అతి గారాబం మంచిది కాదు పిల్లలు దుడుకుగా తయారుకావడానికి ఒక ముఖ్య కారణం అతి గారాబపు పెంపకం. మరీ గారాబంగా పెంచడంవల్ల పిల్లలకు రెండు రకాల నష్టం జరిగే అవకాశం వుంది. పిల్లవాడు పనికిమాలినవాడుగా, పిరికి వాడుగా తయారుకావచ్చు. పిల్లల్ని ఎంత గారాబంగా పెంచినా అవసరమైన సందర్భాలలో వాళ్లపట్ల ఖచ్చితంగానూ, కఠినంగానూ వ్యవహరిస్తుండాలి. కొన్ని రకాల దుడుకు పనుల్ని అనుమతించేది లేదని పిల్లవాడికి స్పష్టంగా తెలియజెప్పాలి. తోటి పిల్లల్ని చావగొట్టడం, బనాయిస్తూ ఏడిపించడం లాంటి పనులు చేయనివ్వకూడదు. 

మరీ భయభక్తులూ ఉండకూడదు

పిల్లలను మరీ భయభక్తులతో పెంచడం వల్ల కూడా దుడుకుతనం ఏర్పడడానికి ఆస్కారం వుంటుంది. మరీ భయభక్తులతో పెంచడం వల్ల పిల్లలు తీవ్రమైన ఫ్రస్ట్రేషన్లో పడిపోయి తల్లిదండ్రులమీద కలిగే తిరుగుబాటు భావాల్ని, కోపాల్ని ఇంట్లో ప్రదర్శించలేక బయటి సాటి పిల్లలమీద ప్రదర్శిస్తూ అగ్రెసివ్గా తయారవుతారు. ఇలాంటి పిల్లలలో ఎక్కువగా బాధ్యతారాహిత్యం తొంగిచూస్తుంటుంది.

సమర్ధించనివ్వకూడదు. 

అగ్రెసివ్ వుండే పిల్లలు బయట పిల్లలతో దెబ్బలాడి వచ్చినప్పుడు తమను తాము సమర్ధించుకోడానికి ప్రయత్నిస్తారు. అలా సమర్ధించుకోవడాన్ని తల్లిదండ్రులు అనుమతించకూడదు. ఖండించడానికి ప్రయత్నించాలి.

మూలకారణాన్ని వెతకాలి

పిల్లవాడు దుడుకు స్వభావాన్ని ప్రదర్శిస్తూ అగ్రెసివ్ ప్రవర్తిస్తున్నప్పుడు తల్లిదండ్రులు అందుకు మూలకారణం  ఏమై వుంటుంది అన్నది తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. అతడిని తాము విమర్శిస్తున్నారా ? అతడికి అవసరమైన ప్రోత్సాహం, మెచ్చుకోలులు లభించడంలేదా? శారీరకంగా ఏదన్నా అంగవైకల్యం వుంటే తోటిపిల్లలు అతణ్ణి గేలి చేస్తున్నారా ? లాంటివి తెలుసుకోవాలి. కొందరు పిల్లలు ఇంట్లో తాము కోరుకునే ప్రేమానురాగాలు లభించకపోతే అగ్రసేవ్ ధోరణిలో ప్రతిస్పందిస్తుంటారు.

కాబట్టి పిల్లాలు దుడుకుగా ఉండకూదంటే.. పైన చెప్పుకున్న విషయాలను పాటించాలి. 

                                      ◆నిశ్శబ్ద.