లలిత, గీత చాలా బాగా ఆడుతున్నారు. స్కోర్లో వాళ్ళే లీడ్ లో ఉన్నారు.

 

    "మనం వాళ్ళని సినిమాకు తీసికెళ్ళేలా ఉంది పరిస్థితి... ఏవంటారు...మిస్ రోష్ణి..." తలెత్తి రోష్ణి వేపు చూస్తూ అన్నాడు అవినాష్.

 

    "చచ్చినట్టు తీసికెళ్ళాలి..." గీత చాలా హుషారుగా అంది. కానీ రోష్ణి మాట్లాడలేదు. కానీ అవినాష్ అన్న మాటకు ఆ అమ్మాయి ఉడుక్కుంది. దాంతో పట్టింపు పెరిగింది.

 

    తర్వాత ఏదో "కాయిన్" వేసే మూడ్ లో ఉన్న అవినాష్ వేపు ఓరగా చూడడం, కళ్ళెత్తకుండానే, ఆమెవేపు చూడకుండానే అవినాష్ చూశాడు.

 

    ఆట చాలా రసవత్తరంగా ఉంది.

 

    'రెడ్' కోసం లలిత, గీత చాలా పట్టుదలతో ప్రయత్నిస్తున్నారు.

 

    'రెడ్' వాళ్ళకు దొరక్కుండా చెయ్యడానికి అవినాష్ చాలా ప్రయత్నిస్తున్నాడు. 'రెడ్' వస్తే మొదటి గేమ్ వాళ్ళు గెలుస్తారు.

 

    గీత 'రెడ్' కాయిన్ వేసింది. కానీ 'సపోర్ట్ కాయిన్' వెయ్యలేక పోయింది. ఆ తర్వాత హేండ్ అవినాష్ ది.

 

    'రెడ్' సెంటర్లో ఉంది.

 

    ఇద్దరికీ చెరో వైట్ అండ్ బ్లాక్ కాయిన్స్ ఉన్నాయి.

 

    'కట్ షాట్' కొట్టి అవినాష్ రెడ్ కాయిన్ వేశాడు.

 

    ఇంకా 'సపోర్ట్' కాయిన్ వెయ్యాలి.

 

    'కార్నర్ హోల్' లోకి 'ఎయిమ్' చేసి స్టయికర్ తో వైట్ కాయిన్ ని కొట్టాడు అవినాష్.

 

    వైట్ కాయిన్ ఒక్కసారి పైకెగిరింది. ఎదురుగా కూర్చున్న రోష్ణి, కంఠానికి తగిలి అది కిందకు పడిపోయింది.

 

    అది కంఠం దగ్గర్నించి జాకెట్లోకి పడిపోతుందని ఎవరూ ఊహించలేదు.

 

    రోష్ణి అసలు ఊహించలేదు. ఆ అమ్మాయి ఒక్కసారి సిగ్గుపడుతూ పైటను తీసి సర్దుకుంది.

 

    కానీ అప్పుడు ఆ గాభరాలో ఆ పైట ఆమె చేతుల్లోంచి జారి పక్కకు పడిపోయింది.

 

    రోష్ణి గాభరాకు అక్కడున్న ఆ ఆడపిల్లలిద్దరూ ఉప్పెనలా నవ్వారు.

 

    రోష్ణి ముఖం ఒక్కసారి జేవురించింది.

 

    విసురుగా లేచి నిలబడింది. నిలబడుతున్న సమయంలో ఆమె చూపులు, అవినాష్ కళ్ళమీద ఉన్నాయి.

 

    అప్పుడు అవినాష్ కళ్ళు ఎత్తైన ఆమె రొమ్ముల మీదున్నాయి. పక్కకు తిరిగి ఆ అమ్మాయి తన కుడిచేతిని జాకెట్టులోకి దోపి, ఆమె సౌందర్యరాశుల మధ్య చిక్కిపోయిన వైట్ కాయిన్ ని తీసి విసురుగా కేరమ్స్ బోర్డ్ మీదకు విసిరేసి, ఎర్రబడ్డ ముఖంతో అక్కడ నుంచి కొంచెం దూరంలో ఉన్న మండపం దగ్గరకు వెళ్ళిపోయి, అరుగుమీద కూర్చుంది.

 

    ఈ సంఘటనపై ఆ అమ్మాయిలిద్దరూ ఏం వ్యాఖ్యానించలేదు. వాళ్ళక్కూడా చాలా సిగ్గుగా ఉంది.

 

    ఏం మాట్లాడకుండా ఇద్దరూ కళ్ళతోనే సైగలు చేసుకుని లేచిపోయి మండపం దగ్గరకెళ్ళారు.

 

    అవినాష్ ఒక్కడే అయిపోయాడు. కాసేపు సిగరెట్ కాలుస్తూ కూర్చున్నాడు.

 

    ఒక అరగంట గడిచింది.

 

    మండపం వేపు చూశాడు.

 

    రోష్ణి ఒక్కటే ఒంటరిగా కూర్చుంది.

 

    తను కూడా లేచి అటువేపు నడిచాడు.

 

    పక్కకు తిరిగి కూర్చున్న రోష్ణి అడుగుల చప్పుడికి తలెత్తి మళ్ళీ తల తిప్పుకుంది.

 

    "ఆట మానేసి ఎందుకొచ్చేశారు..." ఆమెకు దూరంగా కూర్చుంటూ అన్నాడు అవినాష్.

 

    "ఎందుకొచ్చేశానో తెలీదా..." కోపంగా అంది రోష్ణి.

 

    "నాకిప్పటికీ తెలీడం లేదు..." చిరునవ్వును దాచుకుంటూ అన్నాడు అవినాష్.

 

    "మీరు నన్ను ఆటపట్టించాలానే ఆ కాయిన్ ని నాకు గురిచేసి కొట్టారు..." విసురుగా అంది రోష్ణి.

 

    "ఇది బాగానే ఉంది... అదెక్కడో తగిలి... ఎక్కడో పడితే నాదా బాధ్యత... మీకు మరీ కోపంగా ఉంటే... కేరమ్ బోర్డ్ దగ్గరికి రండి... మీరూ గురిచూసి కొట్టండి... అప్పుడైనా కోపం తగ్గుతుందేమో..."

 

    ఆ మాటకు రోష్ణి మెల్లగా నవ్వింది.

 

    నవ్వుతున్న ఆ ముఖం వేపు, ఆ సమయంలో ఆ కళ్ళవేపు చూశాడు అవినాష్.

 

    "మీరు చాలా బావుంటారు... మీకు తెల్సా... ముఖ్యంగా మీరు నవ్వుతున్నప్పుడు..." తన సహజధోరణిలో పొగిడాడు.

 

    "మీరు నవ్వుతున్నప్పుడైనా, మామూలుగానైనా చాలా అందంగా ఉంటారు... మీకు తెల్సా..."

 

    ఆ మాటకు లోలోపల ఆనందించినా, పైకి మాత్రం 'చాల్లేబడాయి' అన్నట్టుగా మూతి తిప్పింది.

 

    చాలాసేపు ఇద్దరూ మౌనంగా కూర్చున్నారు.

 

    మిగతా స్టూడెంట్లందరూ పొలోమని వచ్చేయడంతో మండపం మీద నుంచి లేచిపోయాడు అవినాష్.

 

    ఆ వెనకే రోష్ణి కూడా లేచింది.

 

    మాట్లాడకుండా రోష్ణివేపు ఒకసారి చూసి "నేనెప్పుడైనా పెళ్ళి చేసుకుంటే... మీలాంటి అందమైన అమ్మాయినే చేసుకుంటాను..." అని అన్నాడు.

 

    ఆ అమ్మాయి ఓరకంట అవినాష్ వేపు చూసింది కానీ ఏఁవన లేదు.

 

    తర్వాత-

 

    భోజనాల సమయంలో-

 

    "మరి మీరిద్దరూ మమ్మల్ని సిన్మాకెప్పుడు తీసికెళ్తున్నారు..." అడిగింది గీత, అవినాష్ ని.