ఆరోగ్యమే మనిషి ఎదుగుదలను నిర్దేశిస్తుంది. కెరీర్ లో కానీ, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత విషయంలో గాని ఆరోగ్యంగా ఉండే వారి ఆలోచనా విధానంలోను, అనారోగ్యంగా ఉన్న వారి ఆలోచనా విదానాల్లోను చాలా వ్యత్యాసం ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి కాన్ఫిడెంట్ గా ఉంటాడు. క్లిష్ట సమయాల్లో కంగారు పడకుండా సరైన నిర్ణయాలు తీసుకుంటాడు. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు, ఆరోగ్యంగా ఉన్నవారికి అన్ని సిరులు దక్కినట్టేనని దానర్థం .

బాధ్యతల నడుమ ఒత్తిడి వల్లనో , టైం లేకపోవడం వల్లనో, ఒక్కోసారి మనం ఆహారం గురించి అసలు పట్టించుకోం. ఆ చిన్నపాటి నిర్లక్ష్యం మనల్ని ఎన్నో రకాల వ్యాధులకు గురి చేస్తుంది. అందులో మొదటిది... 

ఐరన్ డెఫీషియన్సీ ఎనీమియా

ఐరన్ డెఫీషియన్సీ ఎనీమియా అనేది చాలా ప్రభావాన్ని చూపుతుంది. ఇది 6 నెలల పిల్లల నుండి వృద్ధుల వరకు కలగవచ్చు.ఈ ఐరన్ డెఫీషియన్సీ ఎనీమియా వల్ల త్వరగా అలసిపోవడం, ఏ పని చేయలేకపోవడం, చీటికి మాటికీ చిరాకు పడటం దానికి తోడు మనిషిలో సత్తువ తగ్గి ఉత్సాహం లేకుండా పోతుంది. ఫలితంగా దేనిపై కాన్సంట్రేట్ చేయలేరు

అధిక బరువు (ఒబెసిటీ )

ఒబెసిటీ ఇప్పుడు చాలా మందిలో పెద్ద సమస్యగా తయారయింది. ఇది ప్రత్యేకంగా పెద్దల్లోనే కాదు చిన్నపిల్లల్లోను కనిపిస్తుంది, దీనిని మనం ప్రారంభదశలోనే కంట్రోల్ లో ఉంచుకోకపోతే హార్ట్ డిసీజ్, హైపర్ టెన్షన్, మరియు క్యాన్సర్ వంటి వ్యాధులకు దారి తీస్తుంది

దంత క్షయం

దంత క్షయానికి దంతాలను పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం ఒక కారణమైతే, కాల్షియం లేకపోవడం కూడా మరో కారణం. దంత క్షయం తో మొదలై అనేక రకాల దంతాలకు సంబంధించిన ఇబ్బందులు కలుగుతాయి

పొట్టలో ఇబ్బంది

మనం తీసుకునే ఆహారంలో ఫైబర్ తగ్గితే కడుపులోని అవయవాల పై ప్రభావం పడుతుంది. ఫలితంగా మలబద్ధకం, అపెండిసైటిస్, అజీర్తి మరియు శ్వాసకోశవ్యాధులకు దారి తీస్తుంది

కొలెస్ట్రాల్

ఈ రోజుల్లో చాలా మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. ఇది ఎక్కువగా మనం తీసుకునే మాంసాహారం వల్ల మన శరీరంలో పేరుకుపోయే కొవ్వు కారణంగా వస్తుంది

హై బ్లడ్ ప్రెషర్

హై బ్లడ్ ప్రెషర్ సాధారణంగా శరీరంలో ఉప్పు శాతం పెరిగిపోయినా, లేదా మనం తీసుకునే ఆహారంలో కాల్షియం శాతం తగ్గినా ఎక్కువగా కనిపిస్తుంది. దీనిని అదుపులో ఉంచుకోకపోతే హైపర్ టెన్షన్ కి దారి తీస్తుంది.

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎప్పుడో ఒకసారి ఏవో వ్యాధులకు గురవుతూనే ఉంటాం, చికిత్సలు తీసుకుంటూనే ఉంటాం., కానీ పైన చెప్పిన ఆరోగ్య సమస్యలు మాత్రం కేవలం మనం తీసుకునే ఆహారంలో లోపాల వల్లే కలుగుతాయి. కాబట్టి మనం తీసుకునే ఆహారంలో అన్ని రకాల పోషకాలు సమపాళ్ళలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి

ఆరోగ్య పరిరక్షణకు మన ఆహారంలో తప్పనిసరిగా ఉండాల్సినవి: :

పాల ఉత్పత్తులు : పాలు, చీజ్, పెరుగు, మరియు ఐస్ క్రీమ్స్

మాంసకృత్తులు : మాంసం, చేపలు, గ్రుడ్లు.

గ్రేన్స్ : బ్రెడ్, పాస్తా , ధాన్యం.

పండ్లు, కూరగాయలు : జ్యూస్ రూపంలోగాని, వండిన లేదా అదే యధావిధిగా గాని.

 

తప్పనిసరిగా దృష్టిలో పెట్టుకోవాల్సినవి: :

  • మనం ప్రతిరోజూ తీసుకునే ఆహారంలో 20% పాల ఉత్పత్తులు తీసుకుని, తక్కిన 80% ఆహారంలో కూరగాయలు , పండ్లు, మాంసకృత్తులు ఉండేలా జాగ్రత్త పడాలి. ముఖ్యంగా ఫైబర్ కూరగాయల్లోను, పండ్లలోను పుష్కలంగా ఉంటుంది.

  • ప్రతిరోజూ మూడుపూటలా అన్నం తినాలి.

  • చాలా మంది టైం లేదనో, ఆలస్యంగా లేచామనో, ఏవేవో సాకులతో బ్రేక్ ఫాస్ట్ తినకుండా ఉండిపోతారు. కానీ అలా చేయడం వల్ల ఆలోచనా శక్తి మందగించే ప్రమాదముంది, దానికి తోడు శరీర భాగాలకు సరిపడా శక్తి అందక ఎనీమియాకి దారి తీస్తుంది. అందుకని బ్రేక్ ఫాస్ట్ కంపల్సరిగా తినాలి.

  • మన భోజనంలో కంపల్సరిగా ఏదో రూపంలో, పాలు, కూరగాయలు, పండ్లు ఉండేలా జాగ్రత్తపడాలి. కూరగాయలను, పండ్లను సలాడ్ రూపంలో నైనా సరే కనీసం రెండు సార్లు తీసుకోవాలి.

  • ముఖ్యంగా పిల్లల విషయంలో ఈ పద్ధతులను పాటించడం కాస్త కష్టమైన పనే. చిరుతిళ్ళకు అలవాటు పడి సరిగ్గా భోజనం దగ్గరే పేచీ పడతారు. వారికి చిరుతిళ్ళ విషయంలో ఫ్రూట్ సలాడ్ కానీ స్ప్రౌట్స్ కానీ బ్రెడ్, జాం లాంటివి అలవాటు చేయండి. ముఖ్యంగా భోజనానికి రెండు గంటలు ముందుగా ఎటువంటి స్నాక్స్ పెట్టొద్దు.

మనం తీసుకునే ఆహారంలో వీలైనంతగా కొవ్వు పదార్థాలు లేకుండా చూసుకోవాలి. .

  • కొవ్వు పదార్థాలను తగ్గించడం అంటే పాల ఉత్పత్తులను, మాంస కృత్తులను కాస్త తక్కువ మోతాదులో తీసుకోవడం. రోజులో రెండు పూటలకు మించి తినకూడదు.

  • మాంసం వండే ముందు స్కిన్ లెస్ ఉండేలా చూసుకోవడం మంచిది, తద్వారా కొవ్వును కాస్త అవాయిడ్ చేసుకోవచ్చు.

  • రెండు పూటలకు మించి పాలను తాగరాదు.

  • అలాగని కొవ్వు పేరుకుపోతుందన్న భయంతో పూర్తిగా మాంసకృత్తులకు,పాల పదార్థాలకు దూరంగా ఉండకూడదు. సరియైన మోతాదులో తీసుకుంటే శ్రేయస్కరం.

ఎనీమియా రాకుండా జాగ్రత్తలు

శరీరంలో ఐరన్ కొరత ఉన్నప్పుడే ఎనీమియా ఏర్పడుతుంది. మనం తీసుకునే ఆహారంలో తప్పకుండా ఐరన్ ఉండేటట్లు జాగ్రత్తలు తీసుకోవాలి. దానికన్నా ముందు ఏ ఆహారంలో ఐరన్ పాళ్ళు ఎక్కువగా ఉంటాయో ముందుగా తెలుసుకోవాలి. రెడ్ మీట్స్, చేపలు, పౌల్ట్రి మంచివి. ఆహారంలో రోజుకి ఒకసారైనా ఇవి తీసుకుంటే శరీరానికి కావలసిన ఐరన్ దొరికినట్టే. అందునా లివర్ ఐరన్ పుష్టిగా ఉన్న ఆహారం. కాకపొతే కొలెస్ట్రాల్ చాలా ఎక్కువగా ఉంటుంది. శాకాహారులు ఆకుకూరలు విరివిగా తినడం, కందగడ్డ, పీనట్ బటర్, ఎండు ద్రాక్ష, నల్ల ద్రాక్ష, తాజా కూరగాయలు ఆహారంలో తప్పకుండా ఉండేలా జాగ్రత్త పడాలి.  

వీలైనంత ఉప్పు వాడకాన్ని తగ్గించాలి .

సాధారణంగా హైపర్ టెన్షన్ ఉన్న వారు తప్ప తక్కిన వారు ఉప్పును నిర్భయంగా వాడవచ్చు. కానీ అవకాశం ఉన్నప్పుడల్లా కాస్త అవాయిడ్ చేయడం ఆరోగ్యానికి మంచిది.

చక్కర మోతాదును తగ్గించడం మంచిది.

తీపి తినడం ఆరోగ్యానికి హానికరమేమీ కాదు. కాకపోతే మనలో చాలా మంది తీపి వస్తువులను అస్తమానం తింటూనే ఉంటారు. అది మంచిది కాదు ఎందుకంటే అస్తమానం తీపి పదార్థాలను తినడం వల్ల కొరోనరీ ఆర్టరీ డిసీజ్ లేదా క్యాన్సర్ కి దారి తీసే అవకాశాలు ఉన్నాయి.

వ్యాయామానికి ముందు తీసుకోవాల్సిన ఆహారం

వ్యాయామానికి ముందు మాంసాహారం మంచిది కాదు, రెండు మూడు గంటలకు ముందుగా కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉన్న ఆహారం తీసుకుంటే మంచిది. ఈ కార్బోహైడ్రేట్లు బ్రెడ్, నూడుల్స్, ఆలుగడ్డ, మరియు రైస్ లో ఉంటాయి. ఆహారం తీసుకున్న రెండు గంటల తర్వాత వ్యాయామం చేయడం మంచిది.

ప్రతి 20 నుండి 30 నిమిషాలకొకసారి నీళ్ళు తాగుతుండటం ఉత్తమం