ఎప్పటికప్పడు స్పెషల్ గా...

ఆడపిల్లలు సహజంగా అందానికి, అలంకారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. స్పెషల్ అపియరెన్స్ తో కనిపించాలని కలలు కంటారు. ఆ కలలను నిజం చేసుకునేందుకు కృషి చేస్తారు. అందంగా, ఫ్యాషనబుల్ గా ఉండేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తుంటారు.

డ్రెస్ కాన్షస్ బాగా పెరిగింది. కాలేజ్, లేదా ఆఫీసుకి ఏ డ్రెస్ వేసుకోవాలి అని ఆలోచించడం పరిపాటి. ఎవరికి వారు తాము ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటున్నారు. అలాంటి స్పెషల్ అపియరెన్స్ కోసం తపిస్తూ, అందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక పెళ్ళిళ్ళు, పేరంటాల్లాంటి ప్రత్యేక సందర్భాలు వస్తే చెప్పనవసరం లేదు. గంటల తరబడి ఆలోచిస్తారు.

పూర్వం పండుగలు, పబ్బాలకు మాత్రమే కొత్త బట్టలు కొనుక్కునేవాళ్ళం. ఇప్పుడలా కాదు. ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడే, పరుగున వెళ్ళి కోనేసుకోవడం. చేతిలో నాలుగు రూపాయలు గలగలలాడితే, చలో షాపింగ్. ఇంట్లో పిల్లి పిల్లల్ని పెట్టిందా, కొత్త బట్టలు కొనుక్కోడానికో సాకు దొరికినట్టే. కుక్క పిల్లను ఇంటికి తెచ్చుకుని వారం రోజులయిందా, కొత్త డ్రెస్ కొనుక్కుని సెలెబ్రేట్ చేసుకోవాల్సిందే. కనుక ఇప్పుడు కొత్త బట్టలు కొనుక్కోడానికి పెద్ద అకేషన్లేం ఉండనక్కర్లా. ఎప్పటికప్పడు స్పెషల్ గా ఉండడమే సిసలైన ఎయిమ్.

పూర్వం ఫంక్షన్స్ లో బర్త్ డే బేబీ లేదా పెళ్ళికూతురు మాత్రమే మెరిసిపోయేవాళ్ళు. ఇప్పుడలా కాదు, అసలు వ్యక్తితో పాటు ఆ పార్టీకి వచ్చినవాళ్ళు కూడా చమకాయిస్తున్నారు. అదీ సంగతి. ఎప్పుడో ఓరోజు తళుక్కున మెరవడం కాదు, ప్రతిరోజూ తళతళలాడాలి, తళుకులీనాలి అనుకుంటున్నారు చిన్నాపెద్దా అందరూ.