బుజ్జి పాపాయి బాడీ లాంగ్వేజ్



అప్పుడే పుట్టిన పాపాయిని చేతుల్లోకి తీసుకోగానే... అప్పటి వరకు ఎన్నెన్నో పాత్రలని సమర్థవంతంగా పోషించి, అందరినీ మెప్పించిన అమ్మాయి కూడా బేలగా మారిపోతుంది. ఆ పసిప్రాణాన్ని ఎలా ఎత్తుకోవాలి, పాలు ఎలా త్రాగించాలి, బొజ్జ నిండిందా, లేదా? ఎలా తెలుసుకోవటం? మళ్ళీ ఆకలి వేస్తే ఎలా తెలుసుకోవాలి? ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు తనని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. అప్పటికీ ఇప్పుడు చాలాచోట్ల కాబోయే అమ్మ - నాన్నలకి క్లాసులు చెబుతున్నారు, డైపర్ కట్టడం నుంచి, పసిపిల్లలకి ఎలా స్నానం చేయించాలనే వరకు చెబుతున్నారు. అయినా సరే చాలామందిలో ఎన్నెన్నో సందేహాలు ఉంటూనే ఉన్నాయని అని అంటున్నారు డా. అనుపమ.

డాక్టర్ అనుపమ పసిపిల్లల వైద్యురాలు.  తల్లి కాబోయే ప్రతీ స్త్రీ అడిగే ప్రశ్నలు ఇంచుమించు ఒకేలాగే ఉంటాయని చెబుతున్నారు. అలా ఆమెకు తరచుగా ఎదురయ్యే ప్రశ్నలకి - సమాధానాలు ఈవిధంగా చెప్పారు.


1) పసిపిల్ల బొజ్జనిండా పాలు సరిపోయాయో లేదో అని బాధపడనక్కరలేద్దు.  బొజ్జ నిండకపోతే తనే ఏడుస్తుంది. బొజ్జనిండితే  హాయిగా నిద్రపోతుంది.


2)  పిల్లలు గుక్కలు పెట్టి ఏడుస్తుంటే ....రెండు చేతులతో పిల్లల చెవులు గట్టిగా మూస్తే - గుక్క తిప్పుకుంటారు. అప్పుడు వాళ్ళని బయట చల్లటి గాలిలో తిప్పితే ఏడుపు ఆపుతారు.

3) పిల్లలకి పడుకుని పాలు ఇవ్వకూడదు, పట్టకూడదు. కూర్చుని పాలు ఇచ్చి, ఇచ్చిన తరువాత భుజంపై వేసుకొని తేనుపు వచ్చాక పడుకోబెట్టాలి. ఈవిధంగా చెయ్యకపోతే పిల్లలు తాగిన పాలు కక్కే ఇబ్బంది ఉంది.

4) డైపర్ మార్చినప్పుడు శుభ్రంగా కడిగి, పొడిబట్టతో తుడిచి గాలికి ఆరనిచ్చి, పౌడర్ రాసి, అప్పుడు డైపర్ కట్టాలి. ఈవిధంగా చేస్తే, పిల్లలకి ఒరుపులు ఉండవు. పిల్లలని ఎంత శుభ్రంగా చూస్తే, అంత ఆరోగ్యంగా ఉంటారు.

-రమ