టాలీవుడ్ కి మరో రాజమౌళి దొరికినట్లేనా!
on Jun 6, 2023
కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్ గా ఎదగనున్నాడా అంటే, ఆయన అడుగులు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో మాత్రమే కాదు, ఇండియాలోనే టాప్ డైరెక్టర్ అంటే.. ముందుగా ఎస్.ఎస్. రాజమౌళి పేరు గుర్తుకొస్తుంది. 'బాహుబలి' ఫ్రాంచైజ్, 'ఆర్ఆర్ఆర్'తో ప్రపంచస్థాయిలో సంచనాలు సృష్టించాడు. అయితే రాజమౌళి ఒక్కో సినిమాకి ఎక్కువ సమయం తీసుకుంటాడు. ఇప్పటికే 'ఆర్ఆర్ఆర్' విడుదలై ఏడాది దాటిపోయింది. మహేష్ బాబుతో చేయనున్న తన తదుపరి చిత్రం మొదలు కావాలంటే మరో ఏడాది పట్టే అవకాశముంది. ఇక ఆ సినిమా విడుదల కావాలంటే మూడు నాలుగేళ్లు పట్టినా ఆశ్చర్యంలేదు. ఈ గ్యాప్ లో ప్రశాంత్ నీల్ టాలీవుడ్ లో సంచలనాలు సృష్టించేలా ఉన్నాడు.
'ఉగ్రం' అనే విజయవంతమైన కన్నడ చిత్రంతో దర్శకుడిగా ప్రయాణం మొదలుపెట్టిన ప్రశాంత్ నీల్.. 'కేజీఎఫ్' ఫ్రాంచైజ్ తో పాన్ ఇండియా రేంజ్ లో సంచలనం సృష్టించి, కన్నడ సినిమా స్థాయిని మరోస్థాయికి తీసుకెళ్లాడు. అయితే ఇప్పుడు ప్రశాంత్ నీల్ దృష్టి అంతా టాలీవుడ్ మీదే ఉంది. టాలీవుడ్ టాప్ స్టార్స్ తో వరుస భారీ ప్రాజెక్ట్ లు చేస్తున్నాడు. పైగా 'కేజీఎఫ్' ఫ్రాంచైజ్ కోసం ఎక్కువ సమయం తీసుకున్న నీల్, ఇప్పుడు మాత్రం స్పీడ్ పెంచేశాడు. ప్రస్తుతం ప్రభాస్ తో 'సలార్' చేస్తున్నాడు. దాని తర్వాత 'ఎన్టీఆర్ 31' చేయనున్నాడు. అలాగే 'సలార్' రెండో భాగం కూడా ఉందని ఇన్ సైడ్ టాక్. వీటితో పాటు డీవీవీ దానయ్య నిర్మాణంలో రామ్ చరణ్ తో ఓ సినిమా, దిల్ రాజు నిర్మాణంలో ప్రభాస్ తో మరో సినిమా కమిట్ అయ్యాడని సమాచారం. ఇలా టాలీవుడ్ హీరోలతో వరుస భారీ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు నీల్. మహేష్ తో రాజమౌళి చేయనున్న 'ఎస్ఎస్ఎంబి 29' విడుదలయ్యే లోపు, నీల్ డైరెక్ట్ చేసిన సినిమాలు కనీసం రెండు మూడు విడుదలయ్యే అవకాశాలున్నాయి. కన్నడ చిత్రం 'కేజీఎఫ్-2'తోనే 1000 కోట్ల క్లబ్ లో చేరాడు నీల్. అలాంటిది టాలీవుడ్ స్టార్స్ తో పాన్ ఇండియా సినిమాలు అంటే.. పాజిటివ్ టాక్ వస్తే చాలు 1000 కోట్లు అనేది చాలా చిన్న విషయం అవుతుంది. అప్పుడు టాలీవుడ్ లో నీల్ పేరు మారుమోగిపోతుంది అనడంలో సందేహం లేదు. మరి ముందు ముందు టాలీవుడ్ లో ప్రశాంత్ నీల్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
