ఆశ్చర్యపరుస్తున్న 'ఆదిపురుష్' టీం నిర్ణయం!
on Jun 6, 2023
రామాయణ పారాయణం జరిగే ప్రతిచోటకి హనుమంతుడు విచ్చేస్తాడు అనే నమ్మకం హిందువుల్లో ఉంది. అందుకే రామాయణ పారాయణం జరిగే చోట హనుమంతుడికి ప్రత్యేకంగా కుర్చీ ఏర్పాటు చేస్తుంటారు. మరి ఆ నమ్మకం ప్రకారం రామాయణం ఆధారంగా సినిమా చేస్తే , దానిని వీక్షించడానికి కూడా హనుమంతుడు వస్తాడు కదా. 'ఆదిపురుష్' చిత్ర బృందం కూడా అదే ఆలోచన చేసింది. 'ఆదిపురుష్' ప్రదర్శితమయ్యే ప్రతి థియేటర్ లోనూ హనుమంతుడి కోసం ఒక సీటు కేటాయించాలని నిర్ణయించింది.
ప్రభాస్ శ్రీరాముడిగా కనువిందు చేయనున్న చిత్రం 'ఆదిపురుష్'. టి.సిరీస్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకుడు. ఈ సినిమా జూన్ 16న భారీస్థాయిలో విడుదల కానుంది. అయితే విడుదలకు ముందు మేకర్స్ తీసుకున్న ఓ నిర్ణయం ఆశ్చర్యపరుస్తోంది. ప్రతి థియేటర్ లోనూ హనుమంతుడి కోసం ఒక సీటు కేటాయిస్తామని తాజాగా మేకర్స్ ప్రకటించారు.
"రామాయణ పారాయణం జరిగే ప్రతిచోటకి హనుమంతుడు విచ్చేస్తాడు అనేది మన నమ్మకం. ఈ నమ్మకాన్ని గౌరవిస్తూ 'ఆదిపురుష్' సినిమాని ప్రదర్శించే ప్రతి థియేటర్ లో ఒక సీటు విక్రయించకుండా హనుమంతుడి కోసం ప్రత్యేకంగా కేటాయించడం జరుగుతుంది. అతిగొప్ప రామ భక్తునికి గౌరవ మర్యాదలు సమర్పిస్తూ ఈ గొప్ప కార్యానికి శ్రీకారం చుట్టాం. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 'ఆదిపురుష్'ని హనుమంతుడి సమక్షంలో అందరం తప్పక వీక్షిద్దాం" అని మేకర్స్ తెలిపారు. 'ఆదిపురుష్' టీం తీసుకున్న ఈ నిర్ణయం గొప్పగా ఉందనే ప్రశంసలు దక్కుతున్నాయి. అదే సమయంలో ఇది పబ్లిసిటీ స్టంట్ అని కామెంట్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
