'కస్టడీ' ముందు భారీ టార్గెట్.. చైతన్య హిట్ ట్రాక్ లోకి వస్తాడా?
on May 10, 2023

నాగ చైతన్య, కృతి శెట్టి జంటగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'కస్టడీ'. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ లో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఈ నెల 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. టీజర్, ట్రైలర్ ఆకట్టుకోవడంతో ఈ చిత్రంపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. అయితే 'థాంక్యూ' వంటి డిజాస్టర్ తర్వాత కూడా చైతన్య నటించిన ఈ సినిమా దాదాపు రూ.22 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేయడం విశేషం. దీంతో చైతన్య ఈ సినిమాతో బ్రేక్ ఈవెన్ సాధించి మళ్ళీ హిట్ ట్రాక్ లోకి వస్తాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
'థాంక్యూ'కి ముందు వరుస విజయాలను అందుకున్నాడు చైతన్య. 'మజిలీ', 'వెంకీ మామ', 'లవ్ స్టోరీ', 'బంగార్రాజు' ఇలా వరుస సినిమాలు బ్రేక్ ఈవెన్ సాధించి బాక్సాఫీస్ విన్నర్స్ గా నిలిచాయి. అయితే గతేడాది జులైలో విడుదలైన 'థాంక్యూ' మాత్రం దారుణంగా నిరాశపరిచింది. 24 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన ఆ మూవీ ఐదు కోట్ల షేర్ కూడా రాబట్టలేక డిజాస్టర్ గా నిలిచింది. దీంతో 'కస్టడీ'పైనే చైతన్య ఆశలు పెట్టుకున్నాడు. ఈ మూవీ ఖచ్చితంగా హిట్ అవుతుందని బలంగా నమ్ముతున్నాడు. అందుకు తగ్గట్లే థియేట్రికల్ బిజినెస్ కూడా దాదాపు రూ.22 కోట్లు జరిగింది.
నైజాంలో రూ.7.50 కోట్లు, సీడెడ్ లో రూ.2.20 కోట్లు, ఆంధ్రాలో రూ.8.50 కోట్ల బిజినెస్ చేసిన 'కస్టడీ'.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి 18.20 కోట్ల బిజినెస్ చేసింది. ఇక రెస్టాఫ్ ఇండియా రూ.1.2 కోట్లు, ఓవర్సీస్ లో రూ.2.4 కోట్లు కలిపి వరల్డ్ వైడ్ గా రూ.21.80 కోట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడయ్యాయి. మరి ఈ సినిమా చైతన్యకు ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



