పూరి ఏం చేయబోతున్నాడు.. 'జనగణమన' పరిస్థితేంటి?
on Aug 26, 2022

టాలీవుడ్ లో ఫాస్ట్ గా సినిమాలు చేసే డైరెక్టర్ గా పూరి జగన్నాథ్ కి పేరుంది. మొదటి సినిమా 'బద్రి'(2000) నుంచి 'ఇస్మార్ట్ శంకర్'(2019) వరకు ప్రతి సంవత్సరం పూరి డైరెక్ట్ చేసిన కనీసం ఒక్క సినిమా అయినా విడుదలైంది. అయితే 'లైగర్'కి మాత్రం ఎప్పుడూ లేనంతగా చాలా టైమ్ తీసుకున్నాడు. 'ఇస్మార్ట్ శంకర్' విడుదలైన మూడు సంవత్సరాలు తర్వాత 'లైగర్' విడుదలైంది. ఇంత టైమ్ తీసుకున్న ఈ సినిమా ప్రేక్షకులను దారుణంగా నిరాశపరిచింది. దీంతో ఇప్పుడు పూరి నెక్స్ట్ మూవీపై ఆసక్తి నెలకొంది.
విజయ్ దేవరకొండ హీరోగా 'లైగర్'ను తెరకెక్కించిన పూరి.. ఆ సినిమా విడుదల కాకముందే విజయ్ తో 'జనగణమన' అనే మరో సినిమాని ప్రకటించాడు. అంతేకాదు 2023 ఆగస్టు 3న విడుదల చేస్తామని రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. దీంతో 'లైగర్' రిజల్ట్ పై ఎంతో నమ్మకం ఉంది కాబట్టే మరో సినిమాని ప్రకటించి, రిలీజ్ డేట్ కూడా చెప్పారన్న అభిప్రాయం వ్యక్తమైంది. కానీ 'లైగర్' విడుదల తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 'లైగర్' పూరి, విజయ్ కెరీర్స్ లో భారీ ప్లాప్ గా మిగిలే అవకాశముంది. దీంతో వీరి కాంబోలో 'జనగణమన' ఉంటుందా? ఆగిపోతుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన పూరి టాలెంట్ ని ఒక్క ప్లాప్ తో తక్కువ అంచనా వేయలేం. విజయ్ కూడా పూరిని తక్కువంచనా వేసి ప్రాజెక్ట్ నుంచి తప్పుకునే అవకాశం లేదు. అయితే అసలు ఈ ప్రాజెక్ట్ విషయంలో పూరి ఎలా ముందుకు వెళ్లనున్నాడనేదే ఇప్పుడు ఆసక్తికర విషయం.
'జనగణమన' పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ అన్న సంగతి తెలిసిందే. దానిని బట్టే అర్థ చేసుకోవచ్చు అది ఎంత పవర్ ఫుల్ స్టోరీనో. పైగా మిలిటరీ నేపథ్యంలో తెరకెక్కనున్న యాక్షన్ ఫిల్మ్. పూరి కరెక్ట్ గా శ్రద్ధ పెట్టి రాసి, తీస్తే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించే అవకాశముంది. మరి పూరి తన రెగ్యులర్ స్టైల్ లోనే ఫాస్ట్ గా ఫినిష్ చేసి 2023 ఆగస్టు 3కి విడుదలయ్యేలా చేస్తాడో లేక 'లైగర్' షాక్, డ్రీమ్ ప్రాజెక్ట్ వంటి కారణాలతో స్క్రిప్ట్ కి ఎక్కువ టైమ్ తీసుకొని ఆలస్యంగా వస్తాడో చూడాలి. ఇటీవల పూరి సైతం ఇకపై తన నుంచి ఫాస్ట్ గా సినిమాలు రావని, టైమ్ తీసుకొని చేస్తానని అన్నాడు. పూరి చెప్పినట్లు స్క్రిప్ట్ కి ఎక్కువ టైమ్ తీసుకుంటే మాత్రం అద్భుతాలు సృష్టిస్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



