'అశోకవనంలో అర్జున కల్యాణం'.. విష్వక్సేన్ కొత్త సినిమా టైటిల్!
on Apr 16, 2021
విష్వక్సేన్ హీరోగా నటిస్తోన్న ఏడవ సినిమాకు చాలా వైవిధ్యమైన టైటిల్ ఖరారు చేశారు. ఆ టైటిల్.. 'అశోకవనంలో అర్జున కల్యాణం'. నూతన దర్శకుడు విద్యాసాగర్ చింతా రూపొందిస్తోన్న ఈ మూవీని శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర డిజిటల్ బ్యానర్‌పై బాపినీడు బి., సుధీర్ ఈదర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బీవీఎస్ఎన్ ప్రసాద్ ప్రెజెంటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా నేడు ప్రారంభమైంది.
శుక్రవారం సాయంత్రం టైటిల్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్లో ఓ బ్రిడ్జిపై వెళ్తున్న ఆర్టీసీ బస్సు కనిపిస్తోంది. టైటిల్ డిజైన్ కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. రెండు పిట్టలు పక్కపక్కన కూర్చొని ఉంటే, మూడో పిట్ట ఎగురుకుంటూ వెళ్తోంది.
టైటిల్ ప్రకారం విష్వక్సేన్ క్యారెక్టర్ పేరు అర్జున్ అని తెలుస్తోంది. అశోకవనం అనేది హీరోయిన్‌కు సంబంధించిన ప్రాంతాన్ని సూచించే సంకేతంగా ఊహించవచ్చు. అశోకవనంలో సీత ఒంటరిగా ఉండి, తన శ్రీరాముడు ఎప్పుడు వస్తాడా అని ఎదురుచూస్తూ ఉంటుందని మనం రామాయణంలో చదువుకున్నాం. ఈ అశోకవనంలోనూ హీరోయిన్ అలా తన అర్జునుడి కోసం ఎదురుచూస్తుంటుందేమో! హీరోయిన్ ఎవరనేది ఇంకా ప్రకటించలేదు.
లవ్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ మూవీకి రవికిరణ్ కోలా స్క్రిప్టును అందించగా, జయ్ క్రిష్ సంగీతం సమకూరుస్తున్నాడు. పవిత్రన్ సినిమాటోగ్రాఫర్‌గా, విప్లవ్ నైషాడం ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు.
విష్వక్సేన్ హీరోగా దిల్ రాజు సమర్పిస్తోన్న 'పాగల్' మూవీ విడుదలకు సిద్ధమవుతోంది.