ఆ ఒక్కడి కోసమే 'విరాట పర్వం' సినిమా చేశాను
on Jun 13, 2022

రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'విరాట పర్వం'. జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో విరాట పర్వం ఆత్మీయ వేడుక వరంగల్ లో జరిగింది. పలువురు సినీ రాజకీయ ప్రముఖులు అతిథులుగా విచ్చేసిన ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ వేడుకలో డైరెక్టర్ వేణు మాట్లాడుతూ.. "ఏ ప్రాంతంలో అపజయాలు కూడా అగ్ని జ్వాలలై మండుతాయో.. ఏ ప్రాంతంలో మరణాలు కూడా మహా కావ్యాలై పుడతాయో.. ఆ ప్రాంతమే ఓరుగల్లు. ఇక్కడ 1992 లో జరిగిన ఓ మరణం నన్ను కదిలించింది. ఒక మహా సంక్షోభం నన్ను ఆలోచింప చేసింది. ఆ మరణం వెనక రాజకీయ కారణాలు ఉన్నాయి. ఆధిపత్య రాజకీయాలు, ప్రత్యాన్మాయ రాజకీయాల సంఘర్షణ ఆ సంఘటన కారణం కావడంతో నేను దానిని ఎలాగైనా సినిమాగా తీయాలనుకున్నా. దానికి ప్రేమని జోడించి ఓ మహాకావ్యంలా మీ ముందుకు తీసుకొచ్చాను. అదే విరాట పర్వం. వెన్నెల పాత్రలో సాయి పల్లవి నటించడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. మట్టి ముద్దను కూడా బాంబులా మలిచే పాత్రలో రానా నటించారు. ఇలాంటి సినిమాలు చేయడానికి ఏ హీరో ముందుకు రాడు. కానీ ఆయన చేశాడు. అది ఆయన గొప్పతనం. ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు. నా ప్రొడ్యూసర్స్ నాకు బ్రదర్స్ లా అండగా నిలిచి నన్ను ముందుకు నడిపించారు" అన్నారు.
రానా మాట్లాడుతూ.. "ఈ సినిమా ఎందుకు చేస్తున్నారు సార్ పెద్ద యాక్షన్ సినిమా చేయొచ్చు కదా అని చాలా మంది నన్ను అడుగుతూ ఉండేవారు. చాలామంది చాలాసార్లు సినిమా ఎందుకు చేస్తారంటే చప్పట్ల కోసం, విజిల్స్ కోసం, ఫ్యాన్స్ కోసం. కానీ ఈసారి నేను ఈ సినిమా ఎందుకు చేశానంటే.. ఆ చప్పట్ల మధ్యలో నిశ్శబ్దంగా కూర్చొని ఇది నిజమే కదా అని ఒకడు నమ్మి చూస్తాడు. ఆ ఒక్కడి కోసమే నేను సినిమా చేశాను. అంత రియల్ గా, అంత అద్భుతంగా వేణు గారు రాశారు. ఆయన అన్నట్లుగా తెలంగాణలో కట్టెపుల్లని పట్టుకున్న కవిత్వం వస్తుందని అనేది ముమ్మాటికీ నిజం. ఇలాంటి తెలంగాణ కథలు ఇంకా ఎన్నెన్నో మనం చెప్పాలి." అన్నారు.
సాయి పల్లవి మాట్లాడుతూ.. "వరంగల్ కి ఎప్పుడు వచ్చినా నా ఇంటికి వచ్చినట్లే అనిపిస్తుంది. లాస్ట్ టైం 'శ్యామ్ సింగ్ రాయ్' కోసం వచ్చినప్పుడు కూడా ఇంతే ప్రేమ అందించారు. ఇది మన మట్టిలో పుట్టి పెరిగిన వాళ్ళ కథ. ఇలాంటి హానెస్ట్ స్టోరీలను మనం ఆదరించాలి. ఇలాంటివి ఆదరిస్తేనే ముందు ముందు ఇలాంటివి చేయాలన్న ఉత్సాహం ఉంటుంది. మీ ప్రేమకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఇలాంటి కథల ద్వారానే నేను నా ప్రేమను మీకు చూపించగలుగుతాను." అన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



