ENGLISH | TELUGU  

ప్రముఖ సినీ నటి విజయభాను మృతి..అమెరికా నుంచి వచ్చి మరి ఇండియాలోనే 

on Jun 7, 2025

విజయభాను అనే పేరుతో ఒక నటీమణి ఉండేవారని, తెలుగు సినిమా రంగంలో విజయపతాకం ఎగురవేయడమే కాకుండా... తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ నటించి మెప్పించారని ఈతరం వారికి తెలియకపోవచ్చు. కానీ 70వ దశకంలో ఒక వెలుగు వెలిగి అప్పటి అగ్ర కథానాయకులందరి సినిమాల్లోనూ నటించారు విజయభాను. ముఖ్యంగా అప్పట్లో రాజబాబు, విజయభాను  జంటకి  ఒక రేంజ్ లో క్రేజ్ ఉండేదని చెబుతారు.

కేవలం పదేళ్ల వ్యవధిలోనే వందకు పైగా సినిమాలు చేసి "విజయభానా మజాకా" అనిపించుకుని తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ నటించి  అప్పట్లోనే "పాన్ ఇండియా పాపులర్ యాక్ట్రెస్"గా పేరు గడించిన విజయభాను ఇటీవల ఇండియాకు వచ్చి తిరిగి అమెరికాకు వెళ్లకుండా, తిరిగి రాని లోకాలకు తరలిపోయారు. ఆమె వయసు 68.. ఆమె ఏకైక కుమార్తె అమెరికాలోని ఓ ప్రఖ్యాత విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. విజయభాను స్వస్థలం అనంతపురం కాగా, అయితే ఆమె పుట్టింది,పెరిగింది, పేరు తెచ్చుకుంది చెన్నైలోనే!

కెరీర్ పీక్స్ లో ఉండగానే ఓ అమెరికన్ తో పీకల్లోతు ప్రేమలో పడిపోయి కెరీర్ తో పాటు ఇండియాని విడిచిపెట్టి అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో స్థిరపడిపోయారు. స్వతహా నాట్యకారిణి కావడంతోపాటు "నాట్యమయూరి" బిరుదాంకితురాలైన విజయభాను లాస్ ఏంజెల్స్ లో "శ్రీ శక్తి శారదా నృత్యనికేతన్" పేరుతో నృత్య కళాశాల స్థాపించి, వేలాది మందికి శిక్షణ ఇచ్చారు. మన భారతీయ నాట్యకళలైన "భరతనాట్యం, కూచిపూడి, కథక్, కథాకేళి" వంటి అన్ని నృత్యరీతులలోనూ నిష్ణాతురాలైన విజయభాను ప్రపంచవ్యాప్తంగా లెక్కకు మించి నాట్య ప్రదర్శనలు ఇచ్చి ఉండడం విశేషం. మన తెలుగు సినిమా రంగం నుంచి అమెరికాలోని లాస్ ఏంజిల్స్ ఎవరు వెళ్లినా  విజయ భాను ఎంతో ఆత్మీయంగా ఆతిధ్యమిచ్చేవారు.

అమెరికా కోడలుగా మారి, అక్కడే స్థిరపడినప్పటికీ భారతీయ మూలాలు ఎన్నడూ మరువని ఈ భరతమాత ముద్దుబిడ్డ. అనంతపురంలో ఆమె మాతృమూర్తి కట్టించిన "శివ నారాయణ పంచముఖ ఆంజనేయ దేవాలయం" అభివృద్ధికి ఇతోధికంగా సాయం చేశారు. సేవాదృక్పధం, మానవతావాదం మెండుగా కలిగిన ఈ "అనంతపురం ఆడపడుచు" తన సహాయం కోరి వచ్చిన వందలాది మంది జీవితాల్లో వెలుగులు నింపారు. గత నెలలో ఇండియా పర్యటనకు వచ్చి, చెన్నైలోని తన ఇంటిని చూసుకునెందుకు వెళ్లిన విజయభాను... ఎండ వేడి తట్టుకోలేక వడదెబ్బకు లోనై అర్ధాంతరంగా అశువులు బాశారు. "తన ఇంట్లో చనిపోవడం కోసమే ఆమె పనిగట్టుకుని అమెరికా నుంచి ఇండియా వచ్చారా అనిపించే విధంగా, ఎక్కడైతే ఆమె ఒంటరిపోరాటంతో ఒక నటిగా, విరాజిల్లారో, అక్కడే మృత్యువు ఒడిలో ఒంటరిగా ఒదిగిపోయారు.

చిరంజీవి, కమల్ హాసన్, జయసుధలతో కె. బాలచందర్ తెరక్కించిన దృశ్యకావ్యం "ఇది కథ కాదు" చిత్రలో కీలక పాత్ర పోషించి ప్రేక్షకుల మనసు దోచుకున్న విజయభాను ఆ చిత్రంలో కనబరిచిన అత్యుత్తమ నటనకు "ఉత్తమ సహాయ నటి"గా నంది పురస్కారం అందుకున్నారు. నాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి చేతుల మీదుగా "నాట్యమయూరి" బిరుదునూ అందుకున్నారు. "నిప్పులాంటి మనిషి (ఎన్ఠీఆర్), ఇది కథ కాదు (చిరంజీవి - కమల్ హాసన్), కిలాడి బుల్లోడు (శోభన్ బాబు), ఒక నారి వంద తుపాకులు (విజయ లలిత), చందన (హీరోగా రంగనాద్ మొదటి చిత్రం),, ప్రియబాంధవి (శారద), స్త్రీ (కృష్ణంరాజు), శభాష్ పాపన్న (జగ్గయ్య), చిన్నికృష్ణుడు" (జంధ్యాల - ఘట్టమనేని రమేష్ బాబు) తదితర చిత్రాలు విజయభాను పేరు ఆరోజుల్లో మారుమ్రోగేలా చేశాయి!!

విజయభాను గురించి అమెరికా లోనే స్థిరపడిన ఆమె సోదరి "కలైమామణి డా. సిందూరి జయసింఘే" మాట్లాడుతు "మా అక్క నిజంగా ఒక దేవత. ఒక పోరాట శక్తి. ఎన్నో కుటుంబాలకు ఆమె జీవనజ్యోతి. ఎందరికో ఆదర్శమూర్తి. ఆమెకు నివాళిగా, అత్యంత స్ఫూర్తిదాయకమైన ఆమె జీవితంపై ఒక పుస్తకం తీసుకురావాలని మేము సంకల్పించాం. జయప్రదగారు మా అక్కకు చాలా సన్నిహితురాలు. చెన్నైలో నిర్వహించిన మా అక్క దశదినకర్మకి కూడా వారు హాజరయ్యారు. మా అక్క ప్రేరణతోనే నేనూ అమెరికా వచ్చి, ఇక్కడే స్థిరపడి నేను కూడా డాన్స్ ఇనిస్టిట్యూట్ నడుపుతున్నాను. అక్కతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నవారందర్నీ కలిసి అక్క పుస్తకాన్ని వీలైనంత సమగ్రంగా తీసుకు రావాలని భావిస్తున్నాం" అన్నారు. విజయభాను ఆకస్మిక మృతి పట్ల ప్రముఖ కథానాయకి మాజీ పార్లమెంటు సభ్యురాలు జయప్రద, ప్రముఖ నటులు సుమన్, ప్రముఖ దర్శకనిర్మాత వై.వి.ఎస్.చౌదరి తదితరులు ప్రగాఢ సంతాపం తెలిపారు.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.