నిన్నటి తరం హాస్యనటులు సారథి కన్నుమూత
on Aug 1, 2022

సీనియర్ యాక్టర్, అనేక సినిమాల్లో తనదైన శైలి హాస్యనటనతో అలరించిన సారథి కన్నుమూశారు. ఈరోజు తెల్లవారుజాము 2.30 గంటలకు హైదరాబాద్‌లోని సిటీ న్యూరో సెంటర్‌లో ఆయన తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుమారుడు కె.ఎల్. ప్రశాంత్ సమాచారం అందించారు. గత కొన్ని రోజులుగా మూత్రపిండాల సమస్యతో ఆయన చికిత్స పొందుతూ వచ్చారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. పూర్తి పేరు కడలి జయసారథి.
నందమూరి తారకరామారావు నటించి, దర్శకత్వం వహించిన 'సీతారామ కల్యాణం' (1961) చిత్రంలో నలకూబరుని పాత్ర ధరించడం ద్వారా సారథి వెండితెరకు నటునిగా పరిచయమయ్యారు. తన కెరీర్‌లో 370కి పైగా చిత్రాల్లో నటించారు. ఎక్కువగా హాస్యపాత్రలు ధరించారు. తెలుగు చిత్రసీమ మద్రాసు నుంచి హైదరాబాద్‌కు తరలి రావడంలో ఆయన కూడా క్రియాశీల పాత్ర పోషించారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) వ్యవస్థాపక సభ్యుల్లో ఆయన ఒకరు. అంతే కాక, ఆంధ్రప్రదేశ్ సినీ కార్మికుల సంఘానికి వ్యవస్థాపక కోశాధికారి.
ఋష్యేంద్రమణి, స్థానం నరసింహారావు, రేలంగి వెంకట్రామయ్య, పద్మనాభం వంటి గొప్ప నటులతో కలిసి నాటకాలలో నటించారు సారధి. ఆయన చిత్ర నిర్మాత కూడా. ధర్మాత్ముడు, అగ్గిరాజు, శ్రీరామచంద్రుడు చిత్రాలను నిర్మించారు. రెబల్ స్టార్ కృష్ణంరాజుతో ఉన్న సాన్నిహిత్యంతో గోపికృష్ణ మూవీస్ బ్యానర్‌లో నిర్మించిన చిత్రాలకు సారధి సాంకేతిక వ్యవహారాలను చూసుకునేవారు. చిత్రపురి కాలనీ నిర్మాణంలోనూ సారధి కీలక పాత్ర పోషించారు. ఈరోజు మధ్యాహ్నం ఆయన అంత్యక్రియలు ఫిల్మ్‌నగర్‌లోని మహాప్రస్థానంలో జరగనున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



