సింగర్స్ పరిస్థితి మరీ ఇంత నీచమా??
on Apr 10, 2017
చిత్రసీమలో హీరో, హీరోయిన్లకు అదిరిపోయే పారితోషికాలుంటాయి. అవి కాక.. ఫైవ్ స్టార్ వసతులు అదనం. దర్శకుల సంగతైతే ఇక చెప్పక్కర్లేదు. సినిమాకి పది కోట్లు పారితోషికంగా తీసుకొనేవాళ్లూ ఉన్నారు. అయితే సినీ పరిశ్రమలో అందరి పరిస్థితీ ఇంతే అని చెప్పలేం. కొంతమంది దగ్గరైతే గీచి గీచి బేరాలు ఆడేవాళ్లున్నారు. మరీ ముఖ్యంగా గాయనీ గాయకులకు అతి తక్కువ స్థాయిలో పారితోషికాలు అందుతున్నట్టు సమాచారం.
స్టార్ గాయకుల మాటేమోగానీ.. కొత్తగా ఈ రంగంలోకి అడుగుపెట్టిన ప్రతిభావంతులకు మాత్రం పారితోషికం విషయంలో అన్యాయమే జరుగుతోందని తెలుస్తోంది. బోల్డంత ప్రతిభ ఉండి, చేతిలో హిట్ గీతాలున్న ప్రణవి లాంటి సింగర్స్‌కి ఒక్కో పాటకు ఐదు వేలకు మించి ఇవ్వడం లేదని తెలుస్తోంది. ఇదే విషయాన్ని ప్రణవి కూడా ఒప్పుకొంది. తనకే కాదు.... తన స్థాయి ఉన్న గాయనీమణులకు చాలా తక్కువ పారితోషికాలు అందుతున్నాయని వాపోతోంది. కొంతమంది రెండు వేలకు, మూడు వేలకు పాట పాడమని బేరాలు ఆడుతున్నార్ట.
కేవలం తెరపై పేరు చూసుకోవాలన్న తపన ఉన్న గాయకులు పాటల్ని ఉచితంగా పాడడానికి ముందుకొస్తున్నారని, దాంతో తనలాంటి సింగర్స్‌కి సరైన పారితోషికాలు అందడం లేదని వాపోతోంది ప్రణవి. సంగీత దర్శకులు సినిమా మొత్తాన్ని ఓ ప్యాకేజీలా తీసుకొంటున్నారు. వాళ్లే గాయనీ గాయకులకు, గీత రచయితలకు పారితోషికాలు ఇస్తున్నారు. ఒకరిద్దరు సంగీత దర్శకులు మినహా.. మిగిలిన వాళ్లెవ్వరూ గాయనీ గాయకులకు సరైన పారితోషికాలు ఇవ్వడం లేదని, పరిశ్రమలో అసలు సింగర్స్ అంటే లెక్కేలేదని, బయట వేదికలపై పాడడమే బెటర్ అని కొంతమంది గాయకులు వాపోతున్నారు.