ఉద్వేగంతో ఊపేస్తోన్న 'జననీ ప్రియభారత జననీ' పాట!
on Nov 26, 2021

"జననీ ప్రియభారత జననీ.. నీ పాదధూళి తిలకంతో భారం ప్రకాశమవనీ.. నీ నిష్కళంక చరితం నా సుప్రభాతమవనీ.. ఆ నీలి నీలి గగనం శత విస్ఫులింగమయమై.. ఆ హవనగంగ ధ్వనులే హరినాశ గర్జనములై.." అంటూ ఒక ఉద్వేగంతో, ఒక ఉద్రేకంతో శక్తిమంతంగా సాగిన పాట వచ్చింది. యస్.యస్. రాజమౌళి డైరెక్ట్ చేస్తోన్న 'ఆర్ఆర్ఆర్' మూవీలోని 'జనని' పాట ఇది. "The Soul Anthem of RRR" అంటూ వచ్చిన ఈ సాంగ్‌లో ప్రధాన పాత్రధారులంతా ఒక దిగ్భ్రాంతికరమైన, ఒక బీభత్సకరమైన దృశ్యాన్ని కళ్లు విప్పార్చి చూస్తుండటం కనిపిస్తుంది. వాళ్లు దేన్ని చూసి అలాంటి ఎమోషన్‌కు గురయ్యారో తెలీదు కానీ, ఈ పాట చూస్తుంటే మనం కూడా ఒక ఉద్వేగంతో ఊగిపోతాం.
ఒక షాట్‌లో చేతిలో గన్ పట్టుకొని వున్న భర్త అజయ్ దేవ్‌గణ్‌తో "మరి మీరు?" అని శ్రియ అడిగితే, "సరోజినీ.. నేనంటే నా పోరాటం.. అందులో నువ్వు సగం" అని చెప్పాడు అజయ్, ఆమె వంక తీక్షణంగా చూస్తూ. ఆమె కళ్లు నీటితో తడిశాయి.

ఇంకో షాట్‌లో జనం అంతా కకావికలంగా పరిగెత్తుతుంటే తూటాలు పేలుతున్న శబ్దం వినిపిస్తోంది. ఒక పాపను ఎత్తుకొని పెరిగెత్తుతున్న వ్యక్తికి తూటా తగిలి గాల్లోకి ఎగిరి, చేతిలోని పాపను వదిలేస్తే, ఆ పాప కిందపడకుండా మరో వ్యక్తి అందుకొని కిందకు దొర్లడం కనిపించింది. ఇంకో షాట్‌లో పారిపోతున్న అబ్బాయి ఛాతీకి బుల్లెట్ తగిలి నేలకు ఒరిగిపోతుంటే, అతని కంటే ముందు పరిగెత్తుతున్న శ్రియ వెనక్కి తిరిగి చూసింది. అబ్బాయి కిందపడి కళ్లు తెరుచుకుని అలాగే చూస్తున్న దృశ్యం మనల్ని వెన్నాడుతుంది. ఆ తూటాలు బ్రిటీషర్ల గన్‌ల నుంచి వచ్చినవని ఊహించవచ్చు.
మూడు నిమిషాల నిడివున్న 'జనని' పాట చూస్తుంటే.. మనలోనూ ఒక దిగ్భ్రాంతి కలుగుతుంది, మన ఒళ్లూ జలదరిస్తుంది. కీరవాణి స్వరపరిచి, స్వయంగా రాసిన ఈ పాటను కోరస్‌తో కలిసి ఆయనే పాడారు. సినిమాలో ఒక కీలక ఘట్టానికి సంబంధించి మాంటేజ్ సాంగ్‌గా జననీ సాంగ్ వస్తుందని ఊహించవచ్చు.

కొమురం భీమ్ పాత్రధారి జూనియర్ ఎన్టీఆర్ ఒక షాట్‌లో జైల్లో ఉన్నట్లు, ఇంకో షాట్‌లో ముస్లిం వేషధారణలో ఉన్నట్లు కనిపించగా, అల్లూరి రామరాజు పాత్రధారి రామ్‌చరణ్ ఒకసారి బ్రిటిష్ సైనిక దుస్తుల్లో, ఇంకోసారి సాధారణ దుస్తుల్లో కనిపించాడు. ఇద్దరూ ఒక విషాద సన్నివేశానికి సాక్షీభూతంగా నిలిచినట్లు వారి హావభావాలను బట్టి తెలుస్తోంది. రామ్‌చరణ్ నుదుటన అలియా భట్ తిలకం దిద్దడం చూడొచ్చు. పాట చివరలో యుద్ధానికి సిద్ధమవుతున్నట్లు ఒంటి మీద చుట్టుకున్న వస్త్రాన్ని అజయ్ దేవ్‌గణ్ తొలగించడం కనిపిస్తోంది.

జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో పాన్ ఇండియా మూవీగా 'ఆర్ఆర్ఆర్' విడుదలకు సిద్ధమవుతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



