ENGLISH | TELUGU  

'ఆర్ఆర్ఆర్' రిలీజ్ డేట్‌.. అజ‌య్ దేవ్‌గ‌ణ్ అప్సెట్‌!

on Jan 27, 2021

 

జూనియ‌ర్ ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా య‌స్‌.య‌స్‌. రాజ‌మౌళి రూపొందిస్తోన్న ప్రెస్టీజియ‌స్ ఫిల్మ్ 'ఆర్ఆర్ఆర్‌: రౌద్రం ర‌ణం రుధిరం' రిలీజ్ డేట్ వ‌చ్చేసిన విష‌యం తెలిసిందే. ఫ్యాన్స్ ఎంత‌గానో ఎదురుచూస్తున్న ఆ తేదీ.. అక్టోబ‌ర్ 13. ద‌స‌రా కానుక‌గా ఆ సినిమాని రిలీజ్ చేయాల‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు భావించారు. రాజ‌మౌళి స్వ‌యంగా రిలీజ్ డేట్‌ను త‌న సోష‌ల్ మీడియా హ్యాండిల్ ద్వారా ప్ర‌క‌టించారు. అయితే అక్టోబ‌ర్ 13న 'ఆర్ఆర్ఆర్‌'ను రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించ‌డం అనైతిక‌మంటూ బాలీవుడ్ సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ బోనీ కపూర్ ఆరోపించ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు, 'ఆర్ఆర్ఆర్' రిలీజ్ డేట్‌ను ఆ సినిమాలో ఓ కీల‌క పాత్ర పోషించిన అజ‌య్ దేవ్‌గ‌ణ్ ట్విట్ చేయ‌క‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఎందుకంటే.. ఆయ‌న హీరోగా బోనీ క‌పూర్ ప్రొడ్యూస్ చేస్తున్న 'మైదాన్' మూవీని అక్టోబ‌ర్ 15న విజ‌య‌ద‌శ‌మి రోజున విడుద‌ల చేస్తున్న‌ట్లు ఆర్నెల్ల క్రిత‌మే ప్ర‌క‌టించారు. అందులో ఫుట్‌బాల్ కోచ్‌గా ప్ర‌ధాన పాత్ర‌ను దేవ్‌గ‌ణ్ పోషిస్తున్నాడు. దీంతో 'ఆర్ఆర్ఆర్‌'తో 'మైదాన్' పోటీప‌డాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. రాజ‌మౌళి సినిమా అంటే ఉండే క్రేజ్ వేరు క‌నుక 'మైదాన్' క‌లెక్ష‌న్ల‌కు 'ఆర్ఆర్ఆర్' గండికొడుతుంద‌ని బోనీ భ‌య‌ప‌డుతున్నారు.

కాగా, 'ఆర్ఆర్ఆర్' రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసే ముందు ఓసారి బోనీని సంప్ర‌దించ‌మ‌ని రాజ‌మౌళికి అజ‌య్ దేవ్‌గ‌ణ్ సూచించాడ‌నీ, కానీ బోనీని సంప్ర‌దించుకుండానే ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశార‌నీ తెలుస్తోంది. ఈ విష‌యాన్ని బోనీ స్వ‌యంగా వెల్ల‌డించారు. "ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయ‌బోతున్నార‌ని ఓ రోజు ముందు అజ‌య్‌కు తెలిసింది. అక్టోబ‌ర్ 15న మైదాన్‌ను రిలీజ్ చేస్తున్న‌ట్లు నేనెప్పుడో అనౌన్స్ చేశాను కాబ‌ట్టి, ఆ సినిమా నిర్మాత‌లను నాతో మాట్లాడ‌మ‌ని చెప్పిన‌ట్లు అజ‌య్ తెలిపారు. నాతో మాట్లాడి ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దుకోమ‌ని వాళ్ల‌కు సూచించారు. కానీ వాళ్లు నాతో మాట్లాడ‌లేదు. అందుకే 'ఆర్ఆర్ఆర్' రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్‌ను అజ‌య్ ట్వీట్ చేయ‌డం కానీ, రిట్వీట్ చేయ‌డం కానీ చేయ‌లేదు" అని బోనీ చెప్పారు.

అంతేకాదు, ఈ విష‌యం మాట్లాడేందుకు తాను దేవ్‌గ‌ణ్‌కు ఫోన్ చేసిన‌ట్లు బోనీ తెలిపారు. "త‌ను షూటింగ్‌లో బిజీగా ఉండ‌టం వ‌ల్ల నా కాల్‌ను రిసీవ్ చేసుకోలేదు. త‌ర్వాత కాల్ చేశారు. 'ఆర్ఆర్ఆర్' రిలీజ్ డేట్ అనేది త‌న చేతుల్లో ఏమీ లేద‌నీ, అది ఆ సినిమా నిర్మాత‌లు, డిస్ట్రిబ్యూట‌ర్లు క‌లిసి తీసుకున్న నిర్ణ‌య‌మ‌నీ చెప్పారు. డిస్ట్రిబ్యూట‌ర్ల నుంచి వ‌చ్చిన ఒత్తిడి వ‌ల్లే నిర్మాత ఆ డేట్ ఫిక్స్ చేశార‌ని అజ‌య్ తెలిపారు" అని వెల్ల‌డించారు బోనీ.

'ఆర్ఆర్ఆర్' మూవీలో ఎలాంటి రెమ్యూన‌రేష‌న్ తీసుకోకుండా అజ‌య్ దేవ్‌గ‌ణ్ న‌టించిన విష‌యం ఇక్క‌డ ప్ర‌స్తావ‌నార్హం. రాజ‌మౌళి మీద గౌర‌వంతో తాను ఉచితంగా న‌టించినా, ఇప్పుడు త‌న సినిమాపైనే 'ఆర్ఆర్ఆర్'‌ను పోటీకి దింపుతుండ‌టం ఆయ‌న‌కు బాధ క‌లిగించింద‌ని ఆయ‌న స‌న్నిహిత వ‌ర్గాలు అంటున్నాయి.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.