దిల్ రాజుకి సంక్రాంతి షాక్.. తెలుగు సినిమాలకే థియేటర్లు!
on Nov 13, 2022

'వాల్తేరు వీరయ్య'తో చిరంజీవి, 'వీర సింహా రెడ్డి'తో బాలకృష్ణ సంక్రాంతి బరిలోకి దిగుతున్నారు. మరోవైపు దిల్ రాజు తాను నిర్మించిన తమిళ చిత్రం 'వారిసు'(వారసుడు)ని సంక్రాంతికే విడుదల చేస్తున్నాడు. డబ్బింగ్ సినిమా అయినప్పటికీ దిల్ రాజు సినిమా కావడంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో విడుదల కానుంది. దీంతో 'వాల్తేరు వీరయ్య', 'వీర సింహా రెడ్డి' సినిమాలకు థియేటర్ల కొరత ఏర్పడుతుంది. గతంలో పండుగకు తెలుగు సినిమాలు ఉండగా డబ్బింగ్ సినిమాలకు థియేటర్స్ ఎలా ఇస్తాం అని వ్యాఖ్యలు చేసిన దిల్ రాజు ఇప్పుడు మరి సంక్రాంతికి తెలుగు సినిమాలుంటే 'వారసుడు'ని ఎలా రిలీజ్ చేస్తున్నాడని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సైతం దిల్ రాజుకి షాకిచ్చింది. సంక్రాంతి, దసరా పండుగలకు స్ట్రెయిట్ తెలుగు సినిమాలకు మాత్రమే ధియేటర్స్ ఇవ్వాలంటూ గతంలో తీసుకున్న నిర్ణయాన్ని తెలియజేస్తూ తాజాగా ప్రెస్ నోట్ విడుదల చేసింది.

"తెలుగు చలన చిత్రాల పెరిగిన నిర్మాణ వ్యయము దృష్టిలో పెట్టుకొని మరియు నిర్మాత శ్రేయస్సు కోరి తెలుగు సినిమాని కాపాడుకుందాం అనే లక్ష్యంతో తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి 08-12-2017 తేదీన జరిగిన సమావేశంలో, "సంక్రాంతి, దసరా పండుగలకు స్ట్రెయిట్ తెలుగు సినిమాలకు మాత్రమే ధియేటర్స్ ఇవ్వాలి" అని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ విషయమై, ప్రముఖ నిర్మాత మరియు ఛాంబర్ ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్ దిల్ రాజు 2019 సంవత్సరంలో మీడియా ద్వారా "స్టెయిట్ సినిమాలు ఉండగా డబ్బింగ్ సినిమాలకు థియేటర్స్ ఎలా ఇస్తాం" అని ఘాటుగా వ్యాఖ్యలు చేసి, ఆ ప్రకారమే స్ట్రెయిట్ సినిమాలకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ మిగిలిన వాటిని డబ్బింగ్ సినిమాలకు కేటాయించాలని తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ నిర్ణయాన్ని విధిగా అమలుపర్చాలని.. సంక్రాతి, దసరా పండుగల సమయంలో స్టెయిట్ తెలుగు చిత్రాలకు ప్రధమ ప్రాధ్యానత ఇస్తూ ఎక్కువ థియేటర్స్ ని కేటాయించాలని, మిగిలిన వాటిని మాత్రమే డబ్బింగ్ సినిమాలకు కేటాయించాలని తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి తరఫున ఎక్సిబిటర్స్ ను కోరుచున్నాము" అంటూ గౌరవ కార్యదర్శులు టి.ప్రసన్నకుమార్, మోహన్ వడ్లపట్ల పేర్లతో ప్రెస్ నోట్ విడుదలైంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



