ప్రముఖ రచయిత కులశేఖర్ ఎంత దుర్భర పరిస్థితుల్లో ఉన్నాడో
on Aug 1, 2017
సినిమా....బయట నుండి చూసే వాళ్ళకి రంగుల ప్రపంచం... కృష్ణ వంశీ ఖడ్గం సినిమాలో చెప్పినట్టు ఒక్క ఛాన్స్ కోసం అర్రులు చాచి చూస్తున్న వాళ్ళు లెక్కలేనంత మంది. అందులో అవకాశాలు దొరికేది ఎంత మందికి... దొరికిన అవకాశాన్ని సరిగా అంది పుచ్చుకునేది ఎంత మంది... ఇక్కడ సక్సెస్ పాళ్ళు ఎంత... మనం ఎంత సేపు గెలిచినోడి చరిత్ర చూస్తాం కానీ... ఇండస్ట్రీ లో ఓడిన వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా... ఇక్కడ బ్రతికే క్రమంలో కొందరు ఆడవాళ్లు తప్పుడు దారులు వెతుకుతుంటే, పెద్ద సంఖ్యలో మగవాళ్ళు మాత్రం కూడుకి, గుడ్డకి నానా అవస్థలు పడుతున్నారు... మహామహులు సైతం ఆకలితో దేహం వదిలిన సందర్భాలు కోకొల్లలు.
ఇక అసలు విషయానికి వస్తే, ఒకప్పుడు ప్రముఖ పాటల రచయితగా అతి తక్కువ సమయంలో ఉన్నత శిఖరాలకు ఎదిగిన కులశేఖర్ ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో చూస్తే కళ్ళు చెమ్మగిల్లక మానవు. కులశేఖర్ తండ్రి వృత్తి రీత్యా వైజాగ్ లోని ఒక గుడిలో పౌరోహిత్యం చేసేవారు. సినిమా మీద ఉన్న మక్కువతో మొదట జర్నలిస్ట్ గా హైదరాబాద్ వచ్చి, తర్వాత లిరిసిస్ట్‌గా మారి, ఇంతలోనే ఇంతింతై వటుడింతై అన్నంతగా ఎదిగాడు.
పాటలు మాత్రమే రాసుకుంటూ ఉండి ఉంటే కులశేఖర్ ఉన్నతంగా ఉండేవారు. కానీ విధి వైపరీత్యాన్ని ఎవరు మాత్రం తప్పించుకోగలరు. దర్శకుడి అవతారం ఎత్తి, ఆ సినిమా కోసం అహర్నిశలూ పాటు పడ్డాడు. కానీ, అనుకున్న మజిలీ చేరుకోక పోవడంతో, అప్పుల బాధలు మరొక వైపు ఇబ్బంది పెట్టిన సమయంలో దాదాపు పిచ్చి వాడిగా మారాడు. ఒక గుడిలో శఠగోపం దొంగలించి ఆరు నెలల జైలు శిక్ష అనుభవించాడు.
విడుదలై ఇంటికి వచ్చిన తర్వాత కులశేఖర్ గుర్తుపట్టనంతగా మారిపోయారు. పూర్తిగా బక్క చిక్కి, నల్లగా మారిపోయి, ఇంకెవరో అన్నట్టుగా కనిపిస్తున్నాడు. కానీ, అదృష్టవశాత్తూ ఆయన సాధారణ స్థితికి వచ్చారు. ఇప్పుడు తాను మంచి కండిషన్ లో ఉన్నానని పాటలు రాయగలనని చెప్పుకుంటున్నాడు. బట్, ఆయనని నమ్మి పాట రాయించుకుని ధైర్య సాహసాలు ఎవరూ చేయడం లేదు. ఇండస్ట్రీ పెద్దలు తమ మనిషి మీద చల్లని చూపు కురిపిస్తారని ఆశిద్దాం.