6 రోజుల్లో ‘లిటిల్ హార్ట్స్’ ఎంత కలెక్ట్ చేసిందో తెలిస్తే షాక్ అవుతారు!
on Sep 11, 2025
1984లో ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మించిన తొలి సినిమా ‘శ్రీవారికి ప్రేమలేఖ’. అప్పటి నుంచి కుటుంబ సమేతంగా చూడదగ్గ అనేక సినిమాలు నిర్మించిన ఈ సంస్థ ద్వారా 2015లో విడుదలైన చివరి సినిమా ‘దాగుడుమూత దండాకోర్’. 31 సంవత్సరాల్లో వివిధ భాషల్లో 80 సినిమాలు నిర్మించింది ఈ సంస్థ. 2015 తర్వాత ఈనాడు గ్రూప్ నిర్మించిన సినిమాలేవీ థియేటర్లలో రిలీజ్ అవ్వలేదు. అయితే ఈటీవీ విన్ నిర్మించిన కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. పది సంవత్సరాల తర్వాత ఈ సంస్థ నిర్మించిన ‘లిటిల్ హార్ట్స్’ థియేటర్లలో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
సెప్టెంబర్ 5న విడుదలైన ‘లిటిల్ హార్ట్స్’ చిత్రం మొదటి షోకే సూపర్‌హిట్ టాక్ తెచ్చుకుంది. ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా యూత్‌లో ఈ సినిమా టాక్ బాగా స్ప్రెడ్ అవుతోంది. తద్వారా కలెక్షన్లు బాగా పెరుగుతున్నాయి. ‘90స్ మిడిల్ క్లాస్ బయోపిక్’ ఫేమ్ మౌళి తనూజ్ హీరోగా, ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ ఫేమ్ శివాని నాగరం హీరోయిన్‌గా నటించిన ‘లిటిల్ హార్ట్స్’ చిత్రానికి ‘90స్ మిడిల్ క్లాస్ బయోపిక్’ దర్శకుడు ఆదిత్య హాసన్ నిర్మాతగా వ్యవహరించగా, సాయి మార్తాండ్ దర్శకత్వం వహించారు. ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. వాస్తవానికి ఈ సినిమాను ఈటీవీ విన్‌లో రిలీజ్ చేయాలనుకున్నారు.
ఫైనల్ ఔట్‌పుట్ చూసిన తర్వాత థియేటర్లలో రిలీజ్ చేస్తే రెస్పాన్స్ బాగుంటుందని ఆ ప్రపోజల్‌ను నిర్మాత బన్నీ వాస్ దగ్గరకు తీసుకెళ్లారు. ఆయన వంశీ నందిపాటితో కలిసి ఈ సినిమాను 2 కోట్లకు కొనుగోలు చేసి రిలీజ్ చేశారు. ఈ సినిమా రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించడం విశేషం. మొదటి షో నుంచే హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో రన్ అవుతున్న ఈ సినిమా ఆరో రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.2.75 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇండియాలో 1153 షోలు వేయగా రూ.1.93 కోట్లు వసూలు చేసింది. ఇప్పటివరకు వరల్డ్ వైడ్‌గా రూ.21 కోట్లు సాధించింది. మరికొన్ని రోజుల్లో రూ.25 కోట్ల మార్క్‌ను చేరుకుంటుందని ట్రేడ్‌వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా ఒక చిన్న సినిమా ఈ స్థాయి విజయం సాధించడంతో చిన్న నిర్మాతలకు ‘లిటిల్ హార్ట్స్’ ఎంతో ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



