వారసత్వ హీరోలకు ఇదో శాపమా??
on Sep 16, 2016
.jpg)
వారసత్వం ఓ వైల్డ్‌కార్డ్ ఎంట్రీ. హీరో కొడుకు ఈజీగా హీరో అయిపోవొచ్చు. అందుకు తలుపులు ఎప్పుడూ తెరచే ఉంటాయి. వారసులు హీరోలుగా వస్తున్నారంటే ఎన్నెన్ని అంచనాలు ఉంటాయో?? స్టార్ హీరో కుటుంబం నుంచి మరో కథానాయకుడు వస్తున్నాడంటే... అందరి దృష్టి ఆ సినిమాపైనే ఉంటుంది. ఎలా నటిస్తాడు? ఎలా డాన్సులు చేస్తాడు? ఎంత పెద్ద హిట్టు కొడతాడు? అంటూ లెక్కలు వేసుకొంటారు. తద్వారా సినిమాకి వద్దన్నా పబ్లిసిటీ వచ్చిపడిపోతుంటుంది. అయితే.. ఇలాంటి హైప్ వల్ల సినిమాలకు నష్టమే తప్ప లాభాలు ఉండవన్నది టాలీవుడ్ చరిత్రని తిరగేసినవాళ్లెవ్వరికైనా ఇట్టే తెలిసిపోతుంటుంది. వారసత్వం ఎంట్రీగా చూపించి వచ్చిన హీరోలందరికీ దాదాపుగా ఫస్ట్ సినిమా జర్క్ ఇచ్చింది. ఫ్లాప్‌తోనే తమ కెరీర్‌ని మొదలెట్టి ఆ తరవాత టాప్ స్టార్లుగా మారినవాళ్లు ఎంతోమంది. వాళ్లందరి గురించి ఓసారి రివైండ్ చేసుకొంటే..?
పవన్ కల్యాణ్ తొలి చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ సినిమా.. ఓ మాదిరిగా ఆడిందంతే. ఈవీవీ ఫుల్ ఫామ్ లో ఉన్నప్పుడు తీసిన సినిమా ఇది. దానికి తోడు చిరంజీవి తమ్ముడుగా పవన్ ఎంట్రీ ఇచ్చిన తొలి సినిమా. పైగా పవన్ ఈ సినిమాలో తన టాలెంట్లన్నీచూపించేశాడు. అయినా ఈ సినిమా హిట్ అనిపించుకోలేదు. ఎన్టీఆర్ తొలి సినిమా నిన్ను చూడాలని అట్టర్ ఫ్లాప్ అయ్యింది. తాతయ్య పోలికలున్నాయన్న ఒక్క మాట తప్పించి.. ఎన్టీఆర్ ప్రతిభలోని ఏ కోణమూ ఈ సినిమా బయటకు తీసుకురాలేకపోయింది. రెండో సినిమా కూడా ఇలానే ఫ్లాప్ అయితే.... నిజంగానే ఎన్టీఆర్ జనం అప్పుడే మర్చిపోయేవాళ్లు..
ఈశ్వర్‌తో రంగ ప్రవేశం చేసిన ప్రభాస్‌కి.. తొలి సినిమాతోనే ఫ్లాప్ ఎదురైంది. అల్లు అర్జున్ గంగోత్రి చూసిన వాళ్లెవ్వరైనా బన్నీ ఈస్థాయిలో రాణిస్తాడని ఊహించి ఉండరు. అల్లు శిరీష్ తొలి సినిమా గౌరవం కూడా ఫ్లాపే. రామ్‌చరణ్ డెబ్యూ మూవీ చిరుతో ఓ మాదిరిగా ఆడిందంతే. గోపీచంద్ తొలి చిత్రం... తొలి వలపు కూడా ఫ్లాపే. మహేష్‌బాబు రాకుమారుడు అటు హిట్టుకీ, ఇటు ఫ్లాపుకీ మధ్యన ఆగిపోయింది. కల్యాణ్ రామ్ కీ ఇలాంటి అనుభవమే ఎదురైంది. హీరోగా తన తొలి సినిమా అభిమన్యు అట్టర్ ఫ్లాప్. ఆ తరవాత అతనొక్కడే రావడం వల్ల తేరుకోగలిగాడు. అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన హీరోలంతా తొలి సినిమాతో చేదు అనుభవాలను ఎదుర్కొన్నవాళ్లే.
ముఖ్యంగా నాగచైతన్య జోష్ సినిమా పూర్తిగా నిరాశ పరిచింది. భారీ అంచనాల మధ్య వచ్చిన అఖిల్ తొలి చిత్రం అఖిల్ డిజాస్టర్ల జాబితాలో చేరిపోయింది. ఆ సినిమా ఎఫెక్ట్ నుంచి అఖిల్ ఇంత వరకూ తేరుకోలేకపోయాడు. ఆ మాటకొస్తే నాగార్జున తొలి సినిమా విక్రమ్ కూడా అంతంత మాత్రంగానే ఆడింది. రానా లీడర్ జస్ట్ యావరేజ్ అనిపించుకొంది. మంచు హీరోల పరిస్థితి కూడా ఇంతే. విష్ణు, మనోజ్, మంచులక్ష్మి తొలి చిత్రాలు ఫ్లాప్స్ అయ్యాయి. ఇప్పుడు శ్రీకాంత్ తనయుడి నిర్మలా కాన్వెంట్ కూడా ఫ్లాప్ జాబితాలో చేరిపోయింది. దాంతో వారసత్వం చూపించి వచ్చిన హీరోలందరికీ తొలి సినిమా ఫ్లాప్ అవ్వడం సెంటిమెంట్‌గా మారిందేమో అనిపిస్తోంది.
సాధారణంగా వారసుల తొలి చిత్రాలకు కేర్ ఎక్కువగా ఉంటుంది. కథల ఎంపికలో జాగ్రత్తగా అడుగులేయాల్సి ఉంటుంది. హీరోలంతా అదే చేశారు కూడా. మంచి దర్శకుల్ని, మంచి కథల్ని ఎంచుకొని తమ వంతు ప్రయత్నాలు చేశారు. కానీ ఫలితం మాత్రం తేడా కొట్టింది. ఫ్యాన్స్ ఎక్కువగా ఊహించుకొని థియేటర్లకు వెళ్లడం ఒక ప్రమాదం అయితే... అంచనాలకు తగిన కథల్ని ఎంచుకోకపోవడం మరో పెద్ద లోపం. కొంతమంది ఓవర్ కాన్పిడెన్స్‌కి పోయి ఫ్లాపులు తెచ్చుకొన్నారు. హీరోల వారసులు హీరోలుగా రాణించడం అంత తేలిక కాదన్న విషయం తొలి అడుగులోనే తెలిసిపోవడం ఓరకంగా మంచిది కూడా. అప్పుడైనా కాస్త ఒళ్లు దగ్గర పెట్టుకొని కథల్ని ఎంచుకొనే ఛాన్స్ ఉంటుంది.
ఆ విషయం తెలియాలనే... వీళ్ల తొలి సినిమాలు ఫ్లాపులు అయ్యాయేమో? తొలి సినిమా సరిగా ఆడకపోయినా పవన్, ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్, బన్నీ, గోపీచంద్ వీళ్లంతా స్టార్లుగా మారారు కదా? రాబోయే తరం కూడా అంతేనేమో? తొలి సినిమా ఫ్లాప్ అవ్వడం మంచిదే అనుకొంటూ... ముందడుగు వేస్తారేమో?
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



