‘మిరాయ్2’లో విలన్‌గా టాలీవుడ్ హీరో.. టైటిల్ ఏమిటో తెలుసా?
on Sep 12, 2025
మెగాస్టార్ చిరంజీవి మూవీ ‘చూడాలని వుంది’ చిత్రంలో రెండేళ్ళ వయసులోనే బాలనటుడిగా చిత్ర రంగ ప్రవేశం చేశాడు తేజ సజ్జ. ఆ తర్వాత బాలనటుడిగానే దాదాపు పాతిక సినిమాల్లో నటించాడు. 2009లో ‘7 డేస్ ఇన్ స్లో మోషన్’ అనే ఇంగ్లీష్ మూవీలో బాలనటుడిగానే ప్రధాన పాత్ర పోషించాడు. 10 సంవత్సరాల గ్యాప్ తర్వాత సమంత ప్రధాన పాత్ర పోషించిన ‘ఓ బేబీ’ చిత్రంలో నటించాడు. హీరోగా తేజ నటించిన తొలి సినిమా ‘జాంబిరెడ్డి’. ఇది తెలుగులో వచ్చిన తొలి జాంబి మూవీ. ఈ సినిమా సూపర్‌హిట్ అయి తేజకు మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత ‘ఇష్క్’, ‘అద్భుతం’ చిత్రాల్లో నటించినప్పటికీ ఆశించిన స్థాయిలో అప్రిషియేషన్ రాలేదు. 2024లో ప్రశాంత్‌వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘హనుమాన్’ చిత్రంలో సూపర్‌హీరోగా నటించి ఒక్కసారిగా పాన్ ఇండియా హీరోగా టర్న్ అయ్యాడు తేజ. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ సాధించి కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టించింది.
‘హనుమాన్’ తర్వాత కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో సూపర్ యోధగా ‘మిరాయ్’ చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు తేజ. ఈ సినిమా మొదటి షో నుంచే బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకొని విజువల్ వండర్‌గా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ సినిమాతో హీరోగా తేజ సజ్జ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇప్పుడు అందరి దృష్టీ తేజపైనే ఉంది. అతనితో సినిమాలు చేసేందుకు నిర్మాతలు క్యూ కడుతున్నారు. అయితే ప్రస్తుతం హనుమాన్‌కి సీక్వెల్‌గా వస్తున్న జై హనుమాన్, జాంబిరెడ్డి2 చిత్రాలను తేజ పూర్తి చెయ్యాల్సి ఉంది. మిరాయ్ చిత్రాన్ని నిర్మించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ జాంబిరెడ్డి2 చిత్రాన్ని నిర్మిస్తోంది.
ఇదిలా ఉంటే.. ఎవరూ ఊహించని విధంగా మిరాయ్ సినిమా ఎండిరగ్‌లో ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు. ఆ సినిమా పేరు ‘మిరాయ్ జైత్రాయ’. ఇందులో రానా దగ్గుబాటి విలన్‌గా కనిపించనున్నాడు. ‘మిరాయ్’లో మంచు మనోజ్ విలన్‌గా నటించిన విషయం తెలిసిందే. తేజ ప్రస్తుతం రెండు సినిమాలు పూర్తి చెయ్యాల్సి ఉంది. ఆ తర్వాతే ‘మిరాయ్ జైత్రాయ’ సెట్స్‌పైకి వెళ్తుందని తెలుస్తోంది. ఒక్క సినిమాతోనే పాన్ ఇండియా హీరో అనిపించుకున్న తేజ.. ఇప్పుడు మిరాయ్‌తో టాప్ హీరోల రేంజ్‌కి చేరుకున్నాడని చెప్పొచ్చు. మరి రాబోయే సినిమాల ద్వారా మరెన్ని సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



