అవార్డుల్లో ‘జై భీమ్’ రికార్డు.. మంచి సినిమాకి దక్కిన అరుదైన గౌరవం!
on Jan 30, 2026
2016 నుంచి 2022 వరకు విడుదలైన తమిళ సినిమాలకు సంబంధించి స్టేట్ ఫిలిం అవార్డులను ప్రకటించింది తమిళనాడు ప్రభుత్వం. ఇందులో హీరో సూర్య నటించి నిర్మించిన ‘జై భీమ్’ చిత్రం ఏకంగా 7 అవార్డులను గెలుచుకొని రికార్డు సష్టించింది. 2021లో విడుదలైన ఈ సినిమా అత్యధిక అవార్డులు సాధించింది. ఉత్తమ చిత్రంతో పాటు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమనటి, ఉత్తమ విలన్, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ నేపథ్య గాయకుడు.. ఇలా ఏడు పురస్కారాలు దక్కించుకుంది. ఫిబ్రవరి 13న ఈ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది.
ఒక మంచి సామాజిక అంశంతో తెరకెక్కిన ‘జై భీమ్’ చిత్రానికి జాతీయ అవార్డులు లభిస్తాయని అందరూ భావించారు. కానీ, ఏ విభాగంలోనూ ఈ చిత్రానికి పురస్కారం దక్కలేదు. అదే సంవత్సరం విడుదలైన ‘పుష్ప’ చిత్రానికిగాను అల్లు అర్జున్‌కు ఉత్తమ నటుడు అవార్డు లభించింది. తెలుగు సినిమా చరిత్రలో ఒక నటుడికి జాతీయ అవార్డు రావడం అనేది అదే తొలిసారి. అయితే ‘జై భీమ్’ చిత్రానికి ఎలాంటి గౌరవం దక్కకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వచ్చాయి. ఒక సామాజిక అంశంతో తీసిన సినిమాని గుర్తించకుండా, స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన సినిమాలో నటించిన అల్లు అర్జున్‌కి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు ప్రకటించడం సమంజసం కాదని పలువురు నిరసన వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే.. తాజాగా తమిళనాడు ప్రభుత్వం ప్రకటించిన ఫిలిం అవార్డుల్లో అత్యధిక శాతం ‘జై భీమ్’ చిత్రానికి లభించడం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందే ఫిలింఫేర్, ఆనంద వికటన్ సినిమా అవార్డ్స్, బోస్టన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్, నోయిడా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్, సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిలిం అవార్డ్స్‌లలో ‘జై భీమ్’ చిత్రానికి పలు విభాగాల్లో అవార్డులు లభించాయి. వాటిలో అత్యధికంగా లిజోమోల్ జోస్‌కి ఉత్తమ నటిగా ఏడు అవార్డులు లభించడం విశేషం. సూర్య ఉత్తమ నటుడిగా నాలుగు అవార్డులు అందుకున్నారు. అయితే తమిళనాడు స్టేట్ ఫిలిం అవార్డ్స్‌లో మాత్రం సూర్యకు అవార్డు దక్కకపోవడం గమనార్హం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



