తాత బాటలో సైఫ్-కరీనా కొడుకు!
on Oct 16, 2020

దివంగత మన్సూర్ అలీఖాన్ పటౌడీ అలియాస్ టైగర్ పటౌడీ పేరు వినని క్రికెట్ ప్రేమికులు ఉండరు. కేవలం 21 ఏళ్ల వయసుకే భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్ అయిన ఘనత ఆయన సొంతం. చిన్న వయసులోనే ఓ కారు యాక్సిడెంట్‌లో ఆయన ఓ కన్నును కోల్పోయారు. అయినప్పటికీ భారతీయ క్రికెట్ హిస్టరీలో తనదైన పేజీని ఆయన లిఖించుకున్నారు. ఇప్పుడు ఆయన మనవడు, సైఫ్ అలీఖాన్, కరీన్ కపూర్ ముద్దుల తనయుడు తైమూర్ అలీఖాన్ తాతయ్య అడుగుజాడల్లో నడిచేందుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది.
ఇదివరకు ఓసారి తైమూర్ క్రికెటర్ కావాలని తను ఆశిస్తున్నట్లు కరీనా చెప్పింది. ఇప్పుడు అమ్మ మాటను నిజం చేసే దిశగా, పిన్న వయసులోనే అతను జెంటిల్‌మన్ స్పోర్ట్‌ను ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు. ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా తైమూర్ క్రికెట్ ఆడుతున్న పిక్చర్‌ను షేర్ చేసింది కరీనా. అందులో తనకంటే పొడుగు ఉన్న క్రికెట్ బ్యాట్‌ను పట్టుకొని, బాల్‌ను కొట్టేందుకు ప్రయత్నిస్తోన్న తైమూర్ కనిపిస్తున్నాడు. ఆ పిక్చర్‌తో పాటు "ఐపీఎల్‌లో ఏదైనా ప్లేస్ ఉందా? నేను కూడా ఆడగలను" అనే క్యాప్షన్ జోడించింది.
పటౌడీ, షర్మిల దంపతుల తనయుడు సైఫ్ అలీఖాన్ తండ్రి అడుగుజాడల్లో కాకుండా తల్లిని అనుసరించి నటుడిగా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ఇప్పుడు అతని కొడుకు తాత బాటలో నడిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఫ్యూచర్‌లో అతను క్రికెటర్ అవుతాడా, లేక తండ్రిలా నటుడవుతాడా.. చూడాలి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



