'సైరా' ఫస్ట్ డే కలెక్షన్ అంచనా ఎంతో తెలుసా?
on Oct 1, 2019
మరికొన్ని గంటల్లో 'సైరా.. నరసింహారెడ్డి' సినిమా విడుదల కాబోతోంది. తెలుగు సహా దక్షిణ భారతావనిలోని నాలుగు భాషలతో పాటు హిందీలోనూ.. వెరసి ఐదు భాషల్లో భారీ లెవల్లో విడుదలవుతుండటంతో 'సైరా' ఓపెనింగ్స్ ఏ స్థాయిలో ఉంటాయనే దానిపై దేశవ్యాప్తంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్ద చర్చే నడుస్తోంది. అన్ని భాషల్లో కలిపి మొదటి రోజు.. అంటే.. అక్టోబర్ 2న 35 కోట్ల నుంచి 40 కోట్ల రూపాయల మధ్య షేర్ వసూలయ్యే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ప్రభాస్ 'సాహో' మూవీ తొలిరోజు తెలుగునాట 36 కోట్ల రూపాయలు వసూలు చేసి టాప్ 2లో నిలిచింది. ఫస్ట్ ప్లేస్‌లోనూ ప్రభాస్ సినిమాయే ఉంది. అది.. 'బాహుబలి 2'. ఇప్పట్లో ఏ మూవీ అందుకోలేని రేంజిలో ఆ మూవీ నలభై రెండున్నర కోట్ల రూపాయల షేర్ రాబట్టింది. మెగాస్టార్ కంబ్యాక్ ఫిల్మ్ 'ఖైదీ నంబర్ 150'.. మొదటి రోజు 23 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. ఈ లెక్కల్ని చూస్తే, 'సైరా' మొదటి రోజు తెలుగునాట 25 కోట్ల రూపాయల మార్కును ఈజీగా దాటేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అదే జరిగితే.. మిగతా భాషలన్నీ కలిపి 15 కోట్ల షేర్ వసూలు చేసినా 40 కోట్ల మార్కును దాటగల అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఎంత తక్కువ అంచనా వేసుకున్నా 35 కోట్ల మార్కును కచ్చితంగా క్రాస్ చేస్తుందనేది విశ్లేషకుల మాట.
రేనాటి సూర్యుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా సురేందర్ రెడ్డి డైరెక్ట్ చెయ్యగా, రాంచరణ్ నిర్మించిన 'సైరా' మూవీ ప్రి రిలీజ్ బిజినెస్ విలువ 190 కోట్ల నుంచి 200 కోట్ల రూపాయల మధ్య ఉంటుందని ట్రేడ్ పండిట్స్ చెబుతున్నారు. నైజాంగా వాడుకలో ఉన్న తెలంగాణ థియేట్రికల్ రైట్స్‌ను 'సాహో' ప్రొడక్షన్ కంపెనీ యు.వి. క్రియేషన్స్ 30 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. 'సాహో' నైజాం రైట్స్‌తో పోలిస్తే ఇవి 10 కోట్ల రూపాయలు తక్కువ. రాయలసీమ హక్కులు 20 కోట్ల రూపాయలకు అమ్ముడుపోగా, ఆంధ్రా ఏరియా మొత్తం కలిపి 58 కోట్లు వెచ్చించారు బయ్యర్లు. సో.. తెలుగునాట మూడు ఏరియాల్లో 'సైరా'పై బయ్యర్లు వెచ్చించిన డబ్బు 108 కోట్ల రూపాయలని విశ్లేషకులు తెలిపారు.
బయటి ఏరియాల విషయానికి వస్తే.. కర్ణాటక హక్కులు 27 కోట్లకూ, ఓవర్సీస్ రైట్స్ 18 కోట్లకూ అమ్ముడుపోయాయి. నార్త్ ఇండియా, తమిళనాడు, కేరళ హక్కులు కలిపి 40 కోట్ల రూపాయల విలువ చేస్తాయని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రాంతాల్లో 'సైరా'ను లోకల్ డిస్ట్రిబ్యూటర్స్ సహకారంతో రాంచరణ్ స్వయంగా రిలీజ్ చేస్తున్నాడు. ఈ లెక్కల ప్రకారం 'సైరా' థియేట్రిల్ రైట్స్ వాల్యూ 190 కోట్ల రూపాయలు దాటుతున్నాయి.
'సైరా'ను 300 కోట్ల భారీ బడ్జెట్‌తో రాంచరణ్ నిర్మించాడని చిరంజీవి స్వయంగా ప్రమోషనల్ ఈవెంట్స్‌లో చెప్పుకుంటూ వస్తున్నారు. అదే నిజమైతే.. థియేట్రికల్ రైట్స్ పోగా మిగతా సుమారు 110 కోట్ల రూపాయలు ఎలా సమకూడుతాయనేది ప్రశ్న. తెలుగు శాటిలైట్, హిందీ శాటిలైట్, డిజిటల్ రైట్స్ అన్నీ కలిపి మరో 50 కోట్ల నుంచి 60 కోట్ల రూపాయల వరకు విలువ చేయొచ్చు. అప్పటికీ ఇంకా లోటు తేలుతుంది.
హిందీలో 'సైరా' మూవీకి హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ మూవీ 'వార్' నుంచి గట్టి పోటీ నెలకొనడం మైనస్ అవుతోంది. హిందీ బెల్ట్‌లో 'సైరా'కు 1500 స్క్రీన్స్ లభించే ఛాన్సెస్ ఉన్నాయని నిన్నటి దాకా వినిపించగా, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం 1000 స్క్రీన్స్ కూడా లభించడం లేదంటున్నారు. అలాగే తమిళ వెర్షన్‌కు శివ కార్తికేయన్ మూవీ 'నమ్మ వీట్టు పిళ్లై' నుంచి ప్రతిఘటన ఎదురవుతోంది. సెప్టెంబర్ 27న రిలీజైన ఆ మూవీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని మంచి కలెక్షన్స్‌ను సాధిస్తోంది. దానికితోడు ధనుష్ హీరోగా వెట్రిమారన్ డైరెక్ట్ చేసిన 'అసురన్' మూవీ అక్టోబర్ 4న విడుదలవుతోంది. ఈ రెండు సినిమాల ధాటిని తట్టుకొని ఆ రాష్ట్రంలో 'సైరా' నెగ్గుకు రావాల్సి ఉంది.
ఇలా ప్లస్‌లు, మైనస్‌లను లెక్కలోకి తీసుకుంటే.. మొదటిరోజు 'సైరా' ప్రపంచవ్యాప్తంగా 40 కోట్ల రూపాయల దాకా షేర్ సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అంచనాలు ఏ మేరకు నిజమవుతాయనే విషయం అక్టోబర్ 3 మధ్యాహ్నం లోపు స్పష్టమవుతుంది.