అక్రమ మైనింగ్‌పై దర్యాప్తు చేయించండి.. సుమలత డిమాండ్!
on Jul 22, 2021
.jpg)
పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యే నిమిత్తం ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న నటి, పార్లమెంటు సభ్యురాలు సుమలత.. మాండ్య ఏరియాలో కృష్ణ రాజ సాగర్ (కేఆర్ఎస్) డ్యామ్‌కు ముప్పుగా ఉన్న అక్రమ మైనింగ్‌పై ఉన్నత స్థాయి దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షేఖావత్, ప్రహ్లాద్ జోషిలను కలిశారు. భారీ పేలుడు పదార్ధాలతో నిరంతరాయంగా అక్రమ్ మైనింగ్ జరుగుతుండటంతో ఆ ప్రాంతంలో ప్రజల ఆవాసానికి పెను ముప్పు ఏర్పడటమే కాకుండా పర్యావరణ పరంగా తీవ్ర నష్టం కలుగుతోందని వారికి అందజేసిన లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు.
వారికి ఆమె అందజేసిన లేఖ సారాంశం ఇలా ఉంది: “కృష్ణ రాజ సాగర్ రిజర్వాయర్ ఒక చారిత్రక, ఇంజనీరింగ్ అద్భుతం. ఇది శ్రీరంగపట్న తాలూకాలో, నా నియోజకవర్గం పరిధిలో ఉంది. దీనిని మైసూర్ మహారాజా కృష్ణ రాజా వడియార్ IV నిర్మించారు. సర్ ఎం. విశ్వేశ్వరయ్య డిజైన్ చేశారు. కోట్లాది మంది కర్ణాటక, తమిళనాడు ప్రజలకు సంబంధించి దీనికి సాంస్కృతిక, పర్యావరణ, ఆచరణాత్మక ప్రాముఖ్యత ఉంది. జలాశయానికి జరుగుతున్న, రాబోయే నష్టం గురించి మీకు తెలియజేయడం నా ప్రాథమిక కర్తవ్యం. రిజర్వాయర్ నిర్మాణానికి 20 కిలోమీటర్ల వ్యాసార్థం లోపల భారీ పేలుడు పదార్థాల వాడకం వల్ల కేఆర్ఎస్ రిజర్వాయర్ స్ట్రక్చర్‌కు నష్టం కలుగుతుందనే అంశంపై గౌరవనీయ సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది కూడా. అయినప్పటికీ భారీ పేలుడు పదార్థాలు, పేలుళ్లతో నిరంతరాయంగా అక్రమ మైనింగ్ ఇప్పటికీ జరుగుతోందని నా దృష్టికి వచ్చింది. నా సందర్శనల సమయంలో, పరిసరాల్లోని గ్రామాల నివాసితుల నుండి నాకు క్రమం తప్పకుండా ఫిర్యాదులు వస్తున్నాయి. నేను అందుకున్న కొన్ని ఫిర్యాదులు ఏవంటే;
1. భారీ పేలుడు పదార్థాల ద్వారా బ్లాస్టింగ్, దాని పర్యవసానంగా కలుగుతున్న తీవ్ర ప్రకంపనల కారణంగా కేఆర్ఎప్ రిజర్వాయర్ నిర్మాణానికి తీవ్ర నష్టం సంభవించే ప్రమాదం ఉంది.
2. అక్రమ మైనింగ్ కార్యకలాపాలు గాలి, నీటి కాలుష్యానికీ కారణమవుతూ, మానవ నివాసానికి పర్యావరణ ప్రమాదాలు కలుగజేస్తాయి. తరచుగా గర్భస్రావాలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కలిగిస్తాయి.
3. ప్రఖ్యాత రంగనతిట్టు పక్షుల అభయారణ్యం వద్ద దేశీయ, అంతరించిపోతున్న జాతులతో సహా జంతువుల ప్రాణాలకు ముప్పు ఉంది, పశుగ్రాసం కొరత ఏర్పడుతుంది.
4. త్రాగునీటి వనరులకు నష్టం (పేలుడు నుండి వెలువడే శిధిలాల వల్ల కలుషితమయ్యాయి) కలగడమే కాకుండా, భూగర్భ జలాలు క్షీణించాయి.
5. ప్రబలమైన అక్రమ మైనింగ్ కార్యకలాపాలు జరుగుతున్న ప్రాంతాల చుట్టూ ఉన్న గ్రామాలలో నిర్మాణాలు కూలిపోతున్నాయి. ఇళ్ల కిటికీల రెక్కలు విరిగిపోతూ నివాసాలకు నష్టం కలుగుతోంది.
6. కాలుష్యం వల్ల, నేల దెబ్బతినడం వల్ల వ్యవసాయ కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం కలుగుతోంది.
7. నాగర్హోల్, బండిపూర్ జాతీయ రిజర్వ్ ఫారెస్ట్‌లు ఆక్రమణకు గురయ్యే, కోలుకోలేని నష్టానికి గురయ్యే ప్రమాదం ఉంది.
8. మనుషుల ప్రాణాలకు ముప్పు ఉంది. ప్రబలిన అక్రమ మైనింగ్ గురించి ఫిర్యాదు చేయడానికి సంబంధిత అధికారులను సంప్రదిస్తే ఎన్నికైన, ఇతర ప్రభుత్వ అధికారుల నుండి వచ్చిన భయంకరమైన బెదిరింపుల కారణంగా పలువురు రైతులు ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. కృష్ణ రాజ సాగర (కెఆర్ఎస్) రిజర్వాయర్, కర్ణాటక నదులు చాలా సంవత్సరాలుగా నా కుటుంబానికి చాలా దగ్గరగా ఉన్న ఒక బాధ్యత. పైన పేర్కొన్న సమస్యలపై మీ ప్రమేయం.. భవిష్యత్తులో జిల్లాలోని ఆవాసయోగ్యత, అంతకుమించి లక్షలాది మంది కన్నడిగుల జీవితాలలో నిర్ణయాత్మకంగా ఉంటుంది."
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



