'గాడ్ ఫాదర్' టైటిల్ కోసం ఇంత రచ్చ జరిగిందా!
on Oct 13, 2022

మెగాస్టార్ చిరంజీవి సినిమాకి 'గాడ్ ఫాదర్' అనే టైటిల్ పెట్టగానే ఫ్యాన్స్ ఎంతో సంబరపడ్డారు. ఆయన స్టార్ డమ్ కి తగిన టైటిల్ అని అభిప్రాయపడ్డారు. అయితే ఈ టైటిల్ కోసం చిన్నపాటి యుద్ధమే జరిగిందట. సినిమా రిలీజ్ కి కొద్దిరోజుల ముందు టైటిల్ మార్చాల్సి వస్తుందేమోనని మేకర్స్ ఆందోళన చెందారట.
చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ 'గాడ్ ఫాదర్' దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదలై సూపర్ టాక్ తో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ టీమ్ మీడియాతో ముచ్చటించింది. ఈ ప్రెస్ మీట్ లో నిర్మాత ఎన్వీ ప్రసాద్, డైరెక్టర్ మోహన్ రాజా, మ్యూజిక్ డైరెక్టర్ థమన్, నటుడు సత్యదేవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టైటిల్ కి సంబంధించి ఆసక్తికరమైన విషయాన్ని రివీల్ చేశారు ఎన్వీ ప్రసాద్.

మొదటి ఈ చిత్రానికి 'సర్వాంతర్యామి' అని వర్కింగ్ టైటిల్ అనుకున్నారు. ఆ తర్వాత 'గాడ్ ఫాదర్' అనే టైటిల్ ని థమన్ సూచించాడు. చిరంజీవి ఇమేజ్ ని, సినిమాలో ఆయన పోషించిన పాత్రని పరిగణలోకి తీసుకొని 'గాడ్ ఫాదర్' అనే టైటిల్ బాగుంటుందని థమన్ చెప్పగా.. మూవీ టీమ్ అంతా ఆ టైటిల్ కే ఓటేశారు. టైటిల్ ని అనౌన్స్ చేయడం, ఆడియన్స్ కి నచ్చడం అన్నీ జరిగిపోయాయి. అయితే విడుదలకి ఇంకో నెల రోజులు ఉందనగా ఊహించని షాక్ తగిలిందట.
తెలుగులో 'గాడ్ ఫాదర్' టైటిల్ ని అప్పటికే డైరెక్టర్ సంపత్ నంది రిజిస్టర్ చేసుకున్నారని, కానీ తాము అడగ్గానే ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా వెంటనే ఇచ్చేశారని ఎన్వీ ప్రసాద్ తెలిపారు. అయితే సినిమా విడుదలకు కొద్దిరోజుల ముందు ఇండియాలోనూ 'గాడ్ ఫాదర్' టైటిల్ కాపీ రైట్స్ తమకే సొంతం అంటూ హాలీవుడ్ సంస్థ పారామౌంట్ పిక్చర్స్ నుంచి లీగల్ నోటీసులు రావడంతో షాక్ అయ్యామని చెప్పారు. ఇప్పటికే టైటిల్ ప్రకటించాం.. ఏం చేయాలి? అని కాస్త సతమతమయ్యామని, ముందు జాగ్రత్తగా ఇతర టైటిల్స్ కూడా కొన్ని పరిశీలించామని అన్నారు. అలాగే పారామౌంట్ వారితో చర్చలు జరిపి తెలుగులో 'గాడ్ ఫాదర్'గా, హిందీ 'మెగాస్టార్ గాడ్ ఫాదర్'గా, ఓవర్సీస్ లో 'మెగా153 గాడ్ ఫాదర్' గా విడుదల చేస్తామని చెప్పడంతో వారు అంగీకరించారని చెప్పుకొచ్చారు. పారామౌంట్ వాళ్ళు ఒప్పుకోకపోయినట్లైతే మెగాస్టార్ సినిమాకి 'గాడ్ ఫాదర్' లాంటి పవర్ ఫుల్ టైటిల్ మిస్ అయ్యేది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



