హీరో విశాల్ ఇంటిపై రాళ్ల దాడి
on Sep 28, 2022
తమిళ్ హీరో విశాల్ ఇంటిపై రాళ్ల దాడి కలకలం రేపుతోంది. గుర్తు తెలియని వ్యక్తులు విశాల్ ఇంటి పైకి రాళ్లు విసరడంతో ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయి. అయితే ఈ దాడిలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు.
చెన్నైలోని అన్నానగర్ లో తన కుటుంబ సభ్యులతో కలిసి విశాల్ నివసిస్తున్నాడు. సోమవారం అర్థరాత్రి కారులో వచ్చిన దుండగులు ఆయన ఇంటిపై రాళ్లు విసిరి పరారయ్యారు. అయితే ఆ సమయంలో విశాల్ ఇంట్లో లేరని, షూటింగ్ కోసం ఔట్ డోర్ వెళ్లారని తెలుస్తోంది. ఈ దాడికి సంబంధించిన విజువల్స్ సీసీటీవీలో రికార్డు అయ్యాయి. సీసీటీవీ ఫుటేజ్ ఆధారాలతో విశాల్ మేనేజర్ అన్నా నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.
నటుడిగా వరుస సినిమాలతో బిజీగా ఉన్న విశాల్ సినీ, రాజకీయాలకు చెందిన పలు అంశాల్లో తలదూరుస్తూ ఉంటాడు. నడిగర్ సంఘం జనరల్ సెక్రటరీగా పని చేసిన విశాల్ తమిళ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యాడు. ఆ సమయంలో విశాల్ కి పలువురితో విభేదాలు తలెత్తాయి. సినీ పరిశ్రమ పాలిట భూతమైన పైరసీ పైనా పోరాడుతుంటాడు. అలాగే జయలలిత మరణం తర్వాత ఆర్కే నగర్ ఉపఎన్నిక కోసం ఇండిపెండెంట్ గా నామినేషన్ వేయగా ఆయన నామినేషన్ రిజెక్ట్ అయింది. కొందరు కుట్ర చేసి తాను ఎన్నికల్లో పోటీ చేయకుండా చేశారని ఆ సమయంలో విశాల్ ఆరోపించాడు. మరి తాజాగా విశాల్ ఇంటిపై జరిగిన రాళ్ల దాడి వెనక రాజకీయ కారణాలు ఉన్నాయా? లేక ఇది అల్లరి మూకల పనా? అనేది తెలియాల్సి ఉంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
