SSMB 28 సెకండ్ షెడ్యూల్ ఎప్పుడంటే...
on Oct 18, 2022

మహేశ్‌బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే.. ఆ కిక్కే వేరు! వారి కలయికలో వచ్చిన మొదటి సినిమా 'అతడు'ని అభిమానించని వాళ్లెవరైనా ఉంటారా? పార్థు (మహేశ్)తో, పూరి (త్రిష)తో ప్రేమలో పడని వాళ్లెవరు!! తర్వాత వచ్చిన 'ఖలేజా' బాక్సాఫీస్ దగ్గర ఎక్స్‌పెక్ట్ చేసిన విధంగా ఆడకపోవచ్చు గాక.. ఆ పిక్చరైజేషన్, ఆ డైలాగ్స్, మహేశ్ డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ అండ్ డైలాగ్ మాడ్యులేషన్‌ను విమర్శకులు, అసలైన సినీ ప్రియులు మెచ్చారు.
ఇప్పుడు వారి కాంబినేషన్‌లో ముచ్చటగా మూడో సినిమా తయారవుతోంది. 'SSMB 28' పేరుతో రూపొందుతోన్న ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ సెప్టెంబర్‌లో జరిగింది. ఫైట్‌మాస్టర్స్ అన్బరివ్ (అన్బు-అరివు) సారథ్యంలో హై ఆక్టేన్ యాక్షన్ సీన్స్‌ను మొదటగా చిత్రీకరించాడు డైరెక్టర్ త్రివిక్రమ్. వరుసగా నైట్ షూట్ చేయడం వల్ల యూనిట్ మెంబర్స్ బాగా అలసిపోయారు.
దసరా తర్వాత అక్టోబర్ 10 నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో రెండో షెడ్యూల్ చెయ్యాలని నిర్మాత ఎస్. రాధాకృష్ణ ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్‌లో హీరోయిన్ పూజా హెగ్డే జాయిన్ అవుతుందని కూడా వినవచ్చింది. ఇంతలో మహేశ్ మాతృమూర్తి ఇందిరాదేవి మృతి చెందడంతో.. షెడ్యూల్‌లో మార్పు చోటు చేసుకుంది. అమ్మ మృతి విషాదం నుంచి కోలుకోవడానికి ఫ్యామిలీని తీసుకొని ఫారిన్ టూర్‌కు వెళ్లాడు మహేశ్. దీంతో నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి రెండో షెడ్యూల్ జరపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
షూటింగ్ షెడ్యూల్‌లో మార్పులు జరిగినప్పటికీ, రిలీజ్ డేట్‌లో ఎలాంటి మార్పూ ఉండదని సమాచారం. 2023 ఏప్రిల్ 28న ఈ మూవీని విడుదల చేయనున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తోన్న ఈ సినిమా టైటిల్‌ను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



