స్వాతంత్ర్య పూర్వం బ్రిటిషర్లు మనకు విలన్లు కాదా?.. రాజమౌళి అలా సర్దిచెప్పాడేంటి!
on Sep 21, 2022

బ్రిటిషర్ల కాలంలో దేశీయులు ఎన్ని కష్టనష్టాలు అనుభవించారో చరిత్ర గురించి ఏమాత్రం తెలిసిన వాళ్లెవరైనా చెప్తారు. బ్రిటిషర్ల నుంచి స్వాతంత్ర్యం కోసం పోరాటంలో ఎంతమంది అసువులు బాసారో! భగత్ సింగ్ లాంటి ఎంతమంది వీరపుత్రులను బ్రిటిషర్లు ఉరివేసి, తుపాకులతో కాల్చి చంపారో! మహాత్మా గాంధీ ఆధ్వర్యంలో చివరకు మనం స్వాతంత్రం సంపాదించుకున్నాం! ఇది చాలామందికి తెలిసిన విషయమే. అయితే 1920ల కాలం నేపథ్యంలో తీసిన 'ఆర్ఆర్ఆర్' మూవీలో బ్రిటిషర్లను విలన్లుగా చూపించడంపై ఎదురైన ప్రశ్నకు తాను చరిత్ర చెప్పలేదనీ, బ్రిటిష్ వ్యక్తిని విలన్‌గా చూపించిన మాత్రాన బ్రిటిషర్లు అందరినీ తాను విలన్లు అని చెప్పినట్లు కాదనీ సమాధానమిచ్చి ఆశ్చర్యపరిచాడు డైరెక్టర్ యస్.యస్. రాజమౌళి.
'ఆర్ఆర్ఆర్' మూవీ ప్రపంచవ్యాప్తంగా ఇటు ప్రేక్షకుల, అటు విమర్శకుల ఆదరణను పొందిందనడంలో సందేహం లేదు. ఇండియాలోనే కాకుండా, పాశ్చాత్య దేశాల్లో, హాలీవుడ్‌లోనూ ఆ సినిమాకి అభిమానులుగా మారిన వారెందరో! అయితే ఆ మూవీలో బ్రిటిషర్లను విలన్లుగా చిత్రీకరించడంపై యూకేలో కొంతమంది నుంచి విమర్శలు వచ్చాయి.
యు.ఎస్.లో జరిగిన 'ఆర్ఆర్ఆర్' స్క్రీనింగ్ తర్వాత ఏర్పాటు చేసిన మీడియా ఇంటరాక్షన్‌లో ఎదురైన ప్రశ్నకు, "సినిమా మొదట్లోనే డిస్‌క్లైమర్ కార్డ్‌ను మీరు చూశారు. దాన్ని చూడ్డం మిస్సయినా కూడా, అది చరిత్ర పాఠం కాదు. అదొక కథ. సాధారణంగా ప్రేక్షకులు దాన్ని అర్థం చేసుకుంటారు. విలన్‌గా ఒక బ్రిటిషర్ నటిస్తే, బ్రిటిషర్లందరూ విలన్లు అని నేను చెప్పడం లేదని వాళ్లు అర్థం చేసుకుంటారు. నా హీరోలు భారతీయులైతే, భారతీయులందరూ హీరోలని వారు అర్థం చేసుకుంటారు. ఈ సినిమాలో ఒక వ్యక్తి విలన్, ఒక వ్యక్తి హీరో. ఆ విషయం ఆటోమేటిగ్గా అర్థమైపోతుంది. వారికి అన్ని విషయాలపై అవగాహన ఉండకపోవచ్చు, కానీ వారికి భావోద్వేగ మేధస్సు ఎక్కువగా ఉంటుంది. ఒక కథకునిగా ఆ విషయం మనం అర్థం చేసుకుంటే, మిగతా విషయాల గురించి వర్రీ అవ్వాల్సిన పనిలేదు" అని ఆయన చెప్పుకొచ్చాడు.
జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా నటించిన 'ఆర్ఆర్ఆర్' ఫిల్మ్ భారత్ నుంచి అధికారిక ఎంట్రీగా ఆస్కార్‌కు వెళ్లే అవకాశాన్ని సాధించలేకపోయింది. గుజరాతీ ఫిల్మ్ ఛెల్లో షోకు ఆ ఛాన్స్ దక్కింది. అయినప్పటికీ ఆస్కార్స్ 2023లో అన్ని కేటగిరిలకు ఆర్ఆర్ఆర్‌ను పరిగణనలోకి తీసుకోవాల్సిందిగా యు.ఎస్‌లో ఆ మూవీని డిస్ట్రిబ్యూట్ చేసిన వేరియన్స్ ఫిలిమ్స్ కోరింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



